తెలంగాణలో ఇక కరెంట్ కోతలు ఉండవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు.
కరీంనగర్: తెలంగాణలో ఇక కరెంట్ కోతలు ఉండవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. ఎవరి ఊరును వారే బాగుచేసుకోవాలని, పక్క ఊరు వారు వచ్చి బాగు చేయరని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేసీఆర్ అన్నారు. మన బతుకుల కోసం మనమే కొట్లాడాలని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొక్కలను బతికించుకోవాలని, అందరి బాధ్యతా ఉందని కేసీఆర్ చెప్పారు. గ్రామపంచాయతీ ఉద్యోగుల పనితీరు సరిగాలేదని, గ్రామాల రికార్డులకే పరిమితమయ్యారని, పనితీరు మెరుగుపడాలని కేసీఆర్ ఆదేశించారు. గ్రామాల్లో మొక్కలు నాటి పరిరక్షించాంలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 15 రోజుల్లో కరీంనగర్ జిల్లా పర్యటనకు వస్తానని అన్నారు. కేసీఆర్ ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.