funds shortage
-
బడిపై సర్కారీ పిడుగు
ప్రకాశం, పొన్నలూరు: నేటి సర్కారు కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధిని విస్మరించడం పరిపాటిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమైంది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా వాటి నిర్వాహణకు సంబంధించిన నిధులను ఇంత వరకు విడుదల చేయలేదు. కనీసం చాక్‌పీసులు, డస్టర్లకు కూడా డబ్బులు లేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. దీంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తాత్కాలికంగా తమ సొంత నిధులు వెచ్చించాల్సి వస్తోంది. ప్రైమరీ స్కూళ్లు మరీ దారుణం రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మెయింట్‌నెన్స్ గ్రాంట్స్‌ను విడుదల చేసినప్పటికీ మిగిలిన పాఠశాలలకు నిధులు మంజూరు చేయలేదు. జిల్లాలో 2951 ప్రాథమిక పాఠశాలలు, 560 ప్రాథమికోన్నత, 883 జిల్లా పరిషత్ ఉన్నత, 26 ప్రభుత్వ హైస్కూల్స్ ఉన్నాయి. ఈ మొత్తం పాఠశాలలకు సుమారు 5 కోట్ల 16 లక్షల రూపాయిల నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. పాఠశాలల మూసివేత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్య ముందుకు సాగడం లేదు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణం చూపిస్తూ రేషనైలేజేషన్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడులను మూసి వేయించింది. ఆ తరువాత గత నాలుగేళ్లుగా పాఠశాలలు ప్రారంభమైన ఐదు నెలలకు కూడా పాఠ్యపుస్తకాలు, విద్యా సంవత్సం చివరికి కూడా యూనిఫాంలు అందించడంలేదు. ప్రతి ఏడాది ప్రభుత్వ బడులపై చంద్రబాబు అవలంబిస్తున్న తీరుపై అన్ని వర్గా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో నిర్వహణకు కావాల్సిన నిధులను కూడా విడుదల చేయకపోవడంతో వాటిని నడపలేక ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. సర్కార్ బడులను నిర్వాహణకు ప్రారంభంలోనే సర్వశిక్షా అభియాన్ ద్వారా నిధులు విడుదల చేయాలి. కాని ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. ప్రాథమిక పాఠశాలకు రూ, 10 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 12 వేలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 17 వేల చొప్పున నిధులు విడుదల చేయాలి. ఈ డబ్బులు కూడా పాఠశాల ప్రాంగణం, తరగతి గదుల సంఖ్యను బట్టి కొంచం అటు ఇటుగా మారిపోతూ అర్హతన బట్టి ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదలవుతుంటాయి. వీటితో చాక్‌పీసులు, డస్టర్లు, చీపుర్లు, ఫినాయిల్, సబ్బులు, పేపర్లతో పాటు బోధనాభ్యసన సామాగ్రి, పాఠశాల ఫర్నిచర్, మరమ్మతులు, విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, ప్రథమ చికిత్స కిట్లు వంటి వాటికి వినియోగిస్తారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల తీర్మానం మేరకు ఖర్చు చేస్తారు. ఈనేపథ్యంలో ప్రతి నెలా విద్యుత్ బిల్లులు, స్టేషనరీతో పాటు చిన్న పనులకు ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులను వినియోగిస్తున్నారు. కనీసం చాక్‌పీసులు కొనేందుకు కూడా పాఠశాలల్లో డబ్బులు లేకుండా పోయాయని, పాఠశాల అవసరతలకు సైతం సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని ఉపాధ్యాయయులు, హెచ్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరు బాగులేదు: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు బాగులేదు. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యారంగం కుంటుపడింది.సీహెచ్ శ్యామ్, పీడీఎస్‌యూజిల్లా సహాయ కార్యదర్శి -
మొక్కలు సరే.. సంరక్షణే సమస్య
హరితహారం.. లక్షల వ్యయం గార్డులకు మాత్రం నిధుల కొరత సుమారు కోటి మొక్కలకు రక్షణ కరువు విరాళాలిచ్చేందుకు పలువురు ముందుకు.. అందరూ భాగస్వాములైతేనే నెరవేరనున్న లక్ష్యం పర్యావరణ పరిరక్షణలో భాగంగా అటవీ సంపదను పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమంలా చేపట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్నా పెద్ద తేడా లేకుండా మొక్కలు నాటే కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులంతా ఇందులో భాగస్వాములవుతున్నారు. మొక్కల పెంపకం కోసం నర్సరీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు లక్షల్లో నిధులు కేటాయించింది. అయితే నాటిన మొక్కల సంరక్షణ విషయంలో సరిపడా నిధులు కేటాయించకపోవడం సమస్యగా మారింది. ఎలాంటి రక్షణ లేని మొక్కలు పశువులకు ఆహరంగా మారే పరిస్థితి నెలకొంది. దీంతో నిర్దేశిత లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరకపోవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. - జమ్మికుంట నాలుగు కోట్ల మొక్కల్లో.. కోటికి పైగా రక్షణ కరువు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామం లో కనీసం 40 వేల మొక్కలు నాటేలా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు నర్సరీల్లో దాదాపు నాలుగు కోట్ల మొక్కలను గ్రామాల వారీగా పంపిణీ చేసేలా ప్రణాళికలు రూపొం దించారు. ఈ నెల 8 నుంచి రెండో విడత హరతహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే నాలుగు కోట్ల మొక్కల్లో దాదాపు సగం వరకు ట్రీగార్డుల సమస్య నెలకొంది. వీటిని ఏర్పాటు చేస్తే తప్ప మొక్కలు బతికే పరిస్థితి లేదు. లేకుం టే రోడ్ల వెంట, చెరువు, కాలువ గ ట్లపై, వనాల్లో నాటిన మొక్కలు పశువుల పాలు కాకత ప్పదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంరక్షణకు రూ.150 కోట్లు జిల్లా వ్యాప్తంగా నాలుగు కోట్ల మొక్కలు నాటే లక్ష్యంగా అధికార యంత్రంగం అడుగులు వేస్తుండగా ఇందులో సుమారు కోటి మొక్కల సంరక్షణకు ట్రీగార్డులు తప్పనిసరిగా మారింది. అయితే ఒక్కోదానికి రూ.150 వరకు ధర పలుకుతోంది. ఈ లెక్కన కొనుగోలు చేసినా కోటి మొక్కలకు సుమారు రూ.150 కోట్లు అవసరం కానున్నాయి. ఇంత పెద్ద మొత్తంలో నిధులు సర్కారు కేటాయించే పరిస్థితి లేక పోవడంతో దాతలపై భారం పడనుంది. ట్రీగార్డుల కోసం విరాళాల ఉద్యమానికి శ్రీకారం చుడితే తప్పా కోట్లాది మొక్కలను సంరక్షించలేని పరిస్థితి. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ఇతర స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రక్షణ కోసం ముందుకు వస్తున్న దాతలు - జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలు సంరక్షణ కోసం అధికారులు, ప్రజా ప్రతినిధులు, వ్యాపార వర్గాలు ట్రీగార్డులను ఉచితంగా అందించేందుకు ముందుకు వస్తున్నారు. - తనవంతు సహకారంగా మూడు రోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు జేసీ శ్రీదేవసేన ఇటీవల ప్రకటించారు. అలాగే పౌర సరఫరాల శాఖ సిబ్బంది ఒక రోజు వేతనాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. - జమ్మికుంట పట్టణానికి చెందిన కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దోనకొండ మల్లారెడ్డి మొక్కల సంరక్షణ కోసం రూ.లక్షను మంత్రి ఈటల రాజేందర్‌కు శనివారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అలాగే రైస్‌మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు భాస్కర్ తాను రూ.లక్ష విరాళంగా ఇస్తానని ప్రకటించారు. నగర పంచాయతీ చైర్మన్ పోడేటి రామస్వామి పాలకవర్గం నెల వేతనం ట్రీగార్డుల కోసం విరాళంగా ఇస్తామని వెల్లడించారు. -ఇటీవల కథలాపూర్ మండలం పోసానిపేటలో స్నేహాయూత్ సభ్యులు 120 ట్రీగార్డులు కొను గోలు చేసి మొక్కలకు ఏర్పాటు చేశారు. - కోల్‌సిటీ : హరితహారం కార్యక్రమానికి ఆర్థికసాయం అందించేందుకు రామగుండం నగరపాలక సంస్థ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ ఒక నెల తమ గౌరవ వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ డి.జాన్ శ్యాంసన్‌తోపాటు నగరపాలక సంస్థ అధికారులు, అన్ని విభాగాల ఉద్యోగులు, సిబ్బంది కూడా తమ ఒక నెల వేతనాన్ని కూడా విరాళంగా ఇచ్చేందుకు ముందుకు రావడంపై మేయర్ అభినందించారు. -
ఎరువుల నిల్వకు నిధుల కొరత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్‌కు ఎరువులను ముందస్తు నిల్వ(బఫర్ స్టాక్) చేయడానికి రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్)ను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో తమవద్ద ఉన్న ఆర్థిక వనరులను పోగుచేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్క్‌ఫెడ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ నిధులు కూడా సరిపోయేలా కన్పించకపోవడంతో మార్కఫెడ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పవని తెలుస్తోంది. 3 లక్షల టన్నుల ఎరువుల నిల్వ... ఖరీఫ్ సీజన్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎరువుల కొరత రాకుం డా 3 లక్షల టన్నుల ఎరువులను ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. అందులో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 30వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 20 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ ఉన్నాయి. సాధారణంగా సీజన్ ప్రారంభానికి 3 నెలల ముందు నుంచే ఈ ప్రక్రియ మొదలు కావాలి. ఇప్పటివరకు 2.10 లక్షల ఎరువులను సిద్ధం చేశారు. బఫర్స్టాక్కు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని సర్కారు మార్క్‌ఫెడ్‌కు సూచించింది. అందుకోసం దాదాపు రూ. 500 కోట్లు అవసరమవుతాయని అంచనా. కంపెనీల నుంచి ఎరువులు కొనడం, గోదాములను అద్దెకు తీసుకోవడం, ఎరువులను జిల్లాలకు సరఫరా చేయడం వంటివాటికి ఖర్చు అవుతుంది. అయితే, మార్క్‌ఫెడ్ విభజన జరగనందున రుణం ఇవ్వడానికి సిద్ధంగాలేమని బ్యాంకర్లు చెప్పినట్లు తెలిసింది. ఎరువుల బఫర్‌స్టాక్ నిర్వహించడం మార్కఫెడ్కు తలకుమించిన భారం కానుంది. 3 లక్షల టన్నుల ఎరువుల ముందస్తు నిల్వలో మార్కఫెడ్కు 72 వేల టన్నులు నిల్వ చేసే సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 2.28 లక్షల టన్నుల ఎరువులను నిల్వ కోసం మార్కెట్ కమిటీలు, స్టేట్ వేర్ హౌసింగ్ వంటివాటి గోదాములను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తలకు మించిన భారం కానుంది.