Satya prakash Takkar
-
రూ.50 కోట్లతో డోన్ల బోర్డు ‘4.0’
హైదరాబాద్: ఎవరు పడితే వారు డ్రోన్లను వినియోగించకుండా నియత్రించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్రోన్లకు ప్రత్యేకంగా బోర్డు ‘4.0’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రూ.50 కోట్ల కార్పొస్ ఫండ్ తో బోర్డు ‘4.0’ను ఏర్పాటు చేయనున్నారు. సీసీ కెమెరాలు, అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కొనుగోలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్ ఆమోదం తెలిపారు. దీంతో గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశానికి బోర్డు ఏర్పాటు ప్రతిపాదనలు రానున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్లో భాగంగానే ఈ బోర్డు పనిచేయనుంది. ఐటీ శాఖ కార్యదర్శి, డీజీపీ సభ్యులుగా ఉంటారు. ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్లతో ఇష్టానుసారం చిత్రీకరిస్తారని, చిత్రీకరణకు ఒక హద్దు ఉండాలని, ఇందుకు ప్రత్యేకంగా మార్గదర్శకాలను రూపొందించాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రైవేట్ డ్రోన్ల వల్ల శాంతిభద్రతల విషయంలో కూడా ప్రమాదం ఉంటుందనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. రాష్ర్టంలో డ్రోన్లు ఎవరికి అవసరమైనా బోర్డు ద్వారానే పొందాలని నిబంధనను విధించనున్నారు. పెళ్లిళ్లు, ఇతర ఉత్సవాలు, బహిరంగ సభలు తదితర కార్యాకలాపాలకు కార్పొరేషన్ ద్వారానే డ్రోన్లను పొందాల్సి ఉంటుంది. ప్రైవేట్ కార్యకలాపాలకు డ్రోన్లను అద్దెకు ఇవ్వనున్నారు. గత ఏడాది గోదావరి పుష్కరాలతో పాటు, ఈ ఏడాది కష్ణా పుష్కరాల్లో డ్రోన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పటికీ ప్రై వేట్ రంగంలో డ్రోన్లు అయితే చిత్రీకరిస్తాయి. అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటే అవసరమైన మేరకే చిత్రీకరించేందుకు నియంత్రించే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుందనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యలోనే డ్రోన్ల నిర్వహించడం మంచిదేనని పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వ్యవసాయ రంగంలో కూడా డ్రోన్లను వినియోగిస్తామని ఇటీవల సీఎం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
ఏపీలో నివాసం ఉంటేనే స్థానికత
- ఎమ్మార్వో నుంచి సర్టిఫికెట్ పొందాలి - వ్యక్తి ఆధారంగా జారీ - ఉద్యోగి ఒక్కరే వెళితే ఆ ఉద్యోగికి మాత్రమే స్థానికత - నేడో, రేపో మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళ్లి ఆ రాష్ట్రంలో నివాసం ఉంటేనే ఏపీ స్థానికత కల్పించనున్నారు. స్థానికతకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) మార్గదర్శకాలను రూపొందించింది. ఈ ఫైలు సోమవారం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్య ప్రకాశ్ టక్కర్‌కు చేరింది. నేడో రేపో మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. 2017 జూన్ 2వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడ నివాసం ఉంటున్నవారు స్థానికత సరిఫికెట్ కోసం ఎమ్మార్వోకు దరఖాస్తు చేసుకోవాలి. ఎమ్మార్వో ఆ దరఖాస్తును పరిశీలించి, అక్కడ నివాసం ఉంటున్నట్టుగా తేలితే స్థానికత సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. స్థానికత సర్టిఫికెట్ వ్యక్తి ఆధారంగా మాత్రమే జారీ చేయనున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి మాత్రమే ఏపీకి వెళితే అతనికి మాత్రమే స్థానికత కల్పిస్తారు. ఆ ఉద్యోగి పిల్లలు హైదరాబాద్‌లోనే ఉంటే వారు తెలంగాణ స్థానికులుగా కొనసాగుతారు. రాష్ట్రం విడిపోయిన తేదీ నుంచి.. అంటే 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 2వ తేదీ మధ్యకాలంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ నుంచి ఏపీకి తరలివెళ్లే వారికి స్థానికత కల్పించేందుకు ఇటీవల రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, అలాగే ఉద్యోగాలకు స్థానికత వర్తించనుంది. -
ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో!
► అన్ని శాఖల అధికారులకు జారీ కానున్న ఆదేశాలు ► ఆ రెండు రోజులు సీఎం సమీక్షలకు అందుబాటు కోసమే హైదరాబాద్: ఇకపై అన్ని శాఖల ఉన్నతాధికారులు ప్రతి సోమ, మంగళవారాల్లో విజయవాడలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ ఆదేశాలు జారీ చేయడానికి నిర్ణయించారు. ప్రస్తుతం తరచూ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ శాఖలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలు ఎప్పుడు ఏ శాఖపై నిర్వహిస్తారో తెలియక అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్న ఫళంగా ‘సీఎం సమీక్ష నిర్వహిస్తారట, విజయవాడ రావాలంటూ’ సీఎం కార్యాలయం నుంచి హడావిడిగా ఫోన్లు రావడం, ఆదేశాలు అందుతుండడంతో సకాలంలో చేరుకోలేక అవస్థలకు గురవుతున్నారు. ఒకవేళ సమయానికి చేరుకున్నా ఒక్కోసారి సమీక్షలు గంటల తరబడి ప్రారంభం కావడం లేదు. దీంతో అధికారులకు నిరీక్షణ తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే వారంలో రెండు రోజులు సీఎం సమీక్షల కోసం అధికారులు విజయవాడలో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ నిర్ణయించారు. -
15 శాతం వృద్ధే లక్ష్యం
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ టక్కర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సత్యప్రకాశ్ టక్కర్ చెప్పారు. శనివారం సచివాలయంలో ఐ.వై.ఆర్. కృష్ణారావు నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రెండంకెల వృద్ధి సాధించడానికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. 15 శాతం వృద్ధి సాధించడం తేలికైన విషయం కాదని, అయినా అన్ని రంగాలు కష్టపడి పనిచేసేలాగ చర్యలు తీసుకోవడం ద్వారా అది సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టక్కర్ బాధ్యతలు స్వీకరణ అనంతరం పదవీ విరమణ చేసిన ఐ.వై.ఆర్. కృష్ణారావు కోసం సచివాలయ సాధారణ పరిపాలన శాఖ వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో టక్కర్‌తో పాటు డీజీపీ రాముడు, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి, సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఏపీపీఎస్సీ కార్యదర్శి ఎ.గిరిధర్, సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ పాల్గొన్నారు. కృష్ణారావు సమర్థంగా పనిచేశారు ఈ సందర్భంగా సీఎస్‌గా కృష్ణారావు చేసిన సేవలను ప్రశంసించారు. రాష్ట్ర విభజన లాంటి క్లిష్ట సమయంలో తొలి సీఎస్‌గా ఐ.వై.ఆర్. బాధ్యతలు చేపట్టి చాలా సమస్యలను అలవోకగా ఎదుర్కొన్నారని, విభజన అంశాల్లో ఎక్కడా రాజీపడకుండా వ్యవహరించారని కొనియాడారు. ఫైళ్ల క్లియరెన్స్ చాలా వేగంగా చేయడంలో, అనవసర చర్చలతో సమయాన్ని వృథా చేయకుండా అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కృష్ణారావు సాటిలేరన్నారు. ఉద్యోగ జీవితం సంతృప్తికరం : ఐ.వై.ఆర్ తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా ముగిసిందని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. సీఎస్‌గా పదవీవిరమణ సందర్భంగా ఆయన శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కమలనాథన్ కమిటీ నేతృత్వం లో ఉద్యోగుల పంపిణీ సజావుగానే సాగిందన్నారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేని అంశాల్లో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని, ఈ విషయంలో కేంద్రం విఫలమైందన్నారు. కాలయాపనకే ఉప కమిటీ రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతం గా ఉన్న సమస్యలపై తాజాగా కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఉప కమిటీని ఏర్పాటు చేయడం పట్ల ఐ.వై.ఆర్. కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖకు ఘాటైన లేఖ రాశారు. పదవీ విరమణ చేయడానికి రెండు రోజుల ముందు అంటే జనవరి 27న కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఈ లేఖ రాశారు. కాలయాపనకే ఈ కమిటీ వేశారన్నారు. -
ఏపీసీఎస్గా బాధ్యతలు స్వీకరించిన టక్కర్
- ఐ.వై.ఆర్. సేవలను కొనియాడిన సాధారణ పరిపాలన శాఖ, ఐఏఎస్‌ల సంఘం - విభజన క్లిష్ట సమయంలో పాలనను సజావుగా నడిపించారని ప్రశంస - పైలైట్‌గా టక్కర్ సజావుగా టేకాఫ్ చేస్తారని ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సత్యప్రకాశ్ టక్కర్ స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో ఐ.వై.ఆర్. కృష్ణారావు నుంచి సీఎస్‌గా టక్కర్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో డబుల్ డిజిట్ వృద్ధి సాధించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. 15 శాతం వృద్ధి సాధించడం అంత తేలికైన విషయం కాదని, అయినా అన్ని రంగాలు కష్టపడి పనిచేసేలాగ చర్యలు తీసుకోవడం ద్వారా వృద్ధి సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. కరువు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందిస్తామని, తద్వారా వృద్ధిపై కరువు ప్రభావాన్ని వీలైనంత మేర తగ్గిస్తామన్నారు. ఇటీవల ముగిసిన భాగస్వామ్య సదస్సు ద్వారా వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదలకు ఇళ్ల నిర్మాణంతో పాటు మిగతా అన్ని విషయాలపై త్వరలో ముఖ్యమంత్రితో సమావేశమై అందుకు అనుగుణంగా చర్యలను తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. టక్కర్ బాధ్యతలు స్వీకరణ అనంతరం పదవీ విరమణ చేసిన ఐ.వై.ఆర్. కృష్ణారావుకు వీడ్కోలు సభను సచివాలయ సాధారణ పరిపాలన శాఖ నిర్వహించింది. ఈ వీడ్కోలు సభలో టక్కర్‌తో పాటు డీజీపీ రాముడు, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు ప్రాణిగ్రహి, సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి శశిభూషన్ కుమార్, ఏపీపీఎస్సీ కార్యదర్శి ఎ.గిరిధర్, సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌గా ఐ.వై.ఆర్. కృష్ణారావు చేసిన సేవలను పలువురు ప్రశంసించారు. రాష్ట్ర విభజనఅనంతరం కిష్ట సమయంలో తొలి సీఎస్‌గా ఐ.వై.ఆర్. బాధ్యతలు చేపట్టినప్పటికీ చాలా సమస్యలను అవలీలగా ఎదుర్కొన్నారని, విభజన అంశాల్లో ఎక్కడా రాజీపడకుండా వ్యవహరించారని పేర్కొన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ చాలా వేగంగా చేశారని, ఏ అంశంపైన అయినా సమావేశంలో అనవసర చర్చలతో సమయాన్ని వృధా చేయకుండా అవసరమైన మేరకు చర్చించి అక్కడిక్కడే నిర్ణయం తీసుకోవడంలో ఐ.వై.ఆర్.కు సాటిలేరని పలువురు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు అన్ని విధాల సహకారం అందిస్తామని లింగరాజు ప్రాణిగ్రహి పేర్కొన్నారు. సీఎస్‌గా ఐ.వై.ఆర్. కృష్ణారావు రాష్ట్రాన్ని టేకాఫ్ స్థితికి తీసుకువచ్చారని, ఇప్పుడు టక్కర్ ఫైలట్‌గా సజావుగా టేకాఫ్ చేయించాలని కోరుకుంటున్నామని ప్రాణిగ్రహి పేర్కొన్నారు. డబుల్ డిజిట్ వృద్ధి సాధించడంలో టక్కర్ కృషిని కొనసాగించాలని, మిగతా సాధారణ పరిపాలన అంశాల కన్నా దానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. పనిచేయడం అలవాటుగా మార్చుకోవాలి-ఐ.వై.ఆర్. సీఎస్‌గా పనిచేసిన సమయంలో సహకారం అందించిన వారందరికీ ఐ.వై.ఆర్. కృతజ్ఞతలు తెలియజేశారు. ఐఏఎస్‌గా ఏ పదవిలో కొనసాగినా చాలా సంతృప్తిగా పనిచేశానని ఆయన పేర్కొన్నారు. పనిచేయడం అనేది అలవాటుగా మార్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఫైళ్లను పెండింగ్‌లో ఉంచడం వల్ల ఎటువంటి పనిచేయకపోవడమేన ని, ఫైళ్లు క్లియరెన్స్ చేయడమే పనిగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. విభజన సమస్యలను చాలా వరకు పరిష్కరించామని, ఇంకా మిగిలిన సమస్యలను కొత్త సీఎస్ టక్కర్ పరిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు. -
‘విభజన’ వేగం పెంచండి
అపెక్స్ కమిటీతో సీఎస్ భేటీ అధికారుల కమిటీలన్నీ సమావేశమయ్యేలా నిర్దేశాలు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగంలోకి మరో ఉప కార్యదర్శి ఎల్లుండి రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంశాఖ కార్యదర్శులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనపై రంగాల వారీగా నియమించిన అధికారుల కమిటీల్లో ఇంకా సగం కమిటీలు ఒక్క సారి కూడా సమావేశాలు కాలేదు. ప్రధానంగా రహదారులు - భవనాలు, రవాణా, వైద్య, ఆరోగ్యం, ఇరిగేషన్, న్యాయ తదితర రంగాలకు చెందిన కమిటీలు ఇంకా ఒక్క సారి కూడా సమావేశాలను నిర్వహించలేదు. ఉద్యోగులు, ఆర్థిక, ప్రభుత్వ రంగ సంస్థలు తదితర రంగాలపై ఏర్పాటైన కమిటీలు మాత్రమే సమావేశమయ్యాయి. అన్ని రంగాల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోను మే 31వ తేదీ కల్లా విభజన పనులు పూర్తి చేయించాలని పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శనివారం విభజనపై ఉన్నతస్థాయి కమిటీ కన్వీనర్ సత్యప్రకాశ్ టక్కర్‌తో సమావేశమై చర్చించారు. ఇప్పటివరకు సమావేశం కాని కమిటీలతో వెంటనే సమావేశాలను ఏర్పాటు చేయించాలని, అన్ని రంగాల్లో విభజన పనిపై వేగం పెంచాలని సీఎస్ ఆదేశించారు. అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించిన ఆదేశాలన్నీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం ద్వారానే చేయాల్సి ఉన్నందున ఆ విభాగాన్ని మరింత పటిష్టం చేయాలని సీఎస్ సూచించారు. ఇప్పటికే ఆ విభాగంలో అదనంగా ఉప కార్యదర్శిని నియిమించగా మరో ఉప కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. వచ్చే వారంలో గవర్నర్ సమీక్ష... విభజన పని పురోగతిపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్‌గోస్వామి మంగళవారం రాష్ట్రానికి వస్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా వస్తున్నారు. విభజన పనుల పురోగతిపై రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా వచ్చే వారం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. విభజన అపెక్స్ కమిటీకి గవర్నర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగుల పంపిణీకి మార్గదర్శక సూత్రాల రూపకల్పనకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ కమలనాథన్ శనివారం సీఎస్ మహంతితోను, ఆర్థికశాఖ అధికారులు పి.వి.రమేశ్, రామకృష్ణారావులతోను సమావేశమై మార్గదర్శక సూత్రాల తీరుతెన్నులపై చర్చించారు.