లబోదిబోమంటున్న ఆంధ్రా యువత
సాక్షి, విజయవాడ: రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్‌లో ఆంధ్రా అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులను రైల్వే శాఖ యాక్ట్ అప్రెంటిస్‌షిప్ విద్యార్థులుగా తీసుకుంటోంది. వారికి శిక్షణ ఇచ్చి తరువాత అర్హత పరీక్ష నిర్వహించి క్లాస్–4 ఉద్యోగులుగా తీసుకుంటారు. ఈ ఉద్యోగాలను ఉత్తర భారతదేశం యువకులు తన్నుకుపోతున్నారు.
ఐటీఐ అర్హత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
యాక్ట్ అప్రెంటిస్ చేయడానికి రైల్వే బోర్డు జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. గతంలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి అర్హత పరీక్ష నిర్వహించి అప్పుడు అప్రెంటిస్‌కు తీసుకునేవారు. ఎంపికైన అభ్యర్థులకు వ్యాగన్ వర్క్ షాపు, కోచింగ్ అండ్ వ్యాగన్, డీజిల్ మెకానిక్ షెడ్స్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ తదితర విభాగాల్లో శిక్షణ ఇచ్చేవారు. అది పూర్తయిన తరువాత పోస్టింగ్‌లు ఇచ్చేవారు. అయితే కొన్నేళ్ల క్రితం దీన్ని మార్పుచేసి ఐటీఐలో అభ్యర్థులు పొందిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం ప్రారంభించారు. అప్రెంటిస్ పూర్తిచేసిన వారికి రైల్వే క్లాస్–4 ఉద్యోగాల్లో 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు. బిహార్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో ఐటీఐలను ప్రోత్సహించేందుకు అక్కడి విద్యార్థులకు భారీగా మార్కులు వేస్తున్నారు. దీంతో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పోల్చితే అక్కడి విద్యార్థులకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి. దీంతో వారు యాక్ట్ అప్రెంటిస్‌కు ఎంపికవుతున్నారు.
విజయవాడ మెకానికల్ విభాగంలో 184 మంది విద్యార్థులు శిక్షణ పొందుతుంటే 70 మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారే ఉన్నారు. ఇతర విభాగాల్లోనూ ఉత్తర భారత అభ్యర్థుల శాతమే ఎక్కువగా ఉంటోంది. ఆయా రాష్ట్రాల్లోని ఐటీఐలలో శిక్షణ కోసం తెలుగు విద్యార్థులు వెళితే.. వారిని ఇబ్బందులకు గురిచేసి వెనక్కి పంపుతున్నారు. యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేసిన తరువాత కూడా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారికే క్లాస్–4 ఉద్యోగాలు లభిస్తున్నాయి. వారంతా ఇక్కడే ఉద్యోగాలు పొంది కొంతకాలానికి తమ రాష్ట్రాలకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారు. దీంతో ఇక్కడ పోస్టులు తిరిగి ఖాళీ అవుతున్నాయి. ఫలితంగా ఇక్కడ పనిచేసే సిబ్బందిపై పనిభారం పడుతోంది.
నాకు ఉద్యోగం రాలేదు
2013లో విజయవాడలో యాక్ట్ అప్రెంటిస్ పూర్తి చేశాను. కానీ.. నాకు రైల్వేలో ఉద్యోగం రాలేదు. కనీసం మన రాష్ట్రంలో శిక్షణ పొందిన వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. ఇతర రాష్ట్రాల వారే ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు.
– పి.దేవేంద్రనాయక్, విశాఖ
శిక్షణ పూర్తి చేసుకుంటున్నాను
మెకానికల్‌లో అప్రెంటిస్ షిప్ చేస్తున్నాను. ఇక్కడ ఇతర రాష్ట్రాల వారు ఎక్కువ మంది ఉన్నారు. కనీసం ఉద్యోగాలు ఇచ్చే విషయంలోనైనా ఏ జోన్ వారికి ఆ జోన్లోనే ఇస్తే మాలాంటి వారికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి.
– కె.కిరణ్, అప్రెంటిస్ అభ్యర్థి