‘విభజన’ వేగం పెంచండి
అపెక్స్ కమిటీతో సీఎస్ భేటీ
అధికారుల కమిటీలన్నీ సమావేశమయ్యేలా నిర్దేశాలు
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ విభాగంలోకి మరో ఉప కార్యదర్శి
ఎల్లుండి రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రంగాల వారీగా నియమించిన అధికారుల కమిటీల్లో ఇంకా సగం కమిటీలు ఒక్క సారి కూడా సమావేశాలు కాలేదు. ప్రధానంగా రహదారులు - భవనాలు, రవాణా, వైద్య, ఆరోగ్యం, ఇరిగేషన్, న్యాయ తదితర రంగాలకు చెందిన కమిటీలు ఇంకా ఒక్క సారి కూడా సమావేశాలను నిర్వహించలేదు. ఉద్యోగులు, ఆర్థిక, ప్రభుత్వ రంగ సంస్థలు తదితర రంగాలపై ఏర్పాటైన కమిటీలు మాత్రమే సమావేశమయ్యాయి. అన్ని రంగాల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోను మే 31వ తేదీ కల్లా విభజన పనులు పూర్తి చేయించాలని పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శనివారం విభజనపై ఉన్నతస్థాయి కమిటీ కన్వీనర్ సత్యప్రకాశ్ టక్కర్‌తో సమావేశమై చర్చించారు.
ఇప్పటివరకు సమావేశం కాని కమిటీలతో వెంటనే సమావేశాలను ఏర్పాటు చేయించాలని, అన్ని రంగాల్లో విభజన పనిపై వేగం పెంచాలని సీఎస్ ఆదేశించారు. అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆదేశాలన్నీ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ విభాగం ద్వారానే చేయాల్సి ఉన్నందున ఆ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎస్ సూచించారు. ఇప్పటికే ఆ విభాగంలో అదనంగా ఉప కార్యదర్శిని నియిమించగా మరో ఉప కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు.
వచ్చే వారంలో గవర్నర్ సమీక్ష...
విభజన పని పురోగతిపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి మంగళవారం రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా వస్తున్నారు. విభజన పనుల పురోగతిపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా వచ్చే వారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విభజన అపెక్స్ కమిటీకి గవర్నర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శక సూత్రాల రూపకల్పనకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ కమలనాథన్ శనివారం సీఎస్ మహంతితోను, ఆర్థికశాఖ అధికారులు పి.వి.రమేశ్, రామకృష్ణారావులతోను సమావేశమై మార్గదర్శక సూత్రాల తీరుతెన్నులపై చర్చించారు.