ais officers
-
ఆ అధికారం కేంద్రానిదే..
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపుపై తలెత్తిన వివాదంలో నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిబ్బంది, శిక్షణ విభాగానికి (డీవోపీటీ) అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపులు చేసే పరిధి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)కు లేదని తేల్చిచెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో అధికారుల కేటాయింపు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాల మేరకు చట్టప్రకారం అధికారి వారీగా నిర్ణయం వెలువరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అధికారుల అభ్యంతరాలను విడివిడిగా పరిశీలించాలని.. స్థానికత, పదేళ్ల సర్వీస్, ఇంకా మిగిలి ఉన్న సర్వీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారులు డీవోపీటీకి పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. నీ మేరకు ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులను క్యాట్ మార్చడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావుల ధర్మాసనం తీర్పునిచ్చింది. కేడర్ వివాదం ఇదీ.. ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారులను ఇరు రాష్ట్రాల మధ్య విభజించారు. కమిటీ ఏపీకి కేటాయించిన కొందరు అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులు పొందారు. కేంద్ర ప్రభుత్వం క్యాట్ ఉత్తర్వులను తప్పుబడుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. విచారణ జరిపిన హైకోర్టు.. గత ఏడాది జనవరిలో తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులలో క్యాట్ జోక్యాన్ని తప్పుపట్టింది. అయితే కేడర్, సర్వీస్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారించాలంటూ అప్పటి డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో.. ఆ విచారణను జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ బెంచ్‌కు అప్పగించింది. వాదనలు సాగాయిలా.. కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహ శర్మ వాదనలు వినిపించారు. ఏఐఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి ప్రత్యూష్ సిన్హా కమిటీ కేటాయింపులకు వ్యతిరేకంగా ఉపశమనం పొందడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని వివరించారు. సోమేశ్‌కుమార్ అంశంలో తీర్పు సందర్భంగా హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల తరఫున న్యాయవాదులు కె.లక్ష్మీనరసింహ, గోదా శివ, సుధీర్ తదితరులు వాదనలు వినిపించారు. ‘‘ధర్మాసనం అలా నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేయవద్దు. పిటిషన్ల వారీగా విచారణ చేయాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 80 ప్రకారం అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలను ఐపీఎస్‌లు సవాల్ చేశారు. స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారుల కేటాయింపు బాధ్యతను కేంద్రానికే అప్పగిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. -
‘విభజన’ కమిటీ మార్గదర్శకాల మేరకే విచారణ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాల మేరకే విచారణ చేపడతామని వాద, ప్రతివాదులకు హైకోర్టు స్పష్టం చేసింది. ‘రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేడర్ వివాదంపై జనవరిలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు సందర్భంగా కమిటీ మార్గదర్శకాలను ధర్మాసనం సమర్థించింది. ఈ మార్గదర్శకాల మేరకు మాత్రమే మేం విచారణ చేపడతాం. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఆదేశాలు సరికాదు. వాటిని రద్దు చేసి.. నిర్ణయం తీసుకునే బాధ్యతను సిబ్బంది మరియు శిక్షణ విభాగం(డీవోపీటీ)కి అప్పగిస్తాం. తెలంగాణ వచ్చి దాదాపు 10 ఏళ్లు కావొస్తోంది.. పదేళ్లుగా డీజీపీ అంజనీకుమార్ సహా కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు. వీరిలో చాలా మంది సర్విస్ సంవత్సరంలోపు కూడా ఉంది. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తాం’అని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది. పదేళ్లుగా కొనసాగుతున్న కేడర్ వివాదం.. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై క్యాట్‌ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సరీ్వస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై సోమవారం జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. అది చట్టరీత్యా ఆమోదం కాదన్న ఏఎస్జీ కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ.. ఏఐఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి కేటాయింపులకు వ్యతిరేకంగా ఉపశమనం పొందడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోమేశ్‌కుమార్ తీర్పు సందర్భంగా ఇదే హైకోర్టు పేర్కొందన్నారు. అనంతరం పలువురు ఐఏఎస్‌ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 80 ప్రకారం అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాలను ఐపీఎస్‌లు సవాల్ చేశారని న్యాయవాది సుదీర్ నివేదించారు. న్యాయవాది కె.లక్ష్మీనరసింహా, సీనియర్ న్యాయవాది గోదా శివ.. ఐఏఎస్ అధికారుల తరఫున వాదనలు వినిపించారు. నివాసం ఉంటున్న ప్రాతిపదికన ఏఐఎస్ అధికారుల కేటాయింపు సరికాదన్నారు. ఈ విషయంలో నియమాకం నుంచి వాదనలు వినాల్సి ఉంటుందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి వాదనల కోసం నేటికి వాయిదా వేసింది. -
‘కేడర్ వివాదం’లో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారులను రాష్ట్రాల మధ్య కేటాయించే అప్పీలేట్ అథారిటీ బాధ్యతను కోర్టులు నిర్వర్తించనందున.. క్యాట్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి, కేంద్రమే నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇరు రాష్ట్రాల మధ్య అధికారుల కేటాయింపును మరోసారి పరిశీలించి పదేళ్లకు పైగా తెలంగాణలో ఉంటున్న వారు, త్వరలో సర్విస్ ముగిసేవారికి సంబంధించి సహేతుక నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. అయితే అలా వద్దని పిటిషన్ వారీగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీంతో అధికారుల కేటాయింపునకు సంబంధించిన కేడర్ వివాదంలో వాదనలను వచ్చే నెల 2వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. 2014 నుంచి కొనసాగుతున్న కేడర్ వివాదం 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సర్వీస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఓ పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది కె.లక్ష్మి నర్సింహ వాదనలు వినిపిస్తూ.. ధర్మాసనం అలా నిర్ణయా న్ని కేంద్రానికి వదిలేయ వద్దని విజ్ఞప్తి చేశారు. పిటి షన్ల వారీగా విచారణ చేయాలని కోరారు. ఇతర పిటిషన్ల న్యాయవాదులు కూడా దీన్ని సమరి్థంచారు. దీంతో తదుపరి విచారణ కోసం ధర్మాసనం.. విచారణను వచ్చే నెల 2కు వాయిదా వేసింది. -
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండేళ్లు జీతంతో కూడిన సెలవులు!
Child Care Leave Rules For AIS: ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS) అర్హత కలిగిన సభ్యులు వారి మొత్తం సర్వీస్‌లో సెలవులకు సంబంధించిన నిబంధనలను కేంద్రం ఇటీవల సవరించింది. ఈ కొత్త సవరణ ప్రకారం ఇప్పుడు ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి గరిష్టంగా రెండు సంవత్సరావుల పాటు సెలవులు తీసుకోవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఇటీవల ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్, 1995 ప్రకారం సవరించిన చైల్డ్ కేర్ లీవ్ నియమాలను నోటిఫై చేసింది. దీని ప్రకారం రెండు సంవత్సరాలు సెలవులు తీసుకున్నప్పటికీ వేతనాలు అందుతాయి. అంటే సెలవుల్లో ఉన్నప్పటికీ జీతం లభిస్తుంది. ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS)లోని ఒక మహిళ లేదా పురుషుడు తమ ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి వారి మొత్తం సర్వీసులో 730 రోజులు సెలవు తీసుకోవచ్చు. వారి పిల్లలకు 18 సంవత్సరాల వయసు లోపు విద్య, అనారోగ్యం, సంరక్షణ వంటి వాటి కోసం సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదీ చదవండి: భారత్‌లో పెరగనున్న నియామకాల జోరు - ఇదిగో సాక్ష్యం! చైల్డ్ కేర్ లీవ్ సమయంలో ఉద్యోగి సెలవులు తీసుకుంటే మొదటి సంవత్సరం (మొదటి 365 రోజులలో) 100 శాతం జీతం లభిస్తుంది, ఆ తరువాత ఏడాదిలో 80 శాతం వేతనం లభిస్తుంది. అయితే ఒక క్యాలెండర్ సంవత్సరంలో 3 స్పెల్‌ల కంటే ఎక్కువ కాలం చైల్డ్ కేర్ లీవ్ లభించదు. కానీ సర్వీస్‌లో ఉన్న ఒంటరి మహిళకు సంవత్సరంలో 6 స్పెల్‌ల వరకు లీవ్ లభిస్తుంది. చైల్డ్ కేర్ లీవ్ కింద తీసుకునే సెలవులు ఇతర లీవ్స్లో కలిపే అవకాశం లేదు. దీనికి ఒక ప్రత్యేక ఖాతా ఉంటుంది. -
కొత్త సంవత్సరం.. కొత్త అధికారులు..
కీలక పోస్టుల భర్తీకి మార్గం సుగమం జేసీ, ఐటీడీఏ పీవోలుగా కొత్త వారు.. బెల్లంపల్లి ఏఎస్పీ బి.భూషణ్‌కు స్థానచలనం అనివార్యం కొలిక్కి వచ్చిన ఏఐఎస్ అధికారుల కేటాయింపు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్త రాష్ట్రం.. నూతన సంవత్సరంలో కొత్త అధికారులు కొలువు దీరనున్నారు. అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో జిల్లా ఉన్నతాధికార పోస్టుల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఖాళీగా ఉన్న రెండు కీలక పదవులు జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మార్గం సుగమం కానుంది. అలాగే పోలీసు శాఖకు సంబంధించి బెల్లంపల్లి అదనపు ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను ఆంధ్రాకు కేటాయించడంతో ఆయన బదిలీ అనివార్యం కానుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రం ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. పక్షం రోజుల్లో ఆయనకు బదిలీ ఉత్తర్వులు అందనున్నాయి. ఐటీడీఏ పీవోగా ఉన్న జనార్దన్ నివాస్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ ఏఐఎస్ అధికారి ఆంధ్రాలో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చారు. దీంతో ఆయన అటునుంచి అటే బదిలీపై వెళ్లనున్నారు. కలెక్టర్‌గా ఎం.జగనోహ్మన్, ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్, ఎస్పీ తరుణ్జోషిని కేంద్రం తెలంగాణకే కేటాయించింది. అటవీ శాఖ ఆదిలాబాద్ కన్జర్వేటర్‌గా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి టీపీ తిమ్మారెడ్డిని కూడా కేంద్రం మన రాష్ట్రానికే కేటాయించింది. వీరంతా తెలంగాణలో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చిన విషయం విదితమే. కీలక పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్.. జిల్లా పాలనలో ఎంతో కీలకమైన జాయింట్ కలెక్టర్ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్నాళ్లు ఏఐఎస్ అధికారుల విభజన జరగకపోవడంతో ఈ పోస్టు భర్తీకి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక్కడ జే సీగా పనిచేసిన బి.లక్ష్మీకాంతం ఆంధ్రాకు చెం దిన వారు కావడంతో అక్టోబర్‌లో బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రభుత్వం కొత్త వారిని నియమించలేదు. కలెక్టర్ ఎం.జగన్మోహన్నే ఇన్చార్జి జేసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏఐఎస్ అధికారుల విభజన కొలిక్కి రావడంతో ఈ పోస్టు భర్తీ కానుంది. ఇన్నాళ్లు జాయింట్ కలెక్టర్ గా పనిచేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులెవరూ ఆసక్తి చూ పకపోవడంతో భర్తీకి నోచుకోలేదు. కాగా జిల్లా పాలన సజావుగా సాగడంలో ఎంతో కీలకమైన జేసీ పోస్టును భర్తీ చేయకపోవడంతో పౌరసరఫరాలు, భూ కేసుల పరిష్కా రం, భూసేకరణ, భూ సంస్కరణలు వంటి కీలకమైన బా ధ్యతల భారం కలెక్టర్‌పైనే పడింది. దీనికితోడు ప్రభుత్వం సమగ్ర కుటుంబసర్వే, ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమలును సమీక్షించడంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఐటీడీఏ పీవో.. ఆదివాసీ సంక్షేమ పథకాలు అమలు ఐటీడీఏ ఆరు నెలలు గా ఇన్చార్జి పాలనలోనే మగ్గుతోంది. రెగ్యులర్ పీవో లేకపోవడంతో ఐటీడీఏ పాలన అస్తవ్యస్థంగా తయారైంది. పీవోగా పనిచేసిన జనార్దన్ నివాస్ జూన్ 8నుంచి దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. ప్రతినెలా ఆయన తన సెలవును పొడగించుకుంటూ వస్తున్నారు. ఇన్చార్జి పీవోగా ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నతాధికారుల విభజన కొలిక్కి రావడంతో ఈ పోస్టులో ప్రభుత్వం కొత్తవారిని నియమించనుంది. కొత్త అధికారుల నియామకాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.