ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు
ప్రకాశం, పొన్నలూరు: నేటి సర్కారు కార్పొరేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధిని విస్మరించడం పరిపాటిగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకమైంది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు కావస్తున్నా వాటి నిర్వాహణకు సంబంధించిన నిధులను ఇంత వరకు విడుదల చేయలేదు. కనీసం చాక్‌పీసులు, డస్టర్లకు కూడా డబ్బులు లేక ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. దీంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తాత్కాలికంగా తమ సొంత నిధులు వెచ్చించాల్సి వస్తోంది.
ప్రైమరీ స్కూళ్లు మరీ దారుణం
రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల మెయింట్‌నెన్స్ గ్రాంట్స్‌ను విడుదల చేసినప్పటికీ మిగిలిన పాఠశాలలకు నిధులు మంజూరు చేయలేదు. జిల్లాలో 2951 ప్రాథమిక పాఠశాలలు, 560 ప్రాథమికోన్నత, 883 జిల్లా పరిషత్ ఉన్నత, 26 ప్రభుత్వ హైస్కూల్స్ ఉన్నాయి. ఈ మొత్తం పాఠశాలలకు సుమారు 5 కోట్ల 16 లక్షల రూపాయిల నిధులను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది.
పాఠశాలల మూసివేత
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్య ముందుకు సాగడం లేదు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణం చూపిస్తూ రేషనైలేజేషన్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడులను మూసి వేయించింది. ఆ తరువాత గత నాలుగేళ్లుగా పాఠశాలలు ప్రారంభమైన ఐదు నెలలకు కూడా పాఠ్యపుస్తకాలు, విద్యా సంవత్సం చివరికి కూడా యూనిఫాంలు అందించడంలేదు. ప్రతి ఏడాది ప్రభుత్వ బడులపై చంద్రబాబు అవలంబిస్తున్న తీరుపై అన్ని వర్గా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో నిర్వహణకు కావాల్సిన నిధులను కూడా విడుదల చేయకపోవడంతో వాటిని నడపలేక ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. సర్కార్ బడులను నిర్వాహణకు ప్రారంభంలోనే సర్వశిక్షా అభియాన్ ద్వారా నిధులు విడుదల చేయాలి.
కాని ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. ప్రాథమిక పాఠశాలకు రూ, 10 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ. 12 వేలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 17 వేల చొప్పున నిధులు విడుదల చేయాలి. ఈ డబ్బులు కూడా పాఠశాల ప్రాంగణం, తరగతి గదుల సంఖ్యను బట్టి కొంచం అటు ఇటుగా మారిపోతూ అర్హతన బట్టి ప్రభుత్వం కేటాయించిన నిధులు విడుదలవుతుంటాయి. వీటితో చాక్‌పీసులు, డస్టర్లు, చీపుర్లు, ఫినాయిల్, సబ్బులు, పేపర్లతో పాటు బోధనాభ్యసన సామాగ్రి, పాఠశాల ఫర్నిచర్, మరమ్మతులు, విద్యుత్ బిల్లులు, స్టేషనరీ, ప్రథమ చికిత్స కిట్లు వంటి వాటికి వినియోగిస్తారు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల తీర్మానం మేరకు ఖర్చు చేస్తారు. ఈనేపథ్యంలో ప్రతి నెలా విద్యుత్ బిల్లులు, స్టేషనరీతో పాటు చిన్న పనులకు ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులను వినియోగిస్తున్నారు. కనీసం చాక్‌పీసులు కొనేందుకు కూడా పాఠశాలల్లో డబ్బులు లేకుండా పోయాయని, పాఠశాల అవసరతలకు సైతం సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని ఉపాధ్యాయయులు, హెచ్‌ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ తీరు బాగులేదు:
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు బాగులేదు. పాఠశాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యారంగం కుంటుపడింది.సీహెచ్ శ్యామ్, పీడీఎస్‌యూజిల్లా సహాయ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment