వాయిదాల్లోనూ ‘క్రమబద్ధీకరణ’ | Stuck 'regularization | Sakshi
Sakshi News home page

వాయిదాల్లోనూ ‘క్రమబద్ధీకరణ’

Published Sat, Jan 31 2015 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:32 PM

వాయిదాల్లోనూ ‘క్రమబద్ధీకరణ’

వాయిదాల్లోనూ ‘క్రమబద్ధీకరణ’

  • మార్గదర్శకాలను సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
  • 500 గజాలపైన స్థలాలకుధరలో 75 శాతం చెల్లిస్తే చాలు
  • డిసెంబర్ వరకు ఐదు సులభ వాయిదాల్లోనూ చెల్లించొచ్చు
  • ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ
  • సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణలో భాగంగా స్థలం ధరను సులభంగా వాయిదాల్లో చెల్లించే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అంతేగాకుండా వివిధ కేటగిరీల్లో చెల్లించాల్సిన సొమ్ము శాతాన్ని కూడా భారీగా తగ్గిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పేదలకు ఉచిత క్రమబద్ధీకరణ సదుపాయాన్ని ఎప్పటిలాగే 125 గజాలకే పరిమితం చేసినా... స్వల్ప ఉపశమనం కల్పించారు.

    126 గజాల నుంచి 150 గజాల్లోపు ఉన్న స్థలాలకు మురికివాడల్లోని పేదలు రిజిస్ట్రేషన్ ధరలో 10 శాతం, ఇతర ప్రాంతాల్లో 25 శాతం చెల్లించేలా మార్గదర్శకాల్లో మార్పులు చేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించాలని గత నెల 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పేదలకు ఉచిత క్రమబద్ధీకరణ నిమిత్తం జారీ చేసిన జీవో నం.58 కింద దరఖాస్తులు వెల్లువెత్తగా... రిజిస్ట్రేషన్ ధర చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ (జీవో.59)కు ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.

    పట్టణాలు, నగరాల్లో భూముల రిజిస్ట్రేషన్ ధరలు మార్కెట్ ధరల కన్నా ఎక్కువగా ఉండడంతో.. రిజిస్ట్రేషన్ ధరను తగ్గించాలని ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. దీంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను సమీక్షించిన ప్రభుత్వం... మార్గదర్శకాలను సవరిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. భూములకు రిజిస్ట్రేషన్ ధరలో చెల్లించాల్సిన సొమ్ము శాతాన్ని తగ్గించడంతో పాటు సులభంగా వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించింది. అంతేగాకుండా ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికి అదనంగా 5 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం.
     
    తాజా ఉత్తర్వుల్లో ముఖ్యమైన అంశాలు..

    క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న వారికి స్థలాన్ని అప్పగిస్తూ తహసీల్దారు చేసే కన్వీనియెన్స్ డీడ్‌కు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది.

    అభ్యంతరకరం కాని ప్రభుత్వ భూములు, యూఎల్సీ పరిధిలోని మిగులు భూముల క్రమబద్ధీకరణకు మాత్రమే తాజా ఉత్తర్వులు వర్తిస్తాయి. యూఎల్సీ పరిధిలోని స్థలాల క్రమబద్ధీకరణకు వేరుగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది.
     
    ప్రభుత్వం కల్పించిన క్రమబద్ధీకరణ సదుపాయాన్ని గడువులోగా వినియోగించుకోకుంటే... ఆయా స్థలాలను చట్ట ప్రకారం స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.
     
    నేటితో ముగియనున్న ‘ఉచిత’ గడువు..

    నిరుపేదలు ఉచిత క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన గడువు శనివారంతో ముగియనుంది. ఇకపై గడువు పొడిగించే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఇక చెల్లింపు కేటగిరీలో దరఖాస్తులకు ఫిబ్రవరి 28 తేదీని చివరి గడువుగా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇప్పటివరకు ఉచితం కేటగిరీలో క్రమబద్ధీకరణ కోసం 2.60 లక్షల దరఖాస్తులు రాగా... చెల్లింపు కేటగిరీల్లో 9,700 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జీవో 59 కింద వచ్చిన దరఖాస్తులతో పాటు రిజిస్ట్రేషన్ ధర (25 శాతం) కింద రూ. 59 కోట్లు అందినట్లు పేర్కొన్నారు.
     
    సులభ వాయిదాలు ఇలా..

    క్రమబద్ధీకరణకు దరఖాస్తుతో పాటు రిజిస్ట్రేషన్ ధరలో 25 శాతాన్ని చెల్లించాలి. అయితే ఈ మొత్తాన్ని కూడా రెండు వాయిదాల్లో (12.5 శాతం చొప్పున) చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మిగతా 75 శాతం సొమ్మును మూడు సమాన వాయిదాల్లో (25 శాతం చొప్పున) కట్టాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement