తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై నెలరోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్‌శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు.
అధికారులకు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశం
త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా నష్టపరిహారంపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై నెలరోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్‌శర్మ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సీనియర్ అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి విచారణ పూర్తి చేయాలని వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. బలవన్మరణాలకు పాల్పడ్డ రైతులకు గత ప్రభుత్వాలు ఇచ్చిన మాదిరిగా పరిహారం రూ.1.5 లక్షలు ఇవ్వాలా.. లేదా పెంచి ఇవ్వాలా అన్న అంశంపై అధికారుల నుంచి నివేదికలు అందిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. రైతుల ఆత్మహత్యలపై ఆర్డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌తో గతంలో నియమించిన త్రిసభ్య కమిటీ దృష్టి సారించనుంది. ఆయా డివిజన్‌లలో రైతుల ఆత్మహత్యలకు కారణాలపై నివేదిక ఇవ్వనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆలస్యం కావడంతో.. పంటలు వేయడంలో జాప్యమైంది. ఆ తర్వాత కూడా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో రైతులు నష్టపోయారు. ఇక పంట పొట్టకొచ్చే సమయంలో తీవ్ర కరెంటు సమస్యతో పంటలు ఎండిపోయాయి. రైతు రుణమాఫీ కూడా సకాలంలో జరగకపోవడం, బ్యాంకులు పూర్తిస్థాయిలో రుణాలివ్వకపోవడంతో రైతులు మరింత ఇబ్బందుల పాలయ్యారు. అప్పులు తట్టుకోలేక ప్రతిరోజూ ఏదో ఒకచోట రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించడంతోపాటు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది.