తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరు?
- నెలాఖరుతో ముగియనున్న రాజీవ్‌శర్మ పదవీకాలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎవరనేది అధికారులందరిలో ఆసక్తి రేపుతోంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి డాక్టర్ రాజీవ్‌శర్మ సీఎస్‌గా కొనసాగుతున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తుందా.? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది.
సీఎస్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రత్యేక కారణాలున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఐఏఎస్ అధికారుల సర్వీసు కాలాన్ని 3 నెలల పాటు పొడిగించే వెసులుబాటుంది. దీంతో సీఎస్ పదవీకాలం మరో 3 నెలలు పొడిగింపు ఖాయమనే అభిప్రాయాలున్నాయి.
అదే సమయంలో పదోన్నతికి ఎదురుచూస్తున్న అర్హులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎస్ పోస్టుపై ఓ కన్నేసి ఉంచారు. పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీసీఎల్‌ఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్ సీఎస్ రేసులో ఉన్నారు. రేమండ్ పీటర్ ఆగస్టులో, ప్రదీప్ చంద్ర డిసెంబర్‌లో, ఎంజీ గోపాల్ ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు.
దీంతో సీఎస్‌గా రాజీవ్‌శర్మ పదవీ కాలం పొడిగిస్తే ప్రదీప్ చంద్ర, ఎంజీ గోపాల్‌కు ఈ పోస్టు దక్కే అవకాశాలు సన్నగిల్లుతాయి. సీఎస్ పోస్టును ఆశిస్తున్న అధికారులు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సీఎంను కలసినట్లు తెలుస్తోంది. కొందరు ఐఏఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ ఇదే వ్యవహారంలో చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.