ఖాట్మండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ చైనాతో జతకట్టి, భారత్‌తో శత్రుత్వాన్ని పెంచుకునే దిశగా తప్పటడుగులు వేస్తున్నారు. ఈ నేపధ్యంలో భారత్, నేపాల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
చైనాపై ప్రత్యేక ప్రేమ కురిపిస్తున్న ఓలీ.. ఆ దేశపు సూచనల మేరకు భారత్‌తో సంబంధాలు దెబ్బతినేలా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ కేపీ ఓలీ తన తప్పుడు నిర్ణయాలతో భారతదేశంతో సంబంధాలను చెడగొట్టారు. ఇప్పుడు మళ్లీ అదే బాట పట్టారు. నేపాల్ ప్రభుత్వం తాజాగా తమ దేశ మ్యాప్‌లో భారతదేశంలో భాగంగా ఉన్న కొన్ని ప్రాంతాలను తమ దేశ ప్రాంతాలుగా చూపించాలని నిర్ణయించింది. ఇందుకోసం నేపాల్ కొత్త నోట్లను ఆయుధంగా వాడుకుంటోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్ త్వరలో సవరించిన మ్యాప్‌తో కొత్త బ్యాంక్ నోట్లను ముద్రించడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం.
ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ‘నేపాల్ ఖబర్ డాట్ కామ్’ తాజాగా నేపాల్ దేశ బ్యాంక్ జాయింట్ ప్రతినిధి డిల్లిరామ్ పోఖరేల్ తెలిపిన వివరాలను వెల్లడించింది. భారత్‌లో భాగమైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురాలతో కూడిన కొత్త మ్యాప్‌తో బ్యాంక్ నోట్ల ముద్రణను నేపాల్ దేశ బ్యాంక్ ఇప్పటికే ప్రారంభించిందని పేర్కొంది. ఏడాదిలోగా నోట్ల ముద్రణ పూర్తి కానున్నదని కూడా వెల్లడించింది.
కాగా, గతంలో అప్పటి నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ నేతృత్వంలోని నేపాల్ క్యాబినెట్ ఇటువంటి నిర్ణయం తీసుకుందని, సవరించిన మ్యాప్‌తో కూడిన కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు కేపీ శర్మ ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఇదేపని చేశారు. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర తమ భూభాగాలు అని భారత్ స్పష్టం చేసినప్పటికీ, చైనా సూచనలతో నేపాల్ ఈ దుశ్చర్యకు పాల్పడుతోదనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment