వారంలో ఐఏఎస్‌ల పంపిణీ! | IAS distribution by next week in Andhra pradesh state | Sakshi
Sakshi News home page

వారంలో ఐఏఎస్‌ల పంపిణీ!

Published Thu, Dec 11 2014 7:27 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM

IAS distribution by next week in Andhra pradesh state

⇒ 15 రోజుల్లోగా అధికారుల నుంచి ‘స్వాపింగ్’కు దరఖాస్తుల స్వీకరణ
⇒ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది జాబితా ప్రకారమే పంపిణీ
⇒ఢిల్లీలో ఉన్నతస్థాయి భేటీలో నిర్ణయం
⇒భేటీకి హాజరైన ప్రత్యూష్ సిన్హా, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు

సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సర్వీసు అధికారుల విభజన ప్రక్రియ పూర్తయింది. మరో వారం రోజుల్లో అధికారులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ ఉత్తర్వుల తర్వాత పక్షం రోజుల్లోగా అధికారుల నుంచి పరస్పర మార్పిడి(స్వాపింగ్)కి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో 15 రోజుల సమయం పడుతుందని ఉన్నత స్థాయి వర్గాలు వివరించాయి. బుధవారం ఢిల్లీలో ప్రధానమంత్రి అదనపు కార్యదర్శి పీకే మిశ్రా సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రత్యూష్ సిన్హాతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ కొఠారీ పాల్గొన్నారు.
 
ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇదివరకు ప్రకటించిన ముసాయిదా తుది జాబితా ప్రకారమే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఒకే బ్యాచ్‌లో ఉన్న అధికారులకేగాకుండా సీనియారిటీ ఆధారంగా మిగతావారికి కూడా స్వాపింగ్‌కు అనుమతిచ్చే అవకాశం ఉన్నట్లు భేటీలో పాల్గొన్న ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది ముసాయిదా పంపిణీ జాబితాపై పలువురు అధికారులు ఇప్పటికే క్యాట్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.

తెలంగాణలో పనిచేస్తున్న జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి సోమేష్‌కుమార్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యర్శి పూనం మాలకొండయ్య, బీపీ ఆచార్యను ఏపీకి కేటాయించారు. ఏపీలో పనిచేస్తున్న అజయ్‌జైన్, జేఎస్వీ ప్రసాద్‌లను తెలంగాణకు కేటాయించారు. ఏపీలో ఉన్న శాంతికుమారి, వి.కరుణ తెలంగాణకు రావాలని కోరుకుంటున్నారు. ఈ అధికారులు స్వాపింగ్‌తో వారు కోరుకున్న రాష్ట్రానికి వెళ్లే అవకాశం ఉంటుంది. స్వాపింగ్ పూర్తయ్యాక అధికారులకు శాశ్వతంగా ఆ రాష్ట్ర కేడర్ కేటాయించాలని నిర్ణయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement