చైనా రుణంతో నేపాల్‌లోని లుంబినీ, పోఖ్రాలలో నిర్మితమైన రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉపయోగంలో లేనివిగా మారాయి. ఈ రెండు విమానాశ్రయాల్లో టెర్మినల్ భవనం నుంచి రన్‌వే వరకు నిర్మాణం చాలా కాలం క్రితమే పూర్తయింది. ప్రతిరోజూ ఒకటోరెండో దేశీయ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ అవుతున్నాయి. అయితే ఈ విమానాశ్రయాలు ఇప్పటికీ అంతర్జాతీయ విమానాల రాక కోసం వేచి చూస్తున్నాయి.
ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని చూసి వ్యాపార దృష్టితో పెద్దఎత్తున అప్పులు చేసి, భూములు కొని, విలాసవంతమైన హోటళ్లను నిర్మించినవారు ఇప్పుడు ఆదాయం లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఈ హోటళ్లు నిత్యం ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది బౌద్ధ పర్యాటకులు లుంబినీని సందర్శిస్తారు. అయితే వారిలో ఎక్కువ మంది ఖాట్మండు నుండి దేశీయ విమానాల ద్వారా నగరానికి చేరుకుంటారు. పోఖ్రాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అటు లుంబినీ, ఇటు పోఖ్రాలో పర్యాటకులు ఎందుకు పెరగడం లేదు?
లుంబినీ, పోఖ్రాలలో అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించినా పర్యాటకుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవడానికి భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలే కారణమని నేపాల్ అభిప్రాయపడింది. లుంబినీ డెవలప్‌మెంట్ ట్రస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 2022లో నేపాల్ ప్రభుత్వం చైనా రుణంతో గౌతమబుద్ధ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి 76 మిలియన్ డాలర్ల మొత్తాన్ని వెచ్చించింది. గత ఏడాది మేలో ఈ విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభించింది. లుంబినీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భైరహవా విమానాశ్రయం అని కూడా అంటారు. ఈ విమానాశ్రయం కారణంగా పర్యాటకులు రాజధాని ఖాట్మండు నుండి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించే బదులు నేరుగా లుంబినీకి చేరుకోవచ్చు. అయినప్పటికీ పర్యాటకుల సంఖ్యలో ఊహించిన పెరుగుదల కనిపించడం లేదు.
లుంబినీ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానాలు క్రమం తప్పకుండా నడిస్తే విదేశీ పర్యాటకుల రాక పెరుగుతుందని విమానయాన, పర్యాటక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ తన గగనతలం గుండా విమానాలు పశ్చిమ దిశగా వెళ్లేందుకు నిరాకరించిందని నేపాలీ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే గౌతమ బుద్ధ విమానాశ్రయానికి చేరుకోవడానికి విమానాలేవీ భారతదేశం మీదుగా ప్రయాణించలేవు. చిన్న విమానాలకు మాత్రమే మినహాయింపు ఉంది.
గత ఏడాది డిసెంబర్‌లో భారత్, చైనా సైన్యాల మధ్య ఘర్షణ జరిగింది. గౌతమబుద్ధ విమానాశ్రయం ట్రాఫిక్ కోసం తెరిచిన ఏడు నెలలకే ఈ ఘటన జరిగింది. 2020లో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో భారత్- చైనాల మధ్య ఎన్‌కౌంటర్ కూడా జరిగింది. ఇందులో 20 మంది భారతీయ ఆర్మీ సైనికులు అమరులయ్యారు. ఆ సమయంలో చైనా సైనికులు రెట్టింపు ప్రాణనష్టాన్ని చవిచూశారు.
కాగా ఖాట్మండు విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. 2015లో సంభవించిన శక్తివంతమైన భూకంపం కారణంగా దీనిని కొంతకాలం మూసివేశారు. పోఖ్రాలోని మూడో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లుంబినీ తరహా సంక్షోభాన్నే ఎదుర్కొంటోంది. పోఖ్రాలో అన్నపూర్ణ పర్వతాల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి. వీటిని చూసేందుకు ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఈ ఏడాది జనవరిలో కొత్తగా నియమితులైన నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ‘ఓం’ పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం?
Comments
Please login to add a commentAdd a comment