Harithaharam programme
-
కోటి మొక్కలు నాటేందుకు పక్కా ఏర్పాట్లు
సాక్షి, సిటీబ్యూరో: ఈ సంవత్సరం హరితహారం కార్యక్రమంలో భాగంగా కోటి మొక్కలు నాటేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ అధికారులు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు, హరితహారంలో నాణ్యమైన మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నర్సరీల్లో పెంచుతున్న మొక్కల నాణ్యతను పరిశీలించి నిర్ణీత వ్యవధిలోగా నివేదికను అందజేసేందుకు కమిషనర్ ఎం.దానకిశోర్ సర్కిల్, జోనల్ స్థాయిల్లో రెండు కమిటీలను వేశారు. సర్కిల్ స్థాయిలో డిప్యూటీ కమిషనర్, యూబీడీ విభాగం మేనేజర్, రవాణ విభాగం ఏఈలు, జోనల్ స్థాయిలో జోనల్ కమిషనర్, యూబీడీ విభాగం డిప్యూటీ డైరెక్టర్, సిటీప్లానర్లు సభ్యులుగా ఉన్నారు. సర్కిల్ స్థాయి కమిటీ తమ పరిధిలోని అన్ని నర్సరీల్లో వారం రోజుల్లో తనిఖీలు చేసి నివేదికను అందజేయాలి. జోనల్ స్థాయి కమిటీ వారంలో రెండు పెద్ద నర్సరీలను పరిశీలించి అక్కడ పెంచుతున్న మొక్కల సంఖ్య, నాణ్యత తదితరమైన వాటి గురించి నివేదిక అందజేయాలి. ఇవికాక ప్రభుత్వ నర్సరీల్లో రెండు పెద్ద నర్సరీలతో పాటు జోన్‌లోని అన్ని ప్రైవేట్ నర్సరీలను తనిఖీ చేయాలి. యూబీడీ విభాగం అడిషనల్ కమిషనర్, యూబీడీ పనుల పర్యవేక్షణ అడిషనల్ కమిషనర్ రెండు నర్సరీలను సందర్శించాలి. అందరి నివేదికలు ఈనెల 21లోగా అందజేయాలి. ఈ కమిటీలన్నీ మే చివరి వారంలో, జూన్ రెండో వారంలో కూడా నర్సరీలను పరిశీలించి నిర్ణీత ఫ్రొఫార్మాలో నివేదికలు అందజేయాల్సి ఉంటుంది. మొక్కలు నాటే ప్రదేశాలివే.. ఝసర్కిల్ కమిటీలు మొక్కలు నాటే ప్రాంతాలను గుర్తించడంతో పాటు డిప్యూటీ కమిషనర్లు రెసిడెన్సియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, ఎన్జీఓలు, విద్యా సంస్థలతోనూ సమావేశాలు నిర్వహించి వారి సమన్వయంతో తగిన ప్లాన్‌ను రూపొందించుకోవాలి. సాఫ్ హైదరాబాద్, షాన్‌దార్ హైదరాబాద్ గురించి కూడా సమావేశాల్లో ప్రచారం నిర్వహించాలి. మొక్కలు నాటేందుకు ప్రధాన రహదారులు, కాలనీ రోడ్లు, నాలా వెంబడి ప్రాంతాలు తదితర వాటిని గుర్తించాలి. ఎక్కడ ఎన్ని మొక్కలు నాటవచ్చో అంచనా వేయాలి. వీటితో పాటు జీహెచ్ఎంసీకి చెందిన ఓపెన్ స్పేస్, చెరువులు, డబుల్బెడ్రూమ్ ఇళ్లు తదితర ప్రాంతాల్లోనూ మొక్కలు నాటే ఏర్పాట్లు చేయాలని కమిషనర్ దానకిశోర్ సంబంధిత అధికారులకు సర్క్యులర్జారీ చేశారు. -
తెలంగాణలో నాలుగో విడత హరితహారం ప్రారంభం
-
వంట గ్యాస్... మూడు మొక్కలు
గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలు...మీ ఇంటికి నిండు సిలిండర్‌తో పాటు ఇకపై మూడు మొక్కలు ఉచితంగా అందనున్నాయి.హరితహారంలో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలని సిటీ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిర్ణయించింది. సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాల్లో వంట గ్యాస్ సిలిండర్లు బుక్ చేసిన వినియోగదారులకు ఉచితంగా మొక్కలు అందచేయాలని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. ఈ మేరకు గ్యాస్ గోదాముల ఆవరణలో మొక్కలు నాటడంతో పాటు గృహ అవసరాలకు ఉపయోగించే తులసి, కరివేపాకు, ఇతర పండ్ల, పూల మొక్కలు గ్యాస్ వినియోగదారులకు కూడా పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇంటి ఆవరణలో మొక్కలు నాటేందుకు స్థలం లేని వారు సైతం కుండీల్లో పెట్టుకొని మొక్కలు పరిరక్షించేందుకు వీలుగా చిన్నిచిన్న మొక్కలనే అందించాలని నిర్ణయించారు. ప్రతి గృహోపయోగ గ్యాస్ వినియోగదారు ల కుటుంబం కనీసం ఒక మొక్క అయినా పరిరక్షించే విధంగా చైతన్యం కలిగించాలని నిర్ణయించారు. ఇకపై వంట గ్యాస్ బుకింగ్ చేసిన వారికి సిలిండర్ డెలివరీ చేసే బాయ్లే మొక్కలు కూడా వారికి అందచేస్తారు. గ్రేటర్లో 26.21 లక్షలు కుటుంబాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వంట గ్యాస్ వినియోగ కుటుంబాలు సుమారు 26.21 లక్షలకు పైబడి ఉన్నారు. వీరికి మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 135 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతోంది. ప్రతి రోజు డిమాండ్ 1.20 లక్షలు సిలిండర్ల వరకు డిమాండ్ ఉండగా కనీసం 80 వేలకు తగ్గకుండా డోర్ డెలివరీ జరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ కోసం గ్యాస్ వినియోగదారులకు హరితహారంలో భాగంగా ఇంటింటికి సిలిండర్‌తోపాటు మొక్కలు అందించేందుకు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారు. ఇటీవల గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం బాధ్యులు సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్‌ను కలిసి హరిత హారంలో భాగస్వాములయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. నర్సరీల ద్వారా గ్యాస్ గోదాముల వారిగా మొక్కలు సరాఫరా చేసేందుకు అధికార వర్గాలు అంగీకరించాయి. 34 నర్సరీల్లో మొక్కల పెంపకం నగరంలోని 34 నర్సరీల్లో 40 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా వేప, జువ్వి, కానుగ, జమ్మితో పాటు పండ్ల మొక్కలైన సపోట, మామిడి, అల్లనేరేడు, బాదం తదితర పలు రకాల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఇళ్లలో పెంచుకునేందుకు ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. గృహోపయోగ గ్యాస్ వినియోగదారుల కోసం మాత్రం ఔషధ, పూల మొక్కలను సరఫరా చేయాలని డిస్ట్రిబ్యూటర్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్యాస్ గోదాములకు మొక్కలు సరఫరా కాగానే సిలిండర్లతోపాటు వాటిని పంపిణీ చేసే విధంగా డిస్ట్రిబ్యూటర్లు సంసిద్ధులవుతున్నారు. మొక్కలను పరిరక్షించండి మానవుడి మనుగడకు పర్యావరణ పరిరక్షణ అవసరం. అందుకు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి. ప్రభుత్వం చేపట్టిన హరితహారం మంచి కార్యక్రమం. దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఇంటింటికీ సిలిండర్‌తో పాటు ఉచితంగా పంపిణీ చేసే మొక్కలు వృథాగా పారేయకుండా పరిరక్షించాలి. ఇంట్లో మొక్కలు నాటేందుకు స్థలం లేనివారు కూడా కుండీల్లో మొక్కలను పెంచుకోవచ్చు. అప్పుడే ఇంటి ముందు పచ్చతోరణం కళకళాడుతుంది. ఇది కుటుంబం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. – అశోక్‌కుమార్, ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల సంఘం, గ్రేటర్ హైదరాబాద్. -
గజ్వేల్‌కు హరితహారం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలో లక్షా నూట పదహారు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీటికి అదనంగా అదేరోజు అటవీ భూముల్లో మరో 20 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో లక్షా నూట పదహారు మొక్కలు నాటాలని చెప్పారు. అన్ని రకాల రోడ్ల వెంట, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థల ఆవరణలో, గుడి, మసీదు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాల్లో, ప్రతీ ఇంట్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. హరితహారం విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన మొక్కలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గజ్వేల్‌లో చేపట్టనున్న కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు జోగు రామన్న, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పీసీసీఎఫ్ పి.కె.ఝా, ఏపీసీసీఎఫ్ డోబ్రియాల్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, గజ్వేల్ పట్టణాభివృద్ధి సంస్థ(గడా) ప్రత్యేక అధికారి హన్మంతరావు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, భూమారెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఇందులో పాల్గొన్నారు. ‘‘గజ్వేల్‌లో ఒకేరోజు లక్షా నూట పదహారు మొక్కలను నాటాలి. ఇంట్లో ఎందరు సభ్యులుంటే అంతమంది తలా ఒక మొక్క చొప్పున నాటాలి. ఇండ్లలో నాటడానికి కావాల్సిన మొక్కలను ఒకరోజు ముందే ఆ ఇంటికి చేర్చాలి. ప్రజలకు ఇచ్చే చెట్లలో కచ్చితంగా పండ్ల చెట్లు, పూల చెట్లు ఉండాలి. ఆగస్టు 1వ తేదీన అనుకున్న సమయానికి గజ్వేల్‌లోని అన్ని మసీదుల్లో ఒకేసారి సైరన్ మోగాలి. సైరన్ మోగిన వెంటనే ముఖ్యమంత్రితో సహా, అంతా ఒకేసారి ఎక్కడికక్కడ మొక్కలు నాటాలి. మైకులు, గోడపై రాతలు, హోర్డింగులతో ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. నాటిన మొక్కలను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. రోడ్లపై పెట్టే మొక్కలకు ట్రీ గార్డులు పెట్టాలి. పట్టణంలో తుమ్మ, జిల్లేడులాంటి పిచ్చిమొక్కలను తీసేసి, మంచి మొక్కలను మాత్రమే పెంచాలి. మొక్కలు పెంచడంలో బాగా శ్రద్ధ చూపిన వారికి అవార్డులు అందించాలి’’అని సీఎం చెప్పారు. 25 శాతం పండ్ల మొక్కలు వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల చొప్పున మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆదాయాభివృద్ధిలో దేశంలో నంబర్ వన్‌గా ఉన్నాం. కాళేశ్వరం సహా నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. 2019 జూన్ నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి. చెరువులన్నింటినీ కాల్వల ద్వారా నింపుతాం. రూ.1.25 లక్షల కోట్ల పంటలు పండుతున్నాయి. వ్యవసాయం బాగుపడుతుంది. రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పిల్లలకు మంచి విద్య అందుతోంది. రాష్ట్రం అన్నివిధాలా బాగుపడుతు న్నది. ఇంత చేసినా జీవించగలిగే పరిస్థితులు లేకుంటే దండుగ. మనిషి జీవించ గలిగే పరిస్థితి కావాలి. భగవంతుడో, ప్రకృతో మనకు కావాల్సినవన్నీ సమకూర్చింది. మనమే వాటిని చేజేతులా నాశనం చేసుకున్నాం. నాశనమైన వాటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మనిషి, చెట్టు నిష్పత్తిలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. కెనడాలో ప్రతీ మనిషికి సగటున 8,953 చెట్లు, రష్యాలో 4,465, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లుంటే, భారతదేశంలో ఒక్కో మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇది వాతావరణ సమతుల్యం దెబ్బతినడానికి, ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోంది. అందుకే మనం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్నాం. అధికార యంత్రాంగమంతా పచ్చదనం పెంచాలనే తపనతో పనిచేయాలి. ప్రతీ గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నర్సరీల్లో ఇతర మొక్కలతోపాటు కనీసం 25 శాతం పండ్ల మొక్కలను సిద్ధం చేయాలి. చెట్ల పండ్లు దొరికితే కోతులు జనావాసాలపై పడే పరిస్థితి ఉండదు. గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ వద్ద అడవి పునరుద్ధరణలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’అని ముఖ్యమంత్రి వివరించారు. -
హరితహారంలో మొక్కలు నాటి రక్షించాలి
గంగాధర: హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై నాటిన మొక్కలను సంరక్షించాలని ఎమ్మెల్యే బొడిగె శోభ అన్నారు. నాల్గో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీపీ దూలం బాలగౌడ్, సర్పంచు వైధ రామానుజం, తహశీల్దార్ సరిత, ఎపీఎం జ్యోతి, పుల్కం గంగన్న, ఎండీ నజీర్,శ్రీనివాస్‌రెడ్డి, అట్ల శేఖర్‌రెడ్డి, ఆకుల మధుసూదన్ పాల్గొన్నారు. మండలంలోని ఆచంపల్లి గ్రామంలో జెడ్పీటీసీ సభ్యురాలు ఆకుల శ్రీలత పాల్గొన్నారు. చొప్పదండిలో... చొప్పదండి: మండలంలో నాల్గో విడుత హరితహారంశనివారం ప్రారంభమైంది. మండలంలోని కాట్నపల్లిలో ఎమ్మెల్యే బొడిగె శోభ హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రిన్సిపాల్ మంగతాయారు మొక్కలు నాటారు. జూనియర్ కళాశాల ఆవరణలో ఏపీడీ మంజులాదేవి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. గుమ్లాపూర్‌లో సర్పంచ్ ముష్కె వెంకట్ రెడ్డి పండ్ల మొక్కల పంపిణీ చేశారు. ఎంపీపీ గుర్రం భూమారెడ్డి, ప్రత్యేకాధికారి మనోజ్‌కుమార్ పాల్గొన్నారు. భాగస్వాములు కావాలి.. రామడుగు: ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఆర్డీవో వేంకటేశ్వర్రావు కోరారు. మండలంలోని రుద్రారం గ్రామంలో శనివారం హరితహారం కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీడీ మంజులవాణి, ఏపీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు. పందికుంటలో... మండలంలోని షానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని పందికుంట గ్రామ వరాల కుంటలో శనివారం ఎమ్మెల్యే బోడిగె శోభ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు వీర్ల కవిత, గోపాల్రావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పూడురి మణేమ్మ, ఎంపీడీవో దేవకిదేవి, ఎస్సై వి.రవి, ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచ్ గునుకొండ అశోక్‌కుమార్, ఎంపీటీసీ కట్కం రవీందర్, టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు జూపాక కరుణాకర్ పాల్గొన్నారు. మల్యాలలో... మల్యాల: మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శోభ పాల్గొని మొక్కలను నాటారు. ఎంపీపీ తైదల్ల శ్రీలత, జడ్పీటీసీ వీరబత్తిని శోభారాణి, ఎంపీడీవో మహోత్ర, తహశీల్దార్ శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ కన్వీనర్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ కొల్లూరి గంగాధర్, నాయకులు బోట్ల ప్రసాద్, మధుసూదర్‌రావు, తిరుపతిరెడ్డి, నాగభూషణం, శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. కొడిమ్యాలలో... కొడిమ్యాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొని మొక్కలునాటారు. ఎంపీడీవో ఎన్.శ్రీనివాస్, తహసీల్దార్ రవీందర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ లత, సర్పంచ్ పిడుగు ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ నాంపెల్లి రాజేశం, ఎంపీటీసీ సురుగు శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ సంజీవయ్య పాల్గొన్నారు. మండలంలోని తిర్మలాపూర్ ఉన్నతపాఠశాలలో ఎంపీడీవో ఎన్.శ్రీనివాస్ మొక్క నాటారు. సర్పంచ్ లత, ఎంపీటీసీ మల్లేశం ఉన్నారు. -
'తెలంగాణలో ఇక విద్యుత్ కోతలు ఉండవు'
కరీంనగర్: తెలంగాణలో ఇక కరెంట్ కోతలు ఉండవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఎవరి ఊరును వారే బాగుచేసుకోవాలని, పక్క ఊరు వారు వచ్చి బాగు చేయరని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ అన్నారు. మన బతుకుల కోసం మనమే కొట్లాడాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొక్కలను బతికించుకోవాలని, అందరి బాధ్యతా ఉందని కేసీఆర్ చెప్పారు. గ్రామపంచాయతీ ఉద్యోగుల పనితీరు సరిగాలేదని, గ్రామాల రికార్డులకే పరిమితమయ్యారని, పనితీరు మెరుగుపడాలని కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో మొక్కలు నాటి పరిరక్షించాంలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 15 రోజుల్లో కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తానని అన్నారు. కేసీఆర్ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.