ఎరువుల నిల్వకు నిధుల కొరత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ సీజన్‌కు ఎరువులను ముందస్తు నిల్వ(బఫర్ స్టాక్) చేయడానికి రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్)ను నిధుల కొరత వేధిస్తోంది. దీంతో తమవద్ద ఉన్న ఆర్థిక వనరులను పోగుచేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు మార్క్‌ఫెడ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ నిధులు కూడా సరిపోయేలా కన్పించకపోవడంతో మార్‌కఫెడ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వచ్చే ఖరీఫ్‌లో రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పవని తెలుస్తోంది.
3 లక్షల టన్నుల ఎరువుల నిల్వ...
ఖరీఫ్ సీజన్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎరువుల కొరత రాకుం డా 3 లక్షల టన్నుల ఎరువులను ముందస్తుగా నిల్వ చేసుకోవాలని ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది. అందులో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 30వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు, 20 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ ఉన్నాయి. సాధారణంగా సీజన్ ప్రారంభానికి 3 నెలల ముందు నుంచే ఈ ప్రక్రియ మొదలు కావాలి. ఇప్పటివరకు 2.10 లక్షల ఎరువులను సిద్ధం చేశారు. బఫర్‌స్టాక్‌కు అవసరమైన నిధులను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని సర్కారు మార్క్‌ఫెడ్‌కు సూచించింది.
అందుకోసం దాదాపు రూ. 500 కోట్లు అవసరమవుతాయని అంచనా. కంపెనీల నుంచి ఎరువులు కొనడం, గోదాములను అద్దెకు తీసుకోవడం, ఎరువులను జిల్లాలకు సరఫరా చేయడం వంటివాటికి ఖర్చు అవుతుంది. అయితే, మార్క్‌ఫెడ్ విభజన జరగనందున రుణం ఇవ్వడానికి సిద్ధంగాలేమని బ్యాంకర్లు చెప్పినట్లు తెలిసింది. ఎరువుల బఫర్‌స్టాక్ నిర్వహించడం మార్‌కఫెడ్‌కు తలకుమించిన భారం కానుంది. 3 లక్షల టన్నుల ఎరువుల ముందస్తు నిల్వలో మార్‌కఫెడ్‌కు 72 వేల టన్నులు నిల్వ చేసే సామర్థ్యం గల గోదాములు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 2.28 లక్షల టన్నుల ఎరువులను నిల్వ కోసం మార్కెట్ కమిటీలు, స్టేట్ వేర్ హౌసింగ్ వంటివాటి గోదాములను అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తలకు మించిన భారం కానుంది.