10 రోజుల్లో రుణ మాఫీ | KCR says.. farmer debt waiver within 10 days | Sakshi
Sakshi News home page

10 రోజుల్లో రుణ మాఫీ

Published Thu, Jun 5 2014 1:38 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

10 రోజుల్లో రుణ మాఫీ - Sakshi

10 రోజుల్లో రుణ మాఫీ

మా పాలనపై ప్రజా సంఘాలతో సమీక్ష: కేసీఆర్
  జిల్లా స్థాయిలో ప్రజా సంఘాల కమిటీలు 
  మొదట రాష్ర్ట స్థాయిలో సలహా మండలి 
  పత్రికా సంపాదకులు, మేధావులు,
 నిపుణులతో కమిటీ.. ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష
  సంపూర్ణ అవగాహనతో అభివృద్ధి..  రాజకీయ అవినీతిని పెకలిస్తాం
  గజ్వేల్ సభతో తొలిసారి ప్రజల మధ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి
 
 సంక్షేమం.. లక్ష కోట్లు
 సంక్షేమానికి లక్ష కోట్లు..  దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, ముస్లిం, క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట. వీరి కోసం రానున్న ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వ్యయం. ఇందులో రూ.50 వేల కోట్లు సమాజంలో అట్టడుగున ఉన్నదళితుల
 అభివృద్ధి కోసమే వినియోగం. 
 
 10 రోజుల్లో రుణ మాఫీ
 10-12 రోజుల్లో రూ.12 వేల కోట్ల పంట రుణాల మాఫీ. హార్టికల్చర్ హబ్ , పరిశోధనా కేంద్రం ఏర్పాటు. విత్తనాభివృద్ధితో రైతులు ధనికులయ్యే విధంగా చర్యలు. భూకమతాల ఏకీకరణ. రైతులు ఒకరి భూమిని ఒకరు తీసుకునే విధంగా రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ.
 
 పింఛన్ల పండుగ
 కొద్ది రోజుల్లోనే వృద్ధులకు, వితంతువులకు రూ.1,000, వికలాంగులకు రూ.1,500 మేర పింఛన్లు.
 ఆటోలకు రవాణా పన్ను రద్దు. 
 
 జిల్లాకో నిమ్స్ తరహా ఆస్పత్రి. 100 పడకలుగా ఏరియా ఆస్పత్రులు. ప్రైవేటు ఆస్పత్రుల కంటే మెరుగైన సేవలు.
 
 పేదలకు గూడు, విద్య
 పేదలకు రూ.3 లక్షల వ్యయంతో 125 గజాల స్థలంలో రెండు బెడ్‌రూంలు ఉండేలా ఇళ్ల నిర్మాణం. 
 
 పీజీ నుంచి కేజీ దాకా పేద విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్య. ఒకట్రెండేళ్లలో అమలు. సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదువు. 
 
 సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చుతుందని, అంతా కలలు కన్న బంగారు తెలంగాణను సాకారం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బుధవారం ఆయన తొలిసారిగా మెదక్ జిల్లా గజ్వేల్ సభతో ప్రజల మధ్యకు వచ్చారు. ‘సంపూర్ణ అవగాహనతో.. కచ్చితమైన నిర్ణయాలతో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించడానికి, పర్యవేక్షించడానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పని జరగాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ర్ట సలహా మండలి(స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్)ని త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. మొదట రాష్ట్ర స్థాయిలో పత్రికా సంపాదకులు, మేధావులు, వివిధ రంగాల నిపుణులతో కమిటీ పని మొదలైతే దాని ఫలితాలను సమీక్షించుకుని జిల్లా స్థాయిలో కూడా ప్రజా సంఘాల ఏర్పాటుకు 
 శ్రీకారం చుట్టాలన్నదే ప్రభుత్వ ఆలోచన’ అని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిజమైన అభివృద్ధి జరగాలంటే రాజకీయ అవినీతి కచ్చితంగా అంతం కావాలని ఆయన పునరుద్ఘాటించారు. ‘రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతూ మీ అందరి ముందు నేను ప్రమాణపూర్వకంగా మనవి చేస్తున్నాను. రాజకీయ అవినీతిని అంతమొందించడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. దాన్ని కూకటి వేళ్లతో పెకిలించి బయటపడేస్తాం. రాజకీయ అవినీతికి పాల్పడిన ఎంతటి వారినైనా చాలా కఠినంగా శిక్షిస్తాం. త్వరలోనే మీరంతా చూడబోతున్నారు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 
 
 సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తాం 
 సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను కేసీఆర్ వివరించారు. ‘ప్రభుత్వ కార్యాచరణ మూడు భాగాలుగా ఉంటుంది. దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, ముస్లిం, క్రైస్తవ మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం. ఈ వర్గాల సంక్షేమానికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. వీరి కోసం రానున్న ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా రూ. లక్ష కోట్లను ఖర్చు చేయబోతున్నాం. ఇందులో రూ. 50 వేల కోట్లను సమాజంలో అట్టడుగున ఉన్న, అందరి కంటే పేదవాళ్లుగా ఉన్నదళితుల అభివృద్ధి కోసమే కచ్చితంగా వినియోగిస్తాం. అందుకోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను నా దగ్గరే ఉంచుకున్నాను. నేనే స్వయంగా పర్యవేక్షించి ఈ వర్గాల సంక్షేమానికి శ్రీకారం చుట్టబోతున్నా. దీనికి ప్రజలంతా సహకరించాలి. ఇక  రెండో ప్రాధాన్యతా రంగం వ్యవసాయం. కొంతమంది పెద్దలు వ్యవసాయం దండగ అన్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో నేటికీ  80 నుంచి 90 శాతం మంది ప్రజలు వ్యవసాయపైనే బతుకు వెళ్లదీస్తున్నారు. తెలంగాణలో కూరగాయలు పండించడానికి అనువైన నేలలు ఉన్నాయి. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల పరిధిలో గజ్వేల్ నియోజకవర్గం కావచ్చు, రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాలు కావచ్చు, నల్లగొండ జిల్లా చౌటుప్పల్ ప్రాంతాలు, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ ప్రాంతాలను కలుపుకొని ఒక హార్టికల్చర్ హబ్‌ను ఏర్పాటు చేస్తాం. పరిశోధనా కేంద్రం కూడా ఏర్పాటు చేసి, ప్రత్యేక నిధులు అందించి రైతులను ప్రోత్సహిస్తాం. విత్తనాలు పండించడానికి