దేవుడికే ఎరుక!
రాష్ట్రంలో విద్యుత్ కొరత భయంకరంగా ఉంది: కేసీఆర్
ఈ పరిస్థితిని త్వరలోనే అధిగమిస్తాం
మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధిస్తాం
2017 నుంచి పగలంతా ఒకే దఫాలో వ్యవసాయనికి ఉచిత విద్యుత్
2018 నుంచి పుట్టే బిడ్డలకు కరెంటు కొరత అంటే ఏమిటో తెలవనీయం
ఐఏఎస్, ఐపీఎస్‌ల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం.. మరింత మందిని ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం
రెండు నెలల్లో పరిస్థితి చక్కబడుతుంది
కరీంనగర్ జిల్లా రాయికల్ సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో విద్యుత్ కొరత భయంకరంగా ఉందని.. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అంతా అగమ్యగోచరమని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. త్వరలోనే ఈ పరిస్థితిని చక్కదిద్దుతామని, అందుకోసం జెన్‌కో ఆధ్వర్యంలో రూ. 36 వేల కోట్లతో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మూడేళ్లలో మిగులు విద్యుత్‌ను సాధిస్తామని.. 2018 నుంచి పుట్టే బిడ్డలకు కరెంటు కొరత అంటే ఏమిటో కూడా తెలియకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. సోమవారం మహారాష్ర్ట గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జోయల్ ఓరమ్, త్రిదండి చినజీయర్‌స్వామితో కలసి సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా రాయికల్‌లో పర్యటించారు. అక్కడ కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి.. గిరిజన ఆడిటోరియం, కల్యాణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యాసాగర్‌రావు తాను స్థాపించిన విద్యా పరిశోధన, శిక్షణా సంస్థను చినజీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్టుకు అప్పగిస్తూ, సంబంధిత పత్రాలను సీఎం చేతుల మీదుగా చినజీయర్‌స్వామికి అందజేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ కార్యక్రమాలను వివరించారు. ‘‘రాష్ట్రంలో విద్యుత్ కొరత భయంకరంగా ఉంది. ఎప్పుడు కరెంటు వస్తుందో, ఎప్పుడు పోతుందో భగవంతుడికే తెలుసు. అంతా అగమ్యగోచరమైన పరిస్థితి నెలకొంది..’’ అని పేర్కొన్నారు. విద్యుత్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ‘‘తెలంగాణ విద్యుత్ సంస్థ (జెన్‌కో) ఆధ్వర్యంలో 36 వేల కోట్లతో ఆరు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టినం. పనులన్నీ త్వరలో ప్రారంభం కాబోతున్నయి. 2017 నాటికి తెలంగాణ రైతాంగానికి వరుసగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు కరెంటు సరఫరా చేస్తాం. 2017 తరువాత తెలంగాణలో పుట్టే బిడ్డలకు కరెంటు కొరత అంటే ఏమిటో తెలవకుండా చేస్తా. 2018 నాటికి 23 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉంటుంది. అవసరమైతే మనమే రెండు మూడు వేల మెగావాట్ల కరెంటును ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయగలిగే స్థితిలో ఉంటం’’ అని కేసీఆర్ చెప్పారు.
చేసి చూపిస్తా: రాష్ట్రంలో రూ.40 వేల కోట్ల వ్యయంతో డ్రింకింగ్ వాటర్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని... 2019 ఎన్నికల లోపు ఆదివాసీ, గిరిజన తండాలు సహా ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన నీటిని సరఫరా చేస్తామని సీఎం పునరుద్ఘాటించారు. ‘‘ఒకవేళ అట్లా చేయకపోతే టీఆర్‌ఎస్ ఓట్లు అడగదు. సాధారణంగా నాయకులు శపథాలు చేయరు. కానీ నాలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. గతంలోనూ ఢిల్లీ వెళ్లేటప్పుడు తెలంగాణ రాష్ట్రంతోనే మళ్లీ హైదరాబాద్‌లో అడుగుపెడతానని చెప్పిన. దేవుడి దయవల్ల సాధించుకుని వచ్చిన..’’ అని పేర్కొన్నారు. వాటర్‌గ్రిడ్‌కు ఎలాంటి ఆటంకాల్లేకుండా సవరణలు తెచ్చినప్పటికీ.. 26 ప్రాజెక్టుల ద్వారా నీరిచ్చేందుకు అవసరమైన మెయిన్, సబ్‌ట్రంక్స్, డిస్ట్రిబ్యూటరీ లైన్లు వంటివి రోడ్లు, పట్టాల ద్వారా రావాలంటే ఇబ్బందులు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తే తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం అవుతుందన్నారు.
ఐఏఎస్‌ల కేటాయింపులో అన్యాయం
త్వరలోనే జగిత్యాలను జిల్లా కేంద్రంగా మారుస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘జగిత్యాలను జిల్లా కేంద్రంగా మారుస్తానని గతంలోనే చెప్పిన. నేను మాట ఇస్తే తలతెగిపడ్డా సరే తప్పను. కొద్దిరోజుల్లోనే జిల్లాగా ప్రకటిస్తా. ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని ప్రధాని, కేంద్ర హోం మంత్రి దృష్టికి తీసుకుపోయిన. రాష్ట్రానికి అదనంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను కేటాయిస్తామని చెప్పిండ్రు. మూడు నెలల్లోనే ఇది జరిగే అవకాశముంది. ఆ మరుక్షణమే జగిత్యాలను జిల్లాగా మారుస్తా.’’ అని సీఎం చెప్పారు.
కేసీఆర్ తెలంగాణ పిత: రాయికల్‌లో తాను స్థాపించిన ట్రస్టుకు పదేళ్లుగా ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు చెప్పారు. దానిపై ప్రతి ఏటా విఫలమవుతూనే ఉన్నానని... కేసీఆర్ వల్ల నేడు అనుకున్నది సాధ్యమైందన్నారు. కాగా.. కేసీఆర్‌ను ‘తెలంగాణ పిత’గా చినజీయర్ స్వామి అభివర్ణించారు. ఎందరివో ఆకాంక్షలను నెరవేర్చిన కేసీఆర్‌కు మంచి ఆరోగ్యం, శక్తి ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
కరీంనగర్‌కు ఐటీడీఏ: కరీంనగర్‌కు ఐటీడీఏ ని మంజూరు చేస్తున్నట్లు కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోయల్ ఓరాం ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలో నీటి ఎద్దడి నెలకొందని... ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిధులు మంజూరు చేయాలని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సీఎంను కోరారు. కార్యక్రమంలో మంత్రి చందూలాల్, ఎంపీ కవిత, పార్లమెంటరీ కార్యదర్శి సతీష్‌కుమార్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, దాసరి మనోహర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఎన్ని రంగులో.. ఎన్ని పండుగలో..
విద్యాసాగర్‌రావు తమ సంస్థలను చినజీయర్ ట్రస్ట్‌కు అందజేసిన సందర్భంగా... కేసీఆర్ భారతదేశ గొప్పదనాన్ని తనదైన శైలిలో శ్లాఘించారు. ‘అసలు నా దేశానికి ఎన్ని రంగులో.. ఎన్ని పండుగలో.. ఎన్ని భిన్నత్వాలో.. మరెన్ని ఏకత్వాలో.. ఎందుకంటేవిద్యాసాగర్‌రావు కట్టించినఈ విద్యాలయానికి స్థలాన్ని దానం చేసిన వ్యక్తి ఫాతిమా. ఆమె ఒక ముస్లిం మహిళ. ఇప్పుడు ఈ భవనాన్ని అంకితం తీసుకున్న చినజీయర్‌స్వామి హిందూ మత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్న వ్యక్తి. ఎంత రమ్యమైనది నా దే శం. ప్రపంచమంతటికీ ఆదర్శంగా నిలిచిన దేశం. తెలంగాణ రాష్ర్టమూ గంగా యమునా సంగమం. తెలంగాణను కూడా గొప్ప సెక్యులర్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతా..’’ అని సీఎం పేర్కొన్నారు.