సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఆలిండియా సర్వీస్ (ఏఐఎస్) అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాల మేరకే విచారణ చేపడతామని వాద, ప్రతివాదులకు హైకోర్టు స్పష్టం చేసింది. ‘రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేడర్ వివాదంపై జనవరిలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు సందర్భంగా కమిటీ మార్గదర్శకాలను ధర్మాసనం సమర్థించింది. ఈ మార్గదర్శకాల మేరకు మాత్రమే మేం విచారణ చేపడతాం. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఆదేశాలు సరికాదు. వాటిని రద్దు చేసి.. నిర్ణయం తీసుకునే బాధ్యతను సిబ్బంది మరియు శిక్షణ విభాగం(డీవోపీటీ)కి అప్పగిస్తాం. తెలంగాణ వచ్చి దాదాపు 10 ఏళ్లు కావొస్తోంది.. పదేళ్లుగా డీజీపీ అంజనీకుమార్ సహా కేడర్ వివాదం ఎదుర్కొంటున్న అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు.
వీరిలో చాలా మంది సర్విస్ సంవత్సరంలోపు కూడా ఉంది. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తాం’అని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం మంగళవారం స్పష్టం చేసింది.
పదేళ్లుగా కొనసాగుతున్న కేడర్ వివాదం..
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఏఐఎస్ ఉద్యోగుల విభజన జరిగింది. నాటి నుంచి కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్ వివాదం సాగుతోంది. విభజన సమయంలో పలువురు అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అయితే వీరిలో కొందరు ఈ కేటాయింపులపై క్యాట్‌ను ఆశ్రయించి.. తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. క్యాట్ ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తప్పుబడుతూ.. తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే గత జనవరిలో తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీకి వెళ్లాల్సిందేనంటూ ఇదే హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే కేడర్, సరీ్వస్ సహా ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్న దృష్ట్యా తమ పిటిషన్లను విడిగా విచారణ జరపాలని డీజీపీ అంజనీకుమార్ సహా ఇతర అధికారులు కోరడంతో విచారణను సీజే ధర్మాసనం మరో బెంచ్‌కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్లపై సోమవారం జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ అనిల్‌కుమార్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
అది చట్టరీత్యా ఆమోదం కాదన్న ఏఎస్‌జీ
కేంద్రం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్‌జీ) నరసింహ శర్మ వాదనలు వినిపిస్తూ.. ఏఐఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి కేటాయింపులకు వ్యతిరేకంగా ఉపశమనం పొందడం చట్టరీత్యా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సోమేశ్‌కుమార్ తీర్పు సందర్భంగా ఇదే హైకోర్టు పేర్కొందన్నారు. అనంతరం పలువురు ఐఏఎస్‌ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 80 ప్రకారం అధికారుల కేటాయింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యూష్ సిన్హా అడ్వైజరీ కమిటీ మార్గదర్శకాలను ఐపీఎస్‌లు సవాల్ చేశారని న్యాయవాది సుదీర్ నివేదించారు.
న్యాయవాది కె.లక్ష్మీనరసింహా, సీనియర్ న్యాయవాది గోదా శివ.. ఐఏఎస్ అధికారుల తరఫున వాదనలు వినిపించారు. నివాసం ఉంటున్న ప్రాతిపదికన ఏఐఎస్ అధికారుల కేటాయింపు సరికాదన్నారు. ఈ విషయంలో నియమాకం నుంచి వాదనలు వినాల్సి ఉంటుందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. తదుపరి వాదనల కోసం నేటికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment