సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తన ప్రత్యేక ప్రతినిధిగా హోంశాఖలో అదనపు కార్యదర్శి (అంతర్గత భద్రత)గా పనిచేస్తున్న రాజీవ్‌శర్మను నియమించింది. ఆయన విభజన ప్రక్రియ పూర్తయ్యే వరకు నెలలో 20 రోజుల పాటు ఇక్కడ, మిగిలిన పది రోజులు కేంద్ర హోంశాఖలో పని చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర కేడర్‌కు చెందిన రాజీవ్‌శర్మ ప్రస్తుతం కేంద్రంలో డెప్యుటేషన్‌లో పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియలోనూ, శ్రీకృష్ణ కమిటీ నోడల్ అధికారిగా రాజీవ్ శర్మ పని చేశారు.
అఖిల భారత అధికారుల బదిలీలకూ...
అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీలకు సంబంధించి కేంద్రం సలహా కమిటీని నియమించింది. బీహార్ కేడర్‌కు చెంది, పదవీ విరమణ చేసిన 1969 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలో రాష్ట్ర సీఎస్ మహంతి, కేంద్ర హోంశాఖలో ప్రత్యేక కార్యదర్శి(అంతర్గత భద్రత), కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఐజీ(అడవులు)లను సభ్యులుగా, సభ్య కార్యదర్శిగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(సర్వీసెస్ అండ్ విజిలెన్స్)ను నియమించింది. ఈ కమిటీ విధి విధానాలను కూడా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఠ పారదర్శక విధానాలపై ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి కేడర్ సంఖ్యను నిర్ణయిస్తూ వారంలో నివేదికివ్వాలి. ఠ ఈ పంపిణీకి సంబంధించి ఈ మూడు కేడర్ల అధికారుల నుంచి సూచనలు, సలహాలు, వ్యాఖ్యానాలను పరిగణలోకి తీసుకుని, వాటిని సంబంధిత వెబ్‌సైట్‌లో పెట్టాలి. దానిపై వారం రోజులపాటు వారికి అవకాశమివ్వాలని, ఆ సూచనలు, సలహాలు వచ్చిన వారంలో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధికారుల కేటాయింపు మార్గదర్శకాలు ఇవ్వాలి. ఠ ఈ కమిటీ ఏర్పాటు నోటిఫికేషన్ జారీ అయిన మూడు వారాల్లో ఆలిండియా సర్వీసు అధికారులను పారదర్శక విధానంలో కేటాయింపునకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు విభజించి నివేదిక ఇవ్వాలి. ఠ అనుమతించిన మొత్తం ఆలిండియా సర్వీసు అధికారులను నేరుగా భర్తీ, ప్రమోషన్‌లో వచ్చిన వారిని, వారిలోనూ అన్ రిజర్వుడ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరిల వారీగా, స్థానిక, స్థానికేతరులు వివరాలివ్వాలి. ఠ ఈ కేటగిరిలుగా విభజించిన తర్వాత వారంలో ఏ అధికారిని ఏ రాష్ట్రానికి పంపిం చాలన్న నివేదిక ఇవ్వాలి. ఠ అధికారుల విభజన తరువాత ఎవరైనా బాధిత అధికారి తన అభిప్రాయా న్ని, అభ్యంతరాన్ని వ్యక్తం చేసే పక్షంలో.. అందుకు సంబంధించిన వివరాలను ఆయా కేడర్లకు సంబంధించి నియంత్రిత విభాగం వెబ్‌సైట్‌లో ఉంచాలి.
బదిలీల కమిటీకీ కమలనాథనే..
రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగుల బదిలీ కమిటీ చైర్మన్‌గా సీఆర్ కమలనాథన్ అధ్యక్షతన కమిటీని కేంద్రం నియమించింది. బదిలీల కమిటీకి కూడా ఆయనను చైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, వి.నాగిరెడ్డి, డాక్టర్ పీవీ రమేష్, కేంద్ర ప్రభుత్వ డీవోపీటీ అదనపు కార్యదర్శి, సభ్య కార్యదర్శిగా రాష్ట్ర కేడర్‌లో కార్యదర్శి హోదాలోని అధికారి వ్యవహరిస్తారు.