సాక్షి, సిటీబ్యూరో: ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కోటి మొక్కలు నాటేందుకు సిద్ధమైన జీహెచ్‌ఎంసీ అధికారులు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు, హరితహారంలో నాణ్యమైన మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నర్సరీల్లో పెంచుతున్న మొక్కల నాణ్యతను పరిశీలించి నిర్ణీత వ్యవధిలోగా నివేదికను అందజేసేందుకు కమిషనర్ ఎం.దానకిశోర్ సర్కిల్, జోనల్ స్థాయిల్లో రెండు కమిటీలను వేశారు. సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్, యూబీడీ విభాగం మేనేజర్, రవాణ విభాగం ఏఈలు, జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్, యూబీడీ విభాగం డిప్యూటీ డైరెక్టర్, సిటీప్లానర్లు సభ్యులుగా ఉన్నారు. సర్కిల్ స్థాయి కమిటీ తమ పరిధిలోని అన్ని నర్సరీల్లో వారం రోజుల్లో తనిఖీలు చేసి నివేదికను అందజేయాలి. జోనల్ స్థాయి కమిటీ వారంలో రెండు పెద్ద నర్సరీలను పరిశీలించి అక్కడ పెంచుతున్న మొక్కల సంఖ్య, నాణ్యత తదితరమైన వాటి గురించి నివేదిక అందజేయాలి. ఇవికాక ప్రభుత్వ నర్సరీల్లో రెండు పెద్ద నర్సరీలతో పాటు జోన్‌లోని అన్ని ప్రైవేట్ నర్సరీలను తనిఖీ చేయాలి. యూబీడీ విభాగం అడిషనల్ కమిషనర్, యూబీడీ పనుల పర్యవేక్షణ అడిషనల్ కమిషనర్ రెండు నర్సరీలను సందర్శించాలి. అందరి నివేదికలు ఈనెల 21లోగా అందజేయాలి. ఈ కమిటీలన్నీ మే చివరి వారంలో, జూన్ రెండో వారంలో కూడా నర్సరీలను పరిశీలించి నిర్ణీత ఫ్రొఫార్మాలో నివేదికలు అందజేయాల్సి ఉంటుంది.
మొక్కలు నాటే ప్రదేశాలివే..
ఝసర్కిల్ కమిటీలు మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించడంతో పాటు డిప్యూటీ కమిషనర్లు రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీఓలు, విద్యా సంస్థలతోనూ సమావేశాలు నిర్వహించి వారి సమన్వయంతో తగిన ప్లాన్‌ను రూపొందించుకోవాలి. సాఫ్ హైదరాబాద్, షాన్‌దార్ హైదరాబాద్ గురించి కూడా సమావేశాల్లో ప్రచారం నిర్వహించాలి.
మొక్కలు నాటేందుకు ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు, నాలా వెంబడి ప్రాంతాలు తదితర వాటిని గుర్తించాలి. ఎక్కడ ఎన్ని మొక్కలు నాటవచ్చో అంచనా వేయాలి. వీటితో పాటు జీహెచ్‌ఎంసీకి చెందిన ఓపెన్ స్పేస్, చెరువులు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు తదితర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటే ఏర్పాట్లు చేయాలని కమిషనర్ దానకిశోర్ సంబంధిత అధికారులకు సర్క్యులర్‌జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment