కొత్త రాష్ట్రం.. నూతన సంవత్సరంలో కొత్త అధికారులు కొలువు దీరనున్నారు.
కీలక పోస్టుల భర్తీకి మార్గం సుగమం
జేసీ, ఐటీడీఏ పీవోలుగా కొత్త వారు..
బెల్లంపల్లి ఏఎస్పీ బి.భూషణ్‌కు స్థానచలనం అనివార్యం
కొలిక్కి వచ్చిన ఏఐఎస్ అధికారుల కేటాయింపు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కొత్త రాష్ట్రం.. నూతన సంవత్సరంలో కొత్త అధికారులు కొలువు దీరనున్నారు. అఖిల భారత సర్వీసు (ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియ ఓ కొలిక్కి రావడంతో జిల్లా ఉన్నతాధికార పోస్టుల్లో పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఖాళీగా ఉన్న రెండు కీలక పదవులు జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మార్గం సుగమం కానుంది.
అలాగే పోలీసు శాఖకు సంబంధించి బెల్లంపల్లి అదనపు ఎస్పీ భాస్కర్ భూషణ్‌ను ఆంధ్రాకు కేటాయించడంతో ఆయన బదిలీ అనివార్యం కానుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ ఐపీఎస్ అధికారి ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రం ఆయనను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది. పక్షం రోజుల్లో ఆయనకు బదిలీ ఉత్తర్వులు అందనున్నాయి. ఐటీడీఏ పీవోగా ఉన్న జనార్దన్ నివాస్‌ను కేంద్రం ఏపీకి కేటాయించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ ఏఐఎస్ అధికారి ఆంధ్రాలో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చారు.
దీంతో ఆయన అటునుంచి అటే బదిలీపై వెళ్లనున్నారు. కలెక్టర్‌గా ఎం.జగనోహ్మన్, ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ ప్రశాంత్‌పాటిల్, ఎస్పీ తరుణ్‌జోషిని కేంద్రం తెలంగాణకే కేటాయించింది. అటవీ శాఖ ఆదిలాబాద్ కన్జర్వేటర్‌గా ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారి టీపీ తిమ్మారెడ్డిని కూడా కేంద్రం మన రాష్ట్రానికే కేటాయించింది. వీరంతా తెలంగాణలో పనిచేసేందుకు ఆప్షన్ ఇచ్చిన విషయం విదితమే.
కీలక పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్..
జిల్లా పాలనలో ఎంతో కీలకమైన జాయింట్ కలెక్టర్ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. ఇన్నాళ్లు ఏఐఎస్ అధికారుల విభజన జరగకపోవడంతో ఈ పోస్టు భర్తీకి అడ్డంకులు ఎదురయ్యాయి. ఇక్కడ జే సీగా పనిచేసిన బి.లక్ష్మీకాంతం ఆంధ్రాకు చెం దిన వారు కావడంతో అక్టోబర్‌లో బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ప్రభుత్వం కొత్త వారిని నియమించలేదు. కలెక్టర్ ఎం.జగన్మోహన్‌నే ఇన్‌చార్జి జేసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏఐఎస్ అధికారుల విభజన కొలిక్కి రావడంతో ఈ పోస్టు భర్తీ కానుంది.
ఇన్నాళ్లు జాయింట్ కలెక్టర్ గా పనిచేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులెవరూ ఆసక్తి చూ పకపోవడంతో భర్తీకి నోచుకోలేదు. కాగా జిల్లా పాలన సజావుగా సాగడంలో ఎంతో కీలకమైన జేసీ పోస్టును భర్తీ చేయకపోవడంతో పౌరసరఫరాలు, భూ కేసుల పరిష్కా రం, భూసేకరణ, భూ సంస్కరణలు వంటి కీలకమైన బా ధ్యతల భారం కలెక్టర్‌పైనే పడింది. దీనికితోడు ప్రభుత్వం సమగ్ర కుటుంబసర్వే, ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమలును సమీక్షించడంలో సమస్యలు ఏర్పడ్డాయి.
ఐటీడీఏ పీవో..
ఆదివాసీ సంక్షేమ పథకాలు అమలు ఐటీడీఏ ఆరు నెలలు గా ఇన్‌చార్జి పాలనలోనే మగ్గుతోంది. రెగ్యులర్ పీవో లేకపోవడంతో ఐటీడీఏ పాలన అస్తవ్యస్థంగా తయారైంది. పీవోగా పనిచేసిన జనార్దన్ నివాస్ జూన్ 8నుంచి దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. ప్రతినెలా ఆయన తన సెలవును పొడగించుకుంటూ వస్తున్నారు. ఇన్‌చార్జి పీవోగా ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఉన్నతాధికారుల విభజన కొలిక్కి రావడంతో ఈ పోస్టులో ప్రభుత్వం కొత్తవారిని నియమించనుంది. కొత్త అధికారుల నియామకాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు కనిపించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.