
ప్రకాశం, పుల్లలచెరువు: గత ప్రభుత్వం విద్యారంగానికి అక్షరాల్లోనే కాగితాలపై కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లుగా చూపి ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను నీర్వర్యం చేసింది. ఫలితంగా పేద విద్యార్థులు విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలలు ఉత్సవ విగ్రహాలుగా మారాయే తప్ప అభివృద్ధిలో అడుగైనా ముందుకు పడలేదు. గతంలో ప్రభుత్వం విద్యారంగానికి ఎంత ఖర్చు పెట్టినా క్షేత్రస్థాయిలో అవసరమైన వసతులు సమకూర్చలేదు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు ఆవరణలోని చెట్ల కిందనే పాఠాలను వింటున్నారు. కొన్ని పాఠశాలల్లో చాలా ఏళ్లు కిందట నిర్మించిన భవనాల్లోనే తరగతులను నిర్వహిస్తున్నారు. ఆ గదుల గొడలు, పై కప్పు దెబ్బతిన్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా ఉరుస్తున్నాయి. ఇలా తరగతి గదుల సదుపాయం లేక ఉన్నా శిథిలాస్థలో ఉండడం వల్ల వర్షాలు కురిసినప్పుడల్లా పాఠశాలలకు సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. మండలంలోని పుల్లలచెరువు, పిడికిటివానిపల్లి జెడ్పీ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉన్నాయి.
మండలంలోని పిడికిటివాని పల్లి జెడ్పీ పాఠశాలలో సుమారు 650 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో చాలా సంవత్సరాల కిందట భవనాలను నిర్మించారు. ఆ భవనాలు శిథిల స్థితికి చేరడంతో నాలుగు సంవత్సరాల కిందట కొన్ని భవనాలను నూతనంగా నిర్మించారు. విద్యార్థులకు సరపడా భవనాలు లేకపోవడంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు చెట్ల నీడనే పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఒక వైపు కాకుల కేకలు, కుక్కల అరుపుల మధ్య విద్యార్థులు పాఠ్యాంశాలను ఏకాగ్రతతో వినలేక పోతున్నారు. మొత్తం 18 గదులు అవసరం అవగా కేవలం 10 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు ఇంగ్లిష్, తెలుగు మీడియంలు కావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. విద్యార్థులకు తరగతి గదులు సరిపోకపోవడంతో పాఠశాలలో ఉన్న సైన్స్ ల్యాబ్‌ను తరగతి గదిగా ఉపయోగించుకుని విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. ప్రజారంజక పాలన అందించేందుకు ప్రజలు ఎన్నుకున్న జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యారంగంపై వాస్తవాలను తెలుసుకుని విద్యారంగంలో సమూల మార్పులు తీసుకుని వచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేసి కార్పొరేట్ స్థాయి హంగులతో అధునాతన విద్య అందుబాటులోకి వచ్చేందుకు అన్ని రకాల చర్యలను చేపట్టింది. అందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లోనే కేటాయించి అని వర్గాల ప్రశంసలను అందుకుంటున్నారు.
ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం
మండలంలోని పుల్లలచెరువు, పిడికిటివానిపల్లి జెడ్పీ పాఠశాలలో గదుల కొరత ఉన్న మాట వాస్తవమే. అవసరమైన చోట మరమ్మతులను నిర్వహిస్తున్నాం. ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల కొరతపై జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపాం. అనుమతులు మంజూరు కాగానే నూతన భవనాల నిర్మాణాలను చేపడతాం. – తులసి మల్లికార్జుననాయక్, ఎంఈఓ, పుల్లలచెరువు
Comments
Please login to add a commentAdd a comment