సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపుపై తలెత్తిన వివాదంలో నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణ విభాగానికి (డీవోపీటీ) అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపులు చేసే పరిధి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)కు లేదని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకు చట్టప్రకారం అధికారి వారీగా నిర్ణయం వెలువరించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
అధికారుల అభ్యంతరాలను విడివిడిగా పరిశీలించాలని.. స్థానికత, పదేళ్ల సర్వీస్, ఇంకా మిగిలి ఉన్న సర్వీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారులు డీవోపీటీకి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. నీ మేరకు ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులను క్యాట్ మార్చడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావుల ధర్మాసనం తీర్పునిచ్చింది.
కేడర్ వివాదం ఇదీ..
ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులను ఇరు రాష్ట్రాల మధ్య విభజించారు. కమిటీ ఏపీకి కేటాయించిన కొందరు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు పొందారు. కేంద్ర ప్రభుత్వం క్యాట్ ఉత్తర్వులను తప్పుబడుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది.
విచారణ జరిపిన హైకోర్టు.. గత ఏడాది జనవరిలో తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులలో క్యాట్ జోక్యాన్ని తప్పుపట్టింది. అయితే కేడర్, సర్వీస్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారించాలంటూ అప్పటి డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో.. ఆ విచారణను జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ బెంచ్‌కు అప్పగించింది.
వాదనలు సాగాయిలా..
కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) నరసింహ శర్మ వాదనలు వినిపించారు. ఏఐఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉపశమనం పొందడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని వివరించారు. సోమేశ్‌కుమార్ అంశంలో తీర్పు సందర్భంగా హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల తరఫున న్యాయవాదులు కె.లక్ష్మీనరసింహ, గోదా శివ, సుధీర్ తదితరులు వాదనలు వినిపించారు. ‘‘ధర్మాసనం అలా నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేయవద్దు. పిటిషన్ల వారీగా విచారణ చేయాలి.
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 80 ప్రకారం అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను ఐపీఎస్‌లు సవాల్ చేశారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారుల కేటాయింపు బాధ్యతను కేంద్రానికే అప్పగిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment