- వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ రాజీవ్ శర్మ
సంగారెడ్డి జోన్: హరితహారం కార్యక్రమం కింద నాటిన మొక్కల సంరక్షణకు సంబంధించిన సూక్ష్మ ప్రణాళికను త్వరగా అందజేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, వివిధ శాఖల ద్వారా నిర్దేశించుకున్న మేరకు లక్ష్యం సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలను సంరక్షించే విషయంలో సూక్ష్మ ప్రణాళిక అంటే మొక్కలను ఎవరు సంరక్షిస్తారు.. నీళ్లు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారు.. తదితర వివరాలతో నివేదికను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
కలెక్టర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ జిల్లాలో మూడు కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యమన్నారు. ఇప్పటివరకు 1.02 కోట్ల మొక్కలను నాటామన్నారు. కాన్ఫరెన్స్‌లో ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, అడిషనల్ పీసీసీఎఫ్ డోగ్రియల్, డ్వామా పీడీ సురేంద్రకరణ్, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ రెడ్డి, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ పద్మారావు, డీఎఫ్‌ఓ సుధాకర్ రెడ్డి, శ్రీధర్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఖురేషి, వ్యవసాయ శాఖ జేడీ మాధవి శ్రీలత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.