15 శాతం వృద్ధే లక్ష్యం
సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌పీ టక్కర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సత్యప్రకాశ్ టక్కర్ చెప్పారు. శనివారం సచివాలయంలో ఐ.వై.ఆర్. కృష్ణారావు నుంచి సీఎస్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రెండంకెల వృద్ధి సాధించడానికి ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. 15 శాతం వృద్ధి సాధించడం తేలికైన విషయం కాదని, అయినా అన్ని రంగాలు కష్టపడి పనిచేసేలాగ చర్యలు తీసుకోవడం ద్వారా అది సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టక్కర్ బాధ్యతలు స్వీకరణ అనంతరం పదవీ విరమణ చేసిన ఐ.వై.ఆర్. కృష్ణారావు కోసం సచివాలయ సాధారణ పరిపాలన శాఖ వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో టక్కర్‌తో పాటు డీజీపీ రాముడు, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లింగరాజు పాణిగ్రాహి, సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఏపీపీఎస్సీ కార్యదర్శి ఎ.గిరిధర్, సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ పాల్గొన్నారు.
కృష్ణారావు సమర్థంగా పనిచేశారు
ఈ సందర్భంగా సీఎస్‌గా కృష్ణారావు చేసిన సేవలను ప్రశంసించారు. రాష్ట్ర విభజన లాంటి క్లిష్ట సమయంలో తొలి సీఎస్‌గా ఐ.వై.ఆర్. బాధ్యతలు చేపట్టి చాలా సమస్యలను అలవోకగా ఎదుర్కొన్నారని, విభజన అంశాల్లో ఎక్కడా రాజీపడకుండా వ్యవహరించారని కొనియాడారు. ఫైళ్ల క్లియరెన్స్ చాలా వేగంగా చేయడంలో, అనవసర చర్చలతో సమయాన్ని వృథా చేయకుండా అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కృష్ణారావు సాటిలేరన్నారు.
ఉద్యోగ జీవితం సంతృప్తికరం : ఐ.వై.ఆర్
తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా ముగిసిందని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. సీఎస్‌గా పదవీవిరమణ సందర్భంగా ఆయన శనివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. కమలనాథన్ కమిటీ నేతృత్వం లో ఉద్యోగుల పంపిణీ సజావుగానే సాగిందన్నారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం లేని అంశాల్లో కేంద్రమే ఒక నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేయాల్సి ఉందని, ఈ విషయంలో కేంద్రం విఫలమైందన్నారు.
కాలయాపనకే ఉప కమిటీ
రాష్ట్ర విభజనకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య అపరిష్కృతం గా ఉన్న సమస్యలపై తాజాగా కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో ఉప కమిటీని ఏర్పాటు చేయడం పట్ల ఐ.వై.ఆర్. కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేంద్ర హోంశాఖకు ఘాటైన లేఖ రాశారు. పదవీ విరమణ చేయడానికి రెండు రోజుల ముందు అంటే జనవరి 27న కేంద్ర హోం శాఖ కార్యదర్శికి ఈ లేఖ రాశారు. కాలయాపనకే ఈ కమిటీ వేశారన్నారు.