విద్యుత్ కోతల్లేని తెలంగాణే లక్ష్యం
సాక్షి, మంచిర్యాల: విద్యుత్ కోతలు లేని తెలంగాణే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అనివార్యమన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం పెగడపల్లిలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు విస్తరణలో భాగంగా మరో 600 మెగావాట్ల యూనిట్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పైలాన్‌ను ప్రారంభించి.. ప్రాజెక్టు పురోగతిని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, సింగరేణి ఉన్నతాధికారులు, పనులు చేపట్టిన బీహెచ్‌ఈఎల్, మెక్‌నెల్లి భారత్ కంపెనీలతో సుమారు రెండు గంటలపాటు సీఎం సమీక్ష జరిపారు. నిర్మాణ దశలో ఉన్న 1200 మెగావాట్ల ప్లాంటు పనులను ఈ ఏడాది నవంబర్‌లోగా పూర్తిచేయాలని, తాజాగా నెలకొల్పనున్న 600 మెగావాట్ల యూనిట్ పనులను 30 నెలల్లో పూర్తిచేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం మెక్‌నెల్లి భారత్ కంపెనీ చేపడుతున్న బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్(బీవోపీ) పనులను బీహెచ్‌ఈఎల్‌కు సీఎం అప్పగించారు. ఇదివరకే బాయిలర్ టర్బో జెనరేటెడ్ వర్క్స్ పనులు నిర్వహిస్తున్న బీహెచ్‌ఈఎల్.. పనులను వేగవంతంగా చేపడుతున్నందునే బీవోపీ పనులను కూడా అప్పగించారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు దీన్ని గురుతర బాధ్యతగా భావించాలని సీఎం సూచించారు. షట్‌పల్లి గోదావరి నుంచి ఈ పవర్ ప్లాంటుకు టీఎంసీ నీరు ఇవ్వాల్సి ఉందని, భూసేకరణ జరగకపోవడంతో పైప్‌లైన్ వేయలేదని అధికారులు చెప్పారు. దీంతో రెండ్రోజుల్లోగా భూసేకరణ పూర్తి చేసి సింగరేణికి స్థలం ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కలెక్టర్ జగన్మోహన్, ఆర్డీవోను సీఎం ఆదేశించారు. అలాగే. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ నుంచి జైపూర్ ప్లాంటుకు రైల్వే లైను ఏర్పాటుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. సింగరేణికి భూమి అప్పగించాలని కూడా ఆదేశించారు. ప్లాంటు నిర్మాణ పనులకు పర్యావరణ అనుమతులు కూడా త్వరగా పొందేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డికి సూచించారు. ఇక జైపూర్ పవర్ ప్లాంటు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని సీఎం కోరారు. దీనికి స్పందించిన సింగరేణి సీఎండీ శ్రీధర్.. ఉద్యోగాలిచ్చేందుకు అంగీకరించారు.
కదిలిన యంత్రాంగం..
జైపూర్ పవర్ ప్లాంటు నిర్మాణ విషయంలో తలెత్తుతున్న సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కరించాలని సీఎం కేసీఆర్ చెప్పడంతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. సీఎం పర్యటన ముగించుకుని వెళ్లగానే మం్ర తులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభు త్వ విప్ నల్లాల ఓదెలు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, కలెక్టర్ జగన్మోహన్ హుటాహుటీన మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని, ప్లాంటు భూ నిర్వాసితులను పిలిపించి తగిన నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.