సాక్షి, హైదరాబాద్: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు సూక్ష్మ స్థాయి (మైక్రో లెవల్) ప్రణాళికలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వారం రోజుల్లోగా ఈ నివేదికలు అందించాలన్నారు. మొక్కల సంరక్షణ, నీటి వనరుల లభ్యత, బాధ్యులకు విధుల కేటాయింపు, అవసరమైన నిధులు తదితర అంశాలతో నివేదికలు తయారు చేయాలన్నారు. మంగళవారం సచివాలయం నుంచి హరితహారంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా హరితహారం లక్ష్యాలను సమీక్షించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వర్షాలు లేని ప్రాంతాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు.
వర్షాలు లేని ప్రాంతాల్లో నీటి
సదుపాయం: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొ న్న అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. అన్ని చోట్లా నాటిన మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వర్షాలు లేని ప్రాంతాల్లో నీటి సదుపాయం కల్పించేం దుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఫారెస్ట్ డే సందర్భంగా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో డీగ్రేడ్ అయిన అటవీ ప్రాంతాలను గుర్తించి అధిక సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలో వర్షం తక్కువగా ఉన్నందున మొక్కలు నాటడం ఎక్కువగా జరగలేదని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, సోమేష్ కుమార్, రాజీవ్‌త్రివేది, అజయ్ మిశ్రా, అశోక్‌కుమార్, సునీల్‌శర్మ పాల్గొన్నారు.
మొక్కలు కాపాడే ప్రణాళికలు
Published Wed, Jul 20 2016 3:32 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
Advertisement