plants save
-
మొక్కలపై శ్రద్ధేది?
వికారాబాద్ అర్బన్: వికారాబాద్ పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి వరకు సుమారు రూ.5లక్షలు ఖర్చు చేసి గత ఏడాది మొక్కలు నాటారు. పెద్ద ఎత్తున కుండీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రారంభంలో వాటి రక్షణకు ఎంతో శ్రద్ద చూపిన మున్సిపల్ సిబ్బంది ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కనీసం వారంలో ఒకటి రెండు సార్లు కూడా నీరు పోయడం లేదని స్థానికులు అంటున్నారు. హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో రీ ప్లాంటేషన్ చేయాలి. అయితే బీజేఆర్ చౌరస్తా నుంచి ఆలంపల్లి వరకు సుమారు 53 మొక్కలు పూర్తిగా ఎండి పోయాయి. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోగా, ఉన్న వాటి రక్షణకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. -
వేసవిలో మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే...
వేసవిలో మొక్కలను చాలా జాగ్రత్తగా కంటిపాపలా చూసుకోవాలి. కొన్ని మొక్కలు వేసవిలోనే బాగా పెరుగుతాయి. ఆకులు రాలి, కొత్తగా చిగురుస్తాయి, మరికొన్ని మొక్కలు ఎండిపోతాయి. అయితే ఎక్కువ కాలం ఉండే మొక్కలు పెరగడానికి వేసవికాలం అనువుగా ఉంటుంది. అందువల్ల వేసవిలో పెరిగే మొక్కల గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పెంచుకొనే మొక్కలు వేసవిలో వడిలిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. వీటిని సూర్యరశ్మి నేరుగా తగలని ప్రాంతాలలో ఉంచాలి. బాగా ఎండలు మొదలు కాకుండా అంటే మార్చి, ఏప్రిల్ మాసాలలో మొక్కలను ట్రిమ్ చేయాలి. ఎండిన ఆకులు, కొమ్మలను తీసేయాలి. మొక్కలకు నీళ్లు ఎంత అవసరం అన్న సంగతి కుండీలోని మట్టిని తాకగానే తెలిసిపోతుంది. తాకగానే ఎండినట్లు అనిపిస్తే వెంటనే నీళ్లు పోయాలని అర్థం. నెలకి ఒకసారి ఏదైనా ఎరువుల రసాయనాన్ని నీళ్లలో కలిపి తగు మోతాదులో మొక్కలకు పోయాలి. అలా చేయటం వల్ల మొక్కలు ఆరోగ్యంగా, పచ్చగా కనిపిస్తాయి. అలాగని మోతాదు పెరిగితే మాత్రం మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. మొక్కలు పెద్దవయ్యేకొద్దీ వేళ్లు విస్తరిస్తుంటాయి. కాబట్టి మొక్కల సైజును బట్టి చిన్న కుండీలో ఉన్న మొక్కలను పెద్ద కుండీలలోకి మార్పు చేయటానికి ఇది అనువైన కాలం. ఇండోర్ మొక్కలను సూర్యరశ్మి నేరుగా పడకుండా చూసుకోవాలి. గదిలో ఉండే ఉష్ణోగ్రత సరిపోతుంది. ఈ మొక్కలకు చెదలు పట్టవు. పురుగుల బెడద కూడా ఉండదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా రెండు చుక్కల వేప నూనెను నీళ్లలో కలిపి మొక్కల మీద పిచికారీ చేయటం మంచిది. ఇలా చేయటం వల్ల మట్టి నుంచి సంక్రమించే తెగుళ్లు రాకుండా నివారించుకోవచ్చు. మొక్కలను ఎప్పుడూ ఒకేచోట ఉంచకూడదు. ఒకటి లేదా రెండు వారాలకు ఒకసారి స్థలం మారుస్తూ ఉండాలి. -
హరితోత్సవం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: పల్లెలు పచ్చలహారం వేసుకోవాలి.. పట్టణాలు పచ్చని మొక్కలతో వనాలుగా మారాలి.. భవిష్యత్ తరాలు ‘హరితహారం’తో మురిసిపోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొన్నేళ్లుగా మొక్కవోని సంకల్పంతో రాష్ట్రం మొత్తాన్ని పచ్చని హారంలా మార్చేందుకు మొక్కలు నాటడాన్ని ఉద్యమంలా చేపట్టింది. ఈ ఏడాది ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా లక్ష్యాలను నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో 3.30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే శాఖలవారీగా లక్ష్యాలను కూడా అధికారులు కేటాయించారు. ఈ క్రమంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పూలు, పండ్లతోపాటు రైతులకు అవసరమైన మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండడంతో వర్షాలు పడిన అనంతరం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. హరితహారం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తంపై నాటాల్సిన మొక్కలపై లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. అయితే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 100 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో జిల్లాకు 3.30 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టారు. అందుకు అనుగుణంగా అధికారులు మొక్కల పెంపకాన్ని ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రతి ఏడాది జూలై నెలలో హరితహారం కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ఏడాది కూడా వర్షాలు పడిన తర్వాత జూలైలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే హరితహారం కార్యక్రమంపై దిశానిర్దేశం చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులకు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఏ శాఖ ఎన్ని మొక్కలు నాటాలి? ఎక్కడెక్కడ నాటాలనే దానిపై వివరిస్తున్నారు. లక్ష్యం 3.30 కోట్ల మొక్కలు.