మొక్కలు సరే.. సంరక్షణే సమస్య
హరితహారం.. లక్షల వ్యయం
గార్డులకు మాత్రం నిధుల కొరత
సుమారు కోటి మొక్కలకు రక్షణ కరువు
విరాళాలిచ్చేందుకు పలువురు ముందుకు..
అందరూ భాగస్వాములైతేనే నెరవేరనున్న లక్ష్యం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ సంపదను పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమంలా చేపట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్నా పెద్ద తేడా లేకుండా మొక్కలు నాటే కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఇందులో భాగస్వాములవుతున్నారు. మొక్కల పెంపకం కోసం నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు లక్షల్లో నిధులు కేటాయించింది. అయితే నాటిన మొక్కల సంరక్షణ విషయంలో సరిపడా నిధులు కేటాయించకపోవడం సమస్యగా మారింది. ఎలాంటి రక్షణ లేని మొక్కలు పశువులకు ఆహరంగా మారే పరిస్థితి నెలకొంది. దీంతో నిర్దేశిత లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరకపోవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- జమ్మికుంట
నాలుగు కోట్ల మొక్కల్లో.. కోటికి పైగా రక్షణ కరువు
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం లో కనీసం 40 వేల మొక్కలు నాటేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు నర్సరీల్లో దాదాపు నాలుగు కోట్ల మొక్కలను గ్రామాల వారీగా పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొం దించారు. ఈ నెల 8 నుంచి రెండో విడత హరతహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే నాలుగు కోట్ల మొక్కల్లో దాదాపు సగం వరకు ట్రీగార్డుల సమస్య నెలకొంది. వీటిని ఏర్పాటు చేస్తే తప్ప మొక్కలు బతికే పరిస్థితి లేదు. లేకుం టే రోడ్ల వెంట, చెరువు, కాలువ గ ట్లపై, వనాల్లో నాటిన మొక్కలు పశువుల పాలు కాకత ప్పదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంరక్షణకు రూ.150 కోట్లు
జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా అధికార యంత్రంగం అడుగులు వేస్తుండగా ఇందులో సుమారు కోటి మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు తప్పనిసరిగా మారింది. అయితే ఒక్కోదానికి రూ.150 వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన కొనుగోలు చేసినా కోటి మొక్కలకు సుమారు రూ.150 కోట్లు అవసరం కానున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు సర్కారు కేటాయించే పరిస్థితి లేక పోవడంతో దాతలపై భారం పడనుంది. ట్రీగార్డుల కోసం విరాళాల ఉద్యమానికి శ్రీకారం చుడితే తప్పా కోట్లాది మొక్కలను సంరక్షించలేని పరిస్థితి. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రక్షణ కోసం ముందుకు వస్తున్న దాతలు
- జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలు సంరక్షణ కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపార వర్గాలు ట్రీగార్డులను ఉచితంగా అందించేందుకు ముందుకు వస్తున్నారు.
- తనవంతు సహకారంగా మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు జేసీ శ్రీదేవసేన ఇటీవల ప్రకటించారు. అలాగే పౌర సరఫరాల శాఖ సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు.
- జమ్మికుంట పట్టణానికి చెందిన కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దోనకొండ మల్లారెడ్డి మొక్కల సంరక్షణ కోసం రూ.లక్షను మంత్రి ఈటల రాజేందర్‌కు శనివారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే రైస్‌మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ తాను రూ.లక్ష విరాళంగా ఇస్తానని ప్రకటించారు. నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి పాలకవర్గం నెల వేతనం ట్రీగార్డుల కోసం విరాళంగా ఇస్తామని వెల్లడించారు.
-ఇటీవల కథలాపూర్ మండలం పోసానిపేటలో స్నేహాయూత్ సభ్యులు 120 ట్రీగార్డులు కొను గోలు చేసి మొక్కలకు ఏర్పాటు చేశారు.
- కోల్‌సిటీ : హరితహారం కార్యక్రమానికి ఆర్థికసాయం అందించేందుకు రామగుండం నగరపాలక సంస్థ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ ఒక నెల తమ గౌరవ వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ డి.జాన్ శ్యాంసన్‌తోపాటు నగరపాలక సంస్థ అధికారులు, అన్ని విభాగాల ఉద్యోగులు, సిబ్బంది కూడా తమ ఒక నెల వేతనాన్ని కూడా విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంపై మేయర్ అభినందించారు.