సివిల్ సర్వెంట్ల అభ్యంతరాలను పరిశీలించనున్న కమిటీ
తుది నివేదికను డీవోపీటీకి ఇవ్వనున్న కమిటీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులపై ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ పని మంగళవారంతో పూర్తి కానుంది. ఆగస్టు 22న సమావేశమైన కమిటీ రెండు రాష్ట్రాలకు అఖిల భారత అధికారులను తాత్కాలికంగా కేటాయించడం తెలిసిందే. ఈ కేటాయింపులపై గతనెల 28 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. వాటిపై మంగళవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ కార్యాలయంలో ఈ కమిటీ సమావేశమై చర్చించనుంది. దీనిలో కమిటీ చైర్మన్ ప్రత్యూష్ సిన్హాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు డాక్టర్ రాజీవ్‌శర్మ, ఐవైఆర్ కృష్ణారావు పాల్గొంటారు. ప్రధానంగా భార్యాభర్తలు, డెప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు, అనారోగ్యంతో బాధపడుతున్న అధికారుల నుంచి అభ్యంతరాలు అందినట్టు సమాచారం. భార్యాభర్తలకు సంబంధించి మొత్తం 12 మందితోపాటు, పైన పేర్కొన్న కారణాలతో దరఖాస్తు చేసుకున్న 32 మంది దరఖాస్తులను కమిటీ పరిశీలనకు తెలంగాణ సర్కార్ పంపించింది. తెలంగాణలో పనిచేయడానికి ఈ 32 మంది అధికారులు సుముఖత వ్యక్తం చేయడంతో .వారి పేర్లను ప్రభుత్వం ప్రత్యూష్ సిన్హా కమిటీకి పంపింది.
అధికారులు ఇచ్చిన దరఖాస్తుల్లో సహేతుకమైనవాటిని పరిశీలించి కమిటీ మార్పులు చేర్పులు చేయనుంది. అయితే వాటిని కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఆమోదించాలన్న నిబంధనేదీ లేదని అధికారవర్గాలు తెలిపాయి. డీవోపీటీ నిబంధనల మేరకు అధికారులను కేటాయించనున్నారు. నివేదికను ప్రధాని ఆమోదించాక శాశ్వతంగా అధికారుల కేటాయింపు జరుగుతుంది. అది ఈనెల 15 లోగా పూర్తవుతుందని అధికారులు ఆశాభావంతో ఉన్నారు.
నేటితో ప్రత్యూష్ సిన్హా కమిటీ ప్రక్రియ పూర్తి..
Published Tue, Sep 2 2014 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM
Advertisement