నైపుణ్యం పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు
నాలుగేళ్ల ‘శిక్షణ’లో జపాన్‌తో దీటుగా భారత్
కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసి ఉద్యోగావకాశాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో భారీ శిక్షణ కార్యక్రమాలు చేపట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి 90వ జన్మదినం సందర్భంగా కేంద్ర కార్మికుల బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) గురువారం నగరంలోని ఒక హోటల్లో ‘సుపరిపాలన’ అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడారు.
నైపుణ్యం పెంపుదల శిక్షణ విషయంలో ఇతర దేశాలతో పోల్చుకోలేని స్థితిలో భారతదేశం ఉందని ఇటీవల జరిపిన ఓ సర్వేలో తేలిందన్నారు. దేశంలో 11 వేల పారిశ్రామిక శిక్షణ సంస్థల ద్వారా 2.8లక్షల మందికి శిక్షణ లభిస్తుండగా, జర్మనీలో 30 లక్షల మందికి, జపాన్‌లో కోటి మందికి, చైనాలో రెండు కోట్ల మందికి శిక్షణ ఇస్తున్నారన్నారు. శిక్షణా సామర్థ్యం విషయంలో రానున్న నాలుగేళ్లలో జపాన్‌కు దీటుగా దేశాన్ని తీర్చిదిద్దుతామని దత్తాత్రేయ స్పష్టం చేశారు. యువతలో నైపుణ్యాల పెంపు కోసమే ఇటీవల పార్లమెంటులో అప్రెంటీస్ చట్టాన్ని సవరించామని తెలిపారు. 2042 నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలిపి మొత్తం 5.45 కోట్ల మానవ వనరుల కొరత ఏర్పడనుందని చెప్పారు.
అప్పటి లోగా దేశంలో 4.90 కోట్ల మందికి శిక్షణ ఇచ్చి నైపుణ్యం గల కార్మికులుగా తీర్చిదిద్దుతామన్నారు. నైపుణ్యాల పెంపుదల కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేశామని ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అవినీతి లేని పారదర్శక పాలనను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని హైదరాబాద్ నగరాన్ని స్మార్టు, సేఫ్ నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పోలీసు శాఖ డీజీ అనురాగ్ శర్మ తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులతో వచ్చే వారికి పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పోలీసు శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్, ఇన్ఫోటెక్ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈఎస్‌ఐ మెడికల్ కమిషనర్ ఎస్‌ఆర్ చౌహాన్, ఎమ్మెల్యేలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.