అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది.
హాజరవుతున్న ఇరురాష్ట్రాల సీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి సంబంధించి ప్రత్యూష్ సిన్హా కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు రాజీవ్ శర్మ, ఐవైఆర్ కృష్ణారావు హాజరవుతున్నారు. ఈ నెల 10న కమిటీ తాత్కాలిక తుది జాబితాను ప్రకటించడం, అభ్యంతరాలు తెలపడానికి శనివారం వరకు సమయమివ్వడం తెలిసిందే. ఆ జాబితాలోని 20 మంది ఐఏఎస్‌లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లాలని కోరుకుంటూ దరఖాస్తు చేసుకున్నారు.దీనిపై చర్చించేందుకే సిన్హా కమిటీ శనివారం సమావేశం నిర్వహిస్తోంది.
తెలంగాణలో పనిచేస్తూ.. ఆంధ్రాకు కేటాయించిన ఐఏఎస్‌లు బీపీ ఆచార్య, సోమేశ్‌కుమార్, పూనం మాలకొండయ్యలను తమ రాష్ట్రంలోనే కొనసాగించాలని తెలంగాణ కోరనుంది. తమ వద్ద పనిచేస్తూ.. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్‌లైన అజయ్ సహాని, ఆదిత్యనాథ్‌దాస్, అజయ్‌జైన్, జేఎస్‌వీ ప్రసాద్‌లను తమ వద్దనే ఉంచాలని ఏపీ కోరనుంది. అభ్యంతరం లేని వారిని గత జాబితా ప్రకారం రెండు రాష్ట్రాల్లో పనిచేసేలా ఆర్డర్ టు సర్వ్ ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర వ్యక్తిగత సిబ్బంది, శిక్షణ మంత్రిత్వశాఖను కోరడం తెలిసిందే.