నిర్మాణాలు ఉన్న భూములే క్రమబద్ధీకరణ
- మార్గదర్శకాలను జారీ చేసిన సీసీఎల్‌ఏ
- తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు
- భూమి విలువలో 25% చెల్లించాలి
- అందుబాటులో హెల్ప్‌డెస్క్‌లు
సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణకు తెర లేచింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. నిర్మాణాలుంటే సరి.. అవి ప్రభుత్వ భూములైనా, యూఎల్‌సీ మిగులు భూములైనా క్రమబద్ధీకరిస్తారు. ఈ మేరకు బుధవారం భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) డాక్టర్ రాజీవ్‌శర్మ మార్గదర్శకాలు జారీ చేశారు. భూముల క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం గత డిసెంబర్ 31న జారీ చేసిన జీవో 59కి అనుగుణంగా వీటిని రూపొందించారు. జీవో జారీ అయిన 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం పేర్కొ నడం తెలిసిందే. దరఖాస్తులకు సంబంధించిన ఫార్మాట్‌ను కూడా విడుదల చేశారు.
మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలు..
2014 జూన్ 2 కంటే ముందే పొజిషన్‌లో ఉండాలి.
ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించరు.
దరఖాస్తు ఫారాలను తహసీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలి.
నిర్ణీత ఫార్మాట్లలో, అవసరమైన డాక్యుమెంట్లతో తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులను స్వీకరించాలి.
ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లెసైన్స్, పాస్‌పోర్టు, బ్యాంకు పాస్‌బుక్‌లలో ఒకటి ఉండాలి.
ఆ భూమి తన స్వాధీనంలో ఉన్నట్లు (పొజిషన్‌లో) ఆధారం అందజేయాలి. అందుకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను రసీదు, విద్యుత్తు బిల్లు రసీదు, నీటి పన్ను రసీదు, స్థానిక సంస్థ నుంచి భవన నిర్మాణ అనుమతి పత్రాల్లో ఏదైనా ఒకటి ఉండాలి.
దరఖాస్తు చేసే భూమికి సంబంధించి నిర్మాణ ప్రదేశం ఫొటోను జత చేయాలి.
పత్రాలు దరఖాస్తుదారుని పేరిటే ఉండాలి.
తహసీల్దార్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. అవసరమైన వివరణలు, వివరాలు అందించాలి. ఆస్తి విలువ లెక్కగట్టేలా చర్యలు చేపట్టాలి.
దరఖాస్తు ఫారం అందజేసే సమయంలో భూమి విలువలో 25 శాతం డబ్బును సంబంధిత తహసీల్దార్ పేరుతో డీడీ అందజేయాలి.
తహసీల్దార్లు జీవో జారీ అయిన తేదీ నుంచి 20 రోజుల్లో ఈ దరఖాస్తులను స్వీకరించాలి.
తహసీల్దార్ స్థాయిలో...
వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఆ క్రమంలో దరఖాస్తు వచ్చిన వెంటనే నిర్ణీత పత్రాలు అన్ని ఉన్నాయా సరి చూసుకోవాలి. రిజిస్టర్‌లో ఆ వివరాలను, పేరు, చిరునామా నమోదు చేయాలి. దరఖాస్తుదారునికి అకనాలెడ్జ్‌మెంట్ ఇవ్వాలి.
తహసీల్దార్/డిప్యూటీ తహసీల్దార్ నేతృత్వంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలి. ఆ బృందాలకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, సర్వేయర్ సహకారం అందించాలి.
ఈ బృందాలు క్షేత్రస్థాయిలోని నివాస, నివాసేతర నిర్మాణాలను స్వయంగా పరిశీలించాలి.
ఆ భూమి విలువపై 25 శాతం మొత్తాన్ని దరఖాస్తుదారుడు చెల్లిస్తున్నందున, ఆ భూమికి సంబంధించిన విలువను ఈ బృందాలు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్ధరించాలి.
ఇవన్నీ పూర్తయ్యాక తహసీల్దార్/డిప్యూటీ తహసీల్దార్ నుంచి వాటికి సంబంధించిన వివరాలు, సిఫారసులను క్రమబద్ధీకరణ కమిటీకి నివేదికను అందజేయాలి.
తహసీల్దార్ పేరుతో వచ్చిన డీడీల మొత్తాన్ని బ్యాంకుల్లో ప్రత్యేక ఖాతాలో జమ చేయాలి.
డీడీల వివరాలను నంబరుతో సహా ప్రత్యేకంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించిన మరిన్ని మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు.