అభ్యంతరాలుంటే పెండింగ్
- పట్టా భూములైనా, నిర్మాణాలు లేకున్నా,లబ్ధిదారులు ఉండకున్నా అంతే
- క్రమబద్ధీకరణ భూములపై కలెక్టర్లకు సర్కారు ఆదేశం
- తాజా పరిస్థితిపై భూపరిపాలన కమిషనర్ సమీక్ష
- 20 నుంచి అసైన్‌మెంట్ పట్టాల పంపిణీ
- చెల్లింపు కేటగిరీలో దరఖాస్తులకు 28 వరకు గడువు
సాక్షి, హైదరాబాద్: క్రమబద్ధీకరణ ప్రక్రియలో అభ్యంతరకర భూములకు సంబంధించిన దరఖాస్తులను, అలాగే పూర్తి వివరాలు లేని వాటిని పక్కనపెట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఉచిత కేటగిరీలో క్రమబద్ధీకరణ ప్రక్రియ పురోగతిపై జిల్లాల క లెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో బుధవారం భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ అధర్‌సిన్హా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉచిత క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, చెక్ మెమో(వివరాల)ను వెంటనే ఆన్‌లైన్‌లోకి ఎక్కించేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న పేదలకు ఆయా స్థలాలను క్రమబద్ధీకరించే విషయమై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టమైన ఆదేశాలిచ్చారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 20 నుంచి అన్ని జిల్లాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధర్‌సిన్హా పేర్కొన్నారు.
కమిటీల తో కాలయాపన వద్దు
క్షేత్రస్థాయిలో వివరాల పరిశీలనకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అసైన్‌మెంట్ కమిటీ సమావేశాలు ఇప్పటి నుంచే అవసరం లేదని కమిషనర్ సూచించారు. వివాదాస్పద భూములకు సంబంధించిన దరఖాస్తులను వేరు చేయాలన్నారు. సీసీఎల్‌ఏ నుంచి వచ్చిన 32 అంశాలతో కూడిన చెక్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకొని, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత ఆ వివరాలను చెక్‌మెమోల్లో నమోదు చేయాలని సూచించారు. ఈ నెల 15కల్లా పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే సరిపడా సిబ్బంది లే రని కొందరు అధికారులు పేర్కొనగా, క్రమబద్ధీకరణకు దరఖాస్తులు లేని మండలాల నుంచి సిబ్బందిని డిప్యుటేషన్‌పై వినియోగించుకోవాలని అధర్‌సిన్హా సూచిం చారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి జిల్లాలోని మండలాలను ఏబీసీ కేటగిరిలుగా విభజించాలని, 15 వేలకులోపున్న బీ, సీ కేటగిరీ మండలాల్లో పరిశీలనను కచ్చితంగా పూర్తి చేయాలని, అంతకన్నా ఎక్కువ దరఖాస్తులున్న చోట మరికొంత సమయం ఇస్తామని చెప్పారు.
కామన్‌గా ‘పట్టా’ నమూనా
అర్హులైన లబ్ధిదారులకు ఇచ్చే అసైన్‌మెంట్ పట్టాలను ఇప్పటివరకు జిల్లాల్లో వేర్వేరు ఫార్మాట్లలో ఇస్తున్నారని, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా ఉండేలా ప్రత్యేక నమూనాను రూపొందించామని అధర్‌సిన్హా పేర్కొన్నారు. ఆన్‌లైన్ ద్వారానే అసైన్‌మెంట్ పట్టాను డౌన్‌లోడ్ చేసి లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుందన్నారు. తహసీల్దార్లు అప్‌లోడ్ చేసిన చెక్‌మెమోలోని వివరాలే అసైన్‌మెంట్ పట్టాలో ముద్రితమవుతున్నందున, డేటా ఎంట్రీ సమయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పట్టణ భూ పరిమితి(యూఎల్సీ) పరిధిలోని భూములకు సంబంధించిన దరఖాస్తులను యూఎల్సీ నుంచి వచ్చిన కమిటీలు పరిశీలన చేస్తాయన్నారు. క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని సమస్యలేవైనా ఎదురైతే.. స్పష్టత కోసం ప్రభుత్వానికి రాయాలని అధికారులకు సూచిం చారు. ఈ సందర్భంగా భూమి పరిస్థితి, లబ్ధిదారుని గుర్తింపు తదితర అంశాలపై అధికారుల సందేహాలకు అధర్‌సిన్హా స్పష్టతనిచ్చారు. ఎటువంటి అభ్యంతరాలున్నా సదరు దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టాలన్నారు. చిన్నచిన్న తేడాలున్నట్లు గమనిస్తే మరోమారు పరిశీలనకు అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే జీవో 59 ప్రకారం చెల్లింపు కేటగిరీలో భూముల క్రమబద్ధీకరణపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. చెల్లింపు కేటగిరీలో దరఖాస్తుల సమర్పణకు ఈనెల 28 వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన ఇలా..
స్టేటస్ ఆఫ్ ల్యాండ్: గత ప్రభుత్వం జారీచేసిన జీవో 166 పరిధిలోనిది అయి ఉండకూడదు. సదరు భూమిపై ఎటువంటి కోర్టు కేసు ఉండకూడదు. దరఖాస్తులో పేర్కొన్న స్థలం ఇప్పటికే పట్టాభూమి అయినట్లయితే.. దాన్ని అభ్యంతరకరమైన భూమిగా పరిగణించాలి.
లబ్ధిదారుని గుర్తింపు: దరఖాస్తుదారుని ఆధార్ కార్డు సంఖ్య, ఫొటో తప్పనిసరి. దరఖాస్తులో పేర్కొన్న కుటుంబసభ్యుల వివరాలను నిర్ధారించుకోవాలి. వివిధ పథకాలకు లబ్ధిదారులను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు పాటించే ప్రక్రియను వర్తింపజేయాలి. రూ. 2 లక్షలలోపు వార్షికాదాయాన్ని నిర్ధారించేందుకు పాత రేషన్ కార్డు, ఇటీవలి ఆహార భద్రత సర్వే వివరాలను పరిగణనలోకి తీసుకోవాలి. భార్య లేదా భర్త పేరిట ఒకటి కన్నా ఎక్కువ దరఖాస్తులు చేశారేమో తనిఖీ చేయాలి. దరఖాస్తుదారులు అదే స్థలంలో నివాసముంటున్నారో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.
నివాసం పరిస్థితి: క్రమబద్ధీకరణ కోరుతున్న స్థలంలో నిర్మాణం ఉండి తీరాలి. ఆ స్థలం జూన్ 2, 2014కు ముందునుంచి దరఖాస్తుదారుడి ఆక్రమణలోనే ఉన్నట్లు ధ్రువీకరించుకోవాలి. లబ్ధిదారుడు నివాసముంటున్న ట్లు ధ్రువీకరణ పత్రం, ఎప్పడి నుంచి అక్కడ ఉంటున్నారన్న వివరాలు సరిపోలుతున్నాయో లేదో చూసుకోవాలి. విద్యుత్ బిల్లు, నీటిపన్ను, ఆస్తిపన్నులను సంబంధిత శాఖ ద్వారా నిర్ధారించుకోవాలి.