హరితోత్సవం  | Haritha Haram Program In Khammam | Sakshi
Sakshi News home page

హరితోత్సవం 

Published Wed, Jun 19 2019 7:22 AM | Last Updated on Wed, Jun 19 2019 7:22 AM

Haritha Haram Program In Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: పల్లెలు పచ్చలహారం వేసుకోవాలి.. పట్టణాలు పచ్చని మొక్కలతో వనాలుగా మారాలి.. భవిష్యత్‌ తరాలు ‘హరితహారం’తో మురిసిపోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కొన్నేళ్లుగా మొక్కవోని సంకల్పంతో రాష్ట్రం మొత్తాన్ని పచ్చని హారంలా మార్చేందుకు మొక్కలు నాటడాన్ని ఉద్యమంలా చేపట్టింది. ఈ ఏడాది ఐదో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా లక్ష్యాలను నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఈ ఏడాది హరితహారం కార్యక్రమంలో 3.30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే శాఖలవారీగా లక్ష్యాలను కూడా అధికారులు కేటాయించారు. ఈ క్రమంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో పూలు, పండ్లతోపాటు రైతులకు అవసరమైన మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉండడంతో వర్షాలు పడిన అనంతరం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. 

హరితహారం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తంపై నాటాల్సిన మొక్కలపై లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాకు లక్ష్యాలను నిర్దేశిస్తుంది. అయితే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 100 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో జిల్లాకు 3.30 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టారు. అందుకు అనుగుణంగా అధికారులు మొక్కల పెంపకాన్ని ఆయా శాఖల ఆధ్వర్యంలో చేపట్టారు. ప్రతి ఏడాది జూలై నెలలో హరితహారం కార్యక్రమాన్ని చేపడతారు. ఈ ఏడాది కూడా వర్షాలు పడిన తర్వాత జూలైలో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే హరితహారం కార్యక్రమంపై దిశానిర్దేశం చేసేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో అధికారులకు సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఏ శాఖ ఎన్ని మొక్కలు నాటాలి? ఎక్కడెక్కడ నాటాలనే దానిపై వివరిస్తున్నారు. 

లక్ష్యం 3.30 కోట్ల మొక్కలు.. 
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 3.30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఆయా శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. జిల్లాలోని పలు శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలలో 3.95 కోట్ల మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. 


ఖాళీ స్థలాల్లో.. 
జిల్లాలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కాగానే ఆయా శాఖల ఆధ్వర్యంలో అధికారులు విస్తృతంగా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. గృహ అవసరాల కోసం కూడా మొక్కలను అందజేయనున్నారు. అలాగే విద్యా సంస్థలు, వసతి గృహాలు, రోడ్డుకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర పారిశ్రామిక కేంద్రాల ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని విద్యా సంస్థలు, కోల్డ్‌ స్టోరేజీలు, వివిధ పరిశ్రమ కేంద్రాల బాధ్యులను అధిక మొత్తంలో భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు. ఎన్నెస్పీ కాల్వ వెంట, చెరువు గట్లపై నాటే మొక్కలను అవసరాలకు అనుగుణంగా ముందస్తుగానే సిద్ధంగా ఉంచనున్నారు. మొక్కలు నాటిన అనంతరం ఆయా మొక్కల సంరక్షణను కూడా చేపట్టనున్నారు. ఏమైనా మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటేందుకు అదనంగా మొక్కలను సిద్ధంగా ఉంచుతున్నారు.  
 
సంరక్షణే ప్రధాన ధ్యేయం.. 
జిల్లాలో హరితహారం కింద మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించేందుకు సైతం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టర్‌ కర్ణన్‌ ఆదేశాల మేరకు హరితహారం కింద నాటే మొక్కలను సంరక్షించేందుకు క్షేత్రస్థాయిలో సమావేశాలు సైతం నిర్వహించి.. అవగాహన కల్పించనున్నాం. మొక్కలు నాటడం ఒక లక్ష్యం కాగా.. సంరక్షించడం మరో ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాం. మా శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సిబ్బందికి సూచనలు చేశాం. మిగితా వారికి కూడా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి.. మొక్కలు నాటే ప్రాధాన్యతను వివరించనున్నాం. 
– బి.ప్రవీణ, జిల్లా అటవీ శాఖాధికారి, ఖమ్మం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement