మీడియాతో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలో లక్షా నూట పదహారు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీటికి అదనంగా అదేరోజు అటవీ భూముల్లో మరో 20 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో లక్షా నూట పదహారు మొక్కలు నాటాలని చెప్పారు.
అన్ని రకాల రోడ్ల వెంట, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థల ఆవరణలో, గుడి, మసీదు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాల్లో, ప్రతీ ఇంట్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. హరితహారం విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన మొక్కలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గజ్వేల్‌లో చేపట్టనున్న కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.
మంత్రులు జోగు రామన్న, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పీసీసీఎఫ్ పి.కె.ఝా, ఏపీసీసీఎఫ్ డోబ్రియాల్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, గజ్వేల్ పట్టణాభివృద్ధి సంస్థ(గడా) ప్రత్యేక అధికారి హన్మంతరావు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, భూమారెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఇందులో పాల్గొన్నారు. ‘‘గజ్వేల్‌లో ఒకేరోజు లక్షా నూట పదహారు మొక్కలను నాటాలి. ఇంట్లో ఎందరు సభ్యులుంటే అంతమంది తలా ఒక మొక్క చొప్పున నాటాలి. ఇండ్లలో నాటడానికి కావాల్సిన మొక్కలను ఒకరోజు ముందే ఆ ఇంటికి చేర్చాలి.
ప్రజలకు ఇచ్చే చెట్లలో కచ్చితంగా పండ్ల చెట్లు, పూల చెట్లు ఉండాలి. ఆగస్టు 1వ తేదీన అనుకున్న సమయానికి గజ్వేల్‌లోని అన్ని మసీదుల్లో ఒకేసారి సైరన్ మోగాలి. సైరన్ మోగిన వెంటనే ముఖ్యమంత్రితో సహా, అంతా ఒకేసారి ఎక్కడికక్కడ మొక్కలు నాటాలి. మైకులు, గోడపై రాతలు, హోర్డింగులతో ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. నాటిన మొక్కలను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. రోడ్లపై పెట్టే మొక్కలకు ట్రీ గార్డులు పెట్టాలి. పట్టణంలో తుమ్మ, జిల్లేడులాంటి పిచ్చిమొక్కలను తీసేసి, మంచి మొక్కలను మాత్రమే పెంచాలి. మొక్కలు పెంచడంలో బాగా శ్రద్ధ చూపిన వారికి అవార్డులు అందించాలి’’అని సీఎం చెప్పారు.
25 శాతం పండ్ల మొక్కలు
వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల చొప్పున మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆదాయాభివృద్ధిలో దేశంలో నంబర్ వన్‌గా ఉన్నాం. కాళేశ్వరం సహా నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. 2019 జూన్ నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి. చెరువులన్నింటినీ కాల్వల ద్వారా నింపుతాం. రూ.1.25 లక్షల కోట్ల పంటలు పండుతున్నాయి. వ్యవసాయం బాగుపడుతుంది. రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పిల్లలకు మంచి విద్య అందుతోంది. రాష్ట్రం అన్నివిధాలా బాగుపడుతు న్నది.
ఇంత చేసినా జీవించగలిగే పరిస్థితులు లేకుంటే దండుగ. మనిషి జీవించ గలిగే పరిస్థితి కావాలి. భగవంతుడో, ప్రకృతో మనకు కావాల్సినవన్నీ సమకూర్చింది. మనమే వాటిని చేజేతులా నాశనం చేసుకున్నాం. నాశనమైన వాటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మనిషి, చెట్టు నిష్పత్తిలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. కెనడాలో ప్రతీ మనిషికి సగటున 8,953 చెట్లు, రష్యాలో 4,465, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లుంటే, భారతదేశంలో ఒక్కో మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి.
ఇది వాతావరణ సమతుల్యం దెబ్బతినడానికి, ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోంది. అందుకే మనం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్నాం. అధికార యంత్రాంగమంతా పచ్చదనం పెంచాలనే తపనతో పనిచేయాలి. ప్రతీ గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నర్సరీల్లో ఇతర మొక్కలతోపాటు కనీసం 25 శాతం పండ్ల మొక్కలను సిద్ధం చేయాలి. చెట్ల పండ్లు దొరికితే కోతులు జనావాసాలపై పడే పరిస్థితి ఉండదు. గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ వద్ద అడవి పునరుద్ధరణలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’అని ముఖ్యమంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment