Haritharam
-
పంచాయతీలపైనే భారం
సాక్షి, అచ్చంపేట: హరితహార కార్యక్రమం ప్రజాప్రతినిధులకు పెద్ద పరీక్షగా మారింది.. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటించడం వారికి తలనొప్పిగా పరిణమించింది.. ఐదో విడత హరితహారం కార్యక్రమంలో ప్రభుత్వ శాఖలు పూర్తిస్థాయిలో భాగస్వామ్యం కాకపోవడంతో గ్రామ పంచాయతీలపైనే భారం పడింది.. దీంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం తమకు తలకు మించిన భారంగా మారిందని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది వాపోతున్నారు. గతంలో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వివిధ ప్రభుత్వ శాఖలు బాధ్యత తీసుకునేవి. దీంతో ప్రతి విడతలో జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటించారు. అయితే, ఇప్పుడు కొనసాగుతున్న ఐదో విడతలో జిల్లాలో 2.10 కోట్ల మొక్కలను నాటించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 30లక్షల మొక్కలను మాత్రమే నాటించారు. మరో 1.80 కోట్ల మొక్కలు నాటాల్సి ఉంది. ప్రస్తుతం ఈ భారమంతా పంచాయతీ పాలకవర్గంపైనే పడింది. అన్నింటికీ ఒకే లక్ష్యం.. నాగర్‌కర్నూల్ జిల్లాలో 453 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో ఎక్కువ భూవిస్తీర్ణం ఉన్న గ్రామాలు తక్కువగా ఉన్నాయి. మిగిలిన గ్రామాలు విస్తీర్ణం పరంగా చాలా చిన్నవి. అయితే అన్ని గ్రామ పంచాయతీలకు ఒకే విధమైన లక్ష్యాన్ని నిర్దేశించడంతో సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద గ్రామాలు తేడా లేకుండా 40 వేల మొక్కలను నాటాలని నిర్ధేశించారు. ఈ లెక్కన మొక్కలను నాటితే గ్రామ పంచాయతీల పరిధిలో కోటిన్నర మొక్కలు నాటే అవకాశం ఉంది. మిగిలిన మొక్కలను మున్సిపాలిటీలు, మరికొన్ని అటవీ శాఖ భూముల్లో నాటించాలి. చిన్న గ్రామ పంచాయతీల పరిధిలో వ్యవసాయ భూమి తక్కువగానే ఉండటంతో 40 వేల చొప్పున మొక్కలను నాటడం సాధ్యం కావడం లేదు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంతోపాటు మొక్కలను సంరక్షించే బాధ్యత సర్పంచ్, కార్యదర్శి, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బందిపై ఉంది. కానీ, విస్తీర్ణం తక్కువగా ఉన్న చోట నిర్ధేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటడమే ఇబ్బందిగా మారింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది వర్షాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో మొక్కలు నాటడం సాధ్యం కావడం లేదు. గతంలో అన్ని శాఖలకు.. హరితహారం కార్యక్రమం తొలి నాలుగు విడతల్లో అన్ని ప్రభుత్వ శాఖలకు లక్ష్యాన్ని నిర్ణయించి ఆ మేరకు మొక్కలు నాటించారు. వ్యవసాయం, విద్య, వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్, నీటి పారుదల శాఖ, ఆర్అండ్బీ, అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రవాణా తదితర శాఖలకు మొక్కలను నాటించే బాధ్యతను అప్పగించారు. వ్యవసాయ శాఖ ద్వారా పొలం గట్లు, వ్యవసాయ క్షేత్రాలు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చెరువుల శిఖం భూముల్లో మొక్కలు నాటించారు. ఇలా అన్ని ప్రభుత్వ శాఖలను హరితహారంలో భాగస్వాములను చేయడంతో నిర్ధేశిత లక్ష్యం పూర్తయ్యింది. కానీ ఇప్పుడు పంచాయతీలపైనే భారం మోపడంతో ఆ మొక్కలను ఎలా నాటించాలో అర్థం కావడం లేదని సర్పంచ్‌లు, కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీలలో సిబ్బంది తక్కువగా ఉండటంతో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడం ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. 4 వేల మొక్కలు నాటాం మాది జనాభా పరంగానే కాకుండా విస్తీర్ణంలోనూ చిన్న గ్రామం. రెవెన్యూ, అటవీ భూములు అసలే లేవు. అందువల్ల ఎక్కువ మొత్తంలో మొక్కలను నాటించడం ఇబ్బందిగా ఉంది. 10 నుంచి 15 వేల మొక్కలైతే సరిపోతుంది. ఇప్పటి వరకు 4 వేల మొక్కలు నాటాం. ప్రజల సహకారంతో ఇళ్ల వద్ద మొక్కలను నాటించడానికి కృషి చేస్తున్నాం. – సేవ్యానాయక్, సర్పంచ్, సీబీతండా, ఉప్పునుంతల మండలం పెద్ద బాధ్యతే.. మేం సర్పంచ్‌లుగా ఎంపికైన మొదటి సంవత్సరమే ప్రభుత్వం మాపై పెద్ద బాధ్యతను మోపింది. మాది చిన్న గ్రామమైనా లక్ష్యానికి అనుగుణంగా మొక్కలను నాటించడానికి కృషి చేస్తున్నాం. ప్రజలకు హరితహారంపై అవగాహన కల్పించి ఇళ్ల వద్ద ఎక్కువ మొక్కలను నాటించి, పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. – జితేందర్‌రెడ్డి, సర్పంచ్, బ్రాహ్మణపల్లి, అచ్చంపేట మండలం -
హరితహారంలో సారంగా‘పూర్’
సారంగాపూర్ : హరితహారంలో సారంగాపూర్ వెనుకబడి ఉందని ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం మండలపరిషత్ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్వామా ఏపీడీ కుందారపు లక్ష్మీనారాయణ నిర్దేశించిన లక్ష్యాన్ని పదిరోజుల్లో ఎలా పూర్తిచేయాలన్న విషయంపై చర్చించారు. ఎంపీపీ శారద, ప్రత్యేకాధికారి అంబయ్య, ఎంపీడీవో పుల్లయ్య, ఈజీఎస్ ఏపీవో అంకూస్ అహ్మద్ పాల్గొన్నారు. విఫలం అయింది ఇలా.. ప్రారంభంలో మండల అధికారికి ఒక గ్రామాన్ని అప్పగించారు. హడావుడిగా మెుక్కలు నాటడం మెుదలు పెట్టారు. ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీæ సెంటర్లు, పాఠశాలలు, రైతుల పంట పొలాల గట్లు, రోడ్ల వెంట మొక్కలు నాటారు. గడువు ముగిసే సమయానికి సగం లక్ష్యం చేరలేదని గుర్తించారు. మండలంలో మొత్తం 22 గ్రామాల్లో ఉపాధి పథకం కింద మూడు లక్షల నుంచి మూడు లక్షలయాభైవేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం లక్షాయాభై వేల మొక్కలు మాత్రమే నాటారు. జిల్లాలో అన్ని మండలాలకంటే సారంగాపూర్ వెనుకబడడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం అటవీశాఖ పరిధిలోని ఖాళీ భూములను మంగేళ, బట్టపల్లి, బీర్పూర్, పోతారం, రంగసాగర్, సారంగాపూర్, రంగపేట గ్రామాల్లో ఉపాధి కూలీల ద్వారా నాటించడానికి ఆ శాఖ అనుమతినిచ్చింది. బీడుగా ఉన్న రెవెన్యూ భూముల వివరాలు ఇవ్వాలని ఏపీడీ ఆదేశాలు జారీ చేశారు. 22 గ్రామాల్లో 11 గ్రామాలను ఎంపీడీవో పుల్లయ్య, 11 గ్రామాలను తహసీల్దార్ వెంకటరమణ పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతీరోజు 20 వేల గుంతలు తీయాలని, మొత్తం 1.50 నుంచి 2 లక్షల మొక్కలు పది రోజుల్లో నాటాలని నిర్ణయించారు. ప్రస్తుతం గ్రామాల్లో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఉపాధి కూలీలు వచ్చే పరిస్థితి లేదు. లక్ష్యం చేరడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
అంతరించిపోతున్న అడవులను కాపాడాలి
నైతిక బాధ్యతతో మొక్కలు నాటాలి వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాక్‌రావు జైపూర్ : అంతరించిపోతున్న ఆడవులను కాపాడాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి హరితహారం కార్యక్రమం చేపడుతోందని ప్రతిఒక్కరూ నైతికబాధ్యతతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వరంగల్ రేంజ్ డీఐజీ టీ.ప్రభాకర్‌రావు తెలిపారు. జైపూర్ మండలం ఇందారం గ్రామంలో పోలీస్ జనమైత్రి కార్యక్రమంలో భాగంగా స్థానిక శివసాయి రైస్ మిల్లులో బుధవారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. హరితహారం కార్యక్రమానికి వరంగల్ రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై రైస్‌మిల్లు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్, జెడ్పీటీసీ జర్పుల రాజ్‌కుమార్‌నాయక్, స్థానిక సర్పంచ్ జక్కుల వెంకటేశం, ఎంపీటీసీ సభ్యురాలు కె.రజిత, శ్రీరాంపూర్ సీఐ డి.వేణుచందర్, జనమైత్రిపోలీస్ అధికారి, ఏఎస్సై గంగన్న, శివసాయి రైస్‌మిల్లు నిర్వహకులు ఎన్.కాంతయ్య, రాజలింగం, పోలీస్‌శాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
మొక్కలు కాపాడే ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు సూక్ష్మ స్థాయి (మైక్రో లెవల్) ప్రణాళికలను తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వారం రోజుల్లోగా ఈ నివేదికలు అందించాలన్నారు. మొక్కల సంరక్షణ, నీటి వనరుల లభ్యత, బాధ్యులకు విధుల కేటాయింపు, అవసరమైన నిధులు తదితర అంశాలతో నివేదికలు తయారు చేయాలన్నారు. మంగళవారం సచివాలయం నుంచి హరితహారంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా హరితహారం లక్ష్యాలను సమీక్షించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వర్షాలు లేని ప్రాంతాల్లో నాటిన మొక్కల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలన్నారు. వర్షాలు లేని ప్రాంతాల్లో నీటి సదుపాయం: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొ న్న అటవీ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. అన్ని చోట్లా నాటిన మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, వర్షాలు లేని ప్రాంతాల్లో నీటి సదుపాయం కల్పించేం దుకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఫారెస్ట్ డే సందర్భంగా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో డీగ్రేడ్ అయిన అటవీ ప్రాంతాలను గుర్తించి అధిక సంఖ్యలో మొక్కలు నాటాలన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ... నల్గొండ జిల్లాలో వర్షం తక్కువగా ఉన్నందున మొక్కలు నాటడం ఎక్కువగా జరగలేదని చెప్పారు. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, వివిధ విభాగాల ముఖ్య కార్యదర్శులు రాజేశ్వర్ తివారీ, సోమేష్ కుమార్, రాజీవ్‌త్రివేది, అజయ్ మిశ్రా, అశోక్‌కుమార్, సునీల్‌శర్మ పాల్గొన్నారు. -
హరితహారానికి రూ.రెండు లక్షల విరాళం
ముకరంపుర: ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకున్న జిల్లా అధికారులు చేయూతనందించారు. జిల్లా అధికారుల సంఘం తరఫున రూ.2 లక్షల విరాళం ప్రకటించారు. జిల్లా అధికారులందరూ మూడు రోజుల వేతనాన్ని విరాళంగా సమకూర్చారు. ఈ మేరకు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ నీతూప్రసాద్, జేసీ శ్రీదేవసేనకు అంగీకార లేఖ అందిందించారు. ఈ మొత్తాన్ని కరీంనగర్ పట్టణంలో చెట్ల సంరక్షణ, ట్రీగార్డుల కొనుగోలుకు ఉపయోగించాలని కోరారు. కలెక్టర్ అధికారులను కలెక్టర్ అభిన ందించారు. కార్యక్రమంలో జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు, హౌసింగ్ పీడీ నర్సింగరావు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ, డీఆర్వో వీరబ్రహ్మయ్య, ఉద్యానశాఖ డీడీ సంగీత లక్ష్మి, సీపీవో సుబ్బారావు, జెడ్పీ సీఈవో సూరజ్, డీఎస్వో నాగేశ్వర్రావు తదితరులు ఉన్నారు. -
మొక్కలు సరే.. సంరక్షణే సమస్య
హరితహారం.. లక్షల వ్యయం గార్డులకు మాత్రం నిధుల కొరత సుమారు కోటి మొక్కలకు రక్షణ కరువు విరాళాలిచ్చేందుకు పలువురు ముందుకు.. అందరూ భాగస్వాములైతేనే నెరవేరనున్న లక్ష్యం పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ సంపదను పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమంలా చేపట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్నా పెద్ద తేడా లేకుండా మొక్కలు నాటే కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఇందులో భాగస్వాములవుతున్నారు. మొక్కల పెంపకం కోసం నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు లక్షల్లో నిధులు కేటాయించింది. అయితే నాటిన మొక్కల సంరక్షణ విషయంలో సరిపడా నిధులు కేటాయించకపోవడం సమస్యగా మారింది. ఎలాంటి రక్షణ లేని మొక్కలు పశువులకు ఆహరంగా మారే పరిస్థితి నెలకొంది. దీంతో నిర్దేశిత లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరకపోవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. - జమ్మికుంట నాలుగు కోట్ల మొక్కల్లో.. కోటికి పైగా రక్షణ కరువు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం లో కనీసం 40 వేల మొక్కలు నాటేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు నర్సరీల్లో దాదాపు నాలుగు కోట్ల మొక్కలను గ్రామాల వారీగా పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొం దించారు. ఈ నెల 8 నుంచి రెండో విడత హరతహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే నాలుగు కోట్ల మొక్కల్లో దాదాపు సగం వరకు ట్రీగార్డుల సమస్య నెలకొంది. వీటిని ఏర్పాటు చేస్తే తప్ప మొక్కలు బతికే పరిస్థితి లేదు. లేకుం టే రోడ్ల వెంట, చెరువు, కాలువ గ ట్లపై, వనాల్లో నాటిన మొక్కలు పశువుల పాలు కాకత ప్పదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంరక్షణకు రూ.150 కోట్లు జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా అధికార యంత్రంగం అడుగులు వేస్తుండగా ఇందులో సుమారు కోటి మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు తప్పనిసరిగా మారింది. అయితే ఒక్కోదానికి రూ.150 వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన కొనుగోలు చేసినా కోటి మొక్కలకు సుమారు రూ.150 కోట్లు అవసరం కానున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు సర్కారు కేటాయించే పరిస్థితి లేక పోవడంతో దాతలపై భారం పడనుంది. ట్రీగార్డుల కోసం విరాళాల ఉద్యమానికి శ్రీకారం చుడితే తప్పా కోట్లాది మొక్కలను సంరక్షించలేని పరిస్థితి. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రక్షణ కోసం ముందుకు వస్తున్న దాతలు - జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలు సంరక్షణ కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపార వర్గాలు ట్రీగార్డులను ఉచితంగా అందించేందుకు ముందుకు వస్తున్నారు. - తనవంతు సహకారంగా మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు జేసీ శ్రీదేవసేన ఇటీవల ప్రకటించారు. అలాగే పౌర సరఫరాల శాఖ సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. - జమ్మికుంట పట్టణానికి చెందిన కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దోనకొండ మల్లారెడ్డి మొక్కల సంరక్షణ కోసం రూ.లక్షను మంత్రి ఈటల రాజేందర్‌కు శనివారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే రైస్‌మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ తాను రూ.లక్ష విరాళంగా ఇస్తానని ప్రకటించారు. నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి పాలకవర్గం నెల వేతనం ట్రీగార్డుల కోసం విరాళంగా ఇస్తామని వెల్లడించారు. -ఇటీవల కథలాపూర్ మండలం పోసానిపేటలో స్నేహాయూత్ సభ్యులు 120 ట్రీగార్డులు కొను గోలు చేసి మొక్కలకు ఏర్పాటు చేశారు. - కోల్‌సిటీ : హరితహారం కార్యక్రమానికి ఆర్థికసాయం అందించేందుకు రామగుండం నగరపాలక సంస్థ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ ఒక నెల తమ గౌరవ వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ డి.జాన్ శ్యాంసన్‌తోపాటు నగరపాలక సంస్థ అధికారులు, అన్ని విభాగాల ఉద్యోగులు, సిబ్బంది కూడా తమ ఒక నెల వేతనాన్ని కూడా విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంపై మేయర్ అభినందించారు.