ఎవరు ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు
టీ టీడీపీ నేతలతో చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీలో విద్యుత్ కోసం తాను ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నానని, అందుకే అక్కడ కరెంటు సమస్యరాలేదని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణకు విద్యుత్ కావాలని తాను కేంద్రాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. కేంద్రాన్ని కేసీఆర్ కనీసం సంప్రదించలేదని ఆయన ఆరోపించారు.
ఆదివారం ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఐదో తేదీ నుంచి ఆరంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ సభ్యత్వ నమోదుపై ఆయన చర్చించారు. కేసీఆర్ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశాన్ని నిందిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. విజయవాడలో సభ పెడతానన్న కేసీఆర్ వ్యాఖ్యలను మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుందని, ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయినా, ఏపీ ప్రజల కోసం కేసీఆర్ ఏనాడూ ఎలాంటి పోరాటాలు చేయలేదని, ఇప్పుడాయనకు వారిపై ప్రేమ ఎందుకు పుట్టుకొస్తున్నదో తెలియదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు తీగల, తలసాని, ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిన నేపథ్యంలో వారిపై అనర్హత వేటు గురించి కూడా చర్చించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్‌ను కలవాలని నిర్ణయించారు.