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఆయా శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలోని పలు శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలలో 3.95 కోట్ల మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. ఖాళీ స్థలాల్లో.. జిల్లాలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కాగానే ఆయా శాఖల ఆధ్వర్యంలో అధికారులు విస్తృతంగా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. గృహ అవసరాల కోసం కూడా మొక్కలను అందజేయనున్నారు. అలాగే విద్యా సంస్థలు, వసతి గృహాలు, రోడ్డుకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పారిశ్రామిక కేంద్రాల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు మండల పరిషత్ అభివృద్ధి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని విద్యా సంస్థలు, కోల్డ్ స్టోరేజీలు, వివిధ పరిశ్రమ కేంద్రాల బాధ్యులను అధిక మొత్తంలో భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు. ఎన్నెస్పీ కాల్వ వెంట, చెరువు గట్లపై నాటే మొక్కలను అవసరాలకు అనుగుణంగా ముందస్తుగానే సిద్ధంగా ఉంచనున్నారు. మొక్కలు నాటిన అనంతరం ఆయా మొక్కల సంరక్షణను కూడా చేపట్టనున్నారు. ఏమైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటేందుకు అదనంగా మొక్కలను సిద్ధంగా ఉంచుతున్నారు. సంరక్షణే ప్రధాన ధ్యేయం.. జిల్లాలో హరితహారం కింద మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించేందుకు సైతం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్ కర్ణన్ ఆదేశాల మేరకు హరితహారం కింద నాటే మొక్కలను సంరక్షించేందుకు క్షేత్రస్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించి.. అవగాహన కల్పించనున్నాం. మొక్కలు నాటడం ఒక లక్ష్యం కాగా.. సంరక్షించడం మరో ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాం. మా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సిబ్బందికి సూచనలు చేశాం. మిగితా వారికి కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి.. మొక్కలు నాటే ప్రాధాన్యతను వివరించనున్నాం. – బి.ప్రవీణ, జిల్లా అటవీ శాఖాధికారి, ఖమ్మం -
పట్టా కావాలంటే.. మొక్కలు నాటాల్సిందే!
డిగ్రీ చదువుకోవాలంటే ఏం కావాలి.. మనవద్ద అయితే ఇంటర్మీడియట్లో పాస్ కావాలి. కాలేజీలో సీటు రావాలి. ఆ తర్వాత పుస్తకాలు కొనుక్కోవాలి.. ఇంకా.. కాలేజీకి రెగ్యులర్‌గా వెళ్లాలి.. శ్రద్ధగా చదువుకోవాలి.. పరీక్షలు బాగా రాయాలి.. అప్పుడు కానీ పాస్కాలేం. కానీ ఫిలిప్పీన్స్‌లో మాత్రం డిగ్రీ చదవాలనుకునే ప్రతి ఒక్కరూ 10 మొక్కల చొప్పున నాటాలి. అదేంటి కొత్తగా ఉందే అని అనుకుంటున్నారా..? అవును ఒక్క డిగ్రీనే కాదు హైస్కూల్, కాలేజీ పూర్తి చేయాలన్నా కూడా మొక్కలు నాటాల్సిందేనట. ఈ మేరకు ఓ బిల్లును పార్లమెంటు సభ్యుడు గారీ అలెజానో ప్రవేశపెట్టాడు. ఈ విధానం వల్ల పిల్లల్లో మొక్కలు నాటాలనే తపన పెరుగుతుందని ఆయన వివరించారు. ఇలా ఒక్క తరం పిల్లలు, యువత నాటే మొత్తం మొక్కల్లో కనీసం 10 శాతం బతికినా దాదాపు 52.5 కోట్ల చెట్లు భూమిపై జీవం పోసుకుంటాయని అంచనా. దీంతో పచ్చదనానికి పచ్చదనం.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఆలోచన బాగుంది కదూ..! -
పచ్చని ఒడి.. సర్కారు బడి
సాక్షి,పెద్దవూర : పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఎవరికైనా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన పైరగాలి వీస్తుంటే పచ్చదనం పందిళ్ల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పాఠాలను నేర్చుకోవడం ఎవరికైనా ఇష్టమే. పాఠశాలల్లో ఇలాంటి వాతావరణమే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మొక్కలు పెట్టినట్లుగా ఫొటోలకు ఫోజిచ్చి మరుసటి నాటినుంచి వాటి సంరక్షణను పూర్తిగా మరిచిపోతున్నారు అధికారులు. దీంతో నాటిన మొక్కలు నాటినట్లుగానే ఎండిపోతున్నా యి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ వన నర్సరీలను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుంది. లెక్కల్లో మాత్రం ఈ సంవత్సరం ఇన్ని లక్షల మొక్కలు నాటాము అని గొప్పలు చెప్పుకుంటూ చేతులు దులుపుకోవడం తప్ప ఆచరణలో మాత్రం అమలుకు నోచుకో వడం లేదు. ఒక మంచి పనిని పక్క వ్యక్తితో చే యించాలంటే ఆ పని తాను చేసి చూపించి ఆదర్శవంతంగా ఉంటేనే ఆ పని విజయవంతం అవుతుందనే విషయాన్ని నమ్మి ఆచరణలో పెట్టారు మండలంలోని చలకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం త్రిపురనేని లక్ష్మీప్రభ. అలాంటి వా తావరణాన్ని కోరుకోవడటమే కాదు దానిని సాకా రం చేసుకుని ఆస్వాదిస్తున్నారు విద్యార్థులు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల ఆవరణను పచ్చదనంతో నింపారు. నాటిన మొక్కలను విద్యార్థులు దత్తత తీసుకుని వాటిని సంరక్షించారు. గత నాలుగేళ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు పెరిగి పెద్దవై నీడను ఇవ్వడంతో పాటు పచ్చదనం పర్చుకుంది. రకరకాల మొక్కలు పాఠశాల ఆవరణలో హెచ్ఎం లక్ష్మీప్రభ, ఉపాధ్యాయులు ఔషద మొక్కలు, పూల మొక్కలు గాని కనిపిస్తే చాలు వాటిని కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చి వాటిని విద్యార్థులచే నాటిం చి విద్యార్థులకు దత్తత ఇస్తుంటారు. నాటిన మొక్కలను సైతం ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ గావిస్తూ సంరక్షిస్తుంటారు. ఇష్టంతో పెంచుతున్నా .. మేడంలు, సార్లు మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పటంతో ప్రతి ఒక్కరము తలా రెండు మొక్కలను దత్తత తీసుకున్నాము. ఒకరికి ఒకరు పోటీపడుతూ పాఠశాల సెలవుదినాలలోనూ స్కూలుకు వచ్చి మొక్కలకు నీటిని పోసి పెంచుతున్నాము. ఇప్పుడు నేను పెంచుతున్న మొక్కలు చెట్లు అయ్యాయి. – బూరుగు అనూష, 4వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.. మొక్కలు నాటి వాటిని పెంచడంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణను విద్యార్థులకు అప్పగించాము. నిత్యం వారికి సలహాలు ఇస్తూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచుతూ మొక్కలను సంరక్షిస్తున్నాము. – కె.నాగరాజు, ఉపాధ్యాయుడు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నాం.. పచ్చదనం అంటే నాకు ఎంతో ఇష్టం. పాఠశాలను పచ్చదనంతో నింపాలని అనుకున్నాను. హరితహారంలో భాగంగా నీడనిచ్చే కొన్ని మొక్కలను నాటాము. పూలమొక్కలు, పండ్ల మొక్కలు, ఔషద మొక్కలను బయటినుంచి కొనుగోలు చేసి నాటించాను. – త్రిపురనేని లక్ష్మీప్రభ, హెచ్ఎం, పీఎస్ చలకుర్తి -
'మొక్కలు నాటడమే కాదు.. రక్షించాలి'
హైదరాబాద్: హరితహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హరితహారంలో భాగంగా రాష్ట్రమంతటా మొక్కలు నాటితే సరిపోదన్నారు. నాటిన మొక్కలను సైతం రక్షించాల్సి అవసరం ఎంతైనా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మొక్కల సంరక్షణ కోరకు అవసరమైతే ఫైరింజన్లు, వాటర్ ట్యాంకులను ఉపయోగించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. -
మొక్కలు కాపాడే ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు సూక్ష్మ స్థాయి (మైక్రో లెవల్) ప్రణాళికలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వారం రోజుల్లోగా ఈ నివేదికలు అందించాలన్నారు. మొక్కల సంరక్షణ, నీటి వనరుల లభ్యత, బాధ్యులకు విధుల కేటాయింపు, అవసరమైన నిధులు తదితర అంశాలతో నివేదికలు తయారు చేయాలన్నారు. మంగళవారం సచివాలయం నుంచి హరితహారంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా హరితహారం లక్ష్యాలను సమీక్షించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వర్షాలు లేని ప్రాంతాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. వర్షాలు లేని ప్రాంతాల్లో నీటి సదుపాయం: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొ న్న అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. అన్ని చోట్లా నాటిన మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వర్షాలు లేని ప్రాంతాల్లో నీటి సదుపాయం కల్పించేం దుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఫారెస్ట్ డే సందర్భంగా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో డీగ్రేడ్ అయిన అటవీ ప్రాంతాలను గుర్తించి అధిక సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలో వర్షం తక్కువగా ఉన్నందున మొక్కలు నాటడం ఎక్కువగా జరగలేదని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, సోమేష్ కుమార్, రాజీవ్‌త్రివేది, అజయ్ మిశ్రా, అశోక్‌కుమార్, సునీల్‌శర్మ పాల్గొన్నారు.