- సీఎస్ అధ్యక్షతన ఏర్పాటు
- సభ్యులుగా వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు
- ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేతన సవరణపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో కూడిన కమిటీని నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షత వహించే ఈ కమిటీలో ఆర్థిక శాఖ ము ఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రతి నిధి ప్రదీప్‌చంద్ర, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కా ర్యదర్శి రేమండ్ పీటర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషిలు సభ్యులుగా ఉంటారు.
సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని అంశాలను పరిశీలించే బాధ్యతను కూడా ఈ కమిటీయే చూస్తుం ది. పదో వేతన సవరణ సంఘం చైర్మన్ పీకే అగర్వాల్ సమర్పించిన నివేదికను ఈ కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా వేతన సవరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఎప్పటిలోగా నివేదిక ఇవ్వాలన్న అం శంపై సీఎం ఎలాంటి కాలపరిమితి విధించలేదు.
కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వేతనాలు చెల్లించే అంశాన్ని పరిశీలించేందుకు సీఎస్ అధ్యక్షతన ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని నియమించిన సంగతి విదితమే. తెలంగాణ డిస్కమ్‌లు కొనుగోలు చేయనున్న 500 మెగావాట్ల సౌర విద్యుత్ టెండర్లను ఖరారు చేసే అంశంలో తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని తాజా కమిటీకే ప్రభుత్వం కట్టబెట్టింది.
గజ్వేల్‌లో ఆడిటోరియం
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సొంత నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ పట్టణంలో 2 వేల మంది కూర్చోవడానికి వీలుండేలా ఆడిటోరియం నిర్మించనున్నారు. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించాలని సీఎం ఆ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాను ఆదేశించారు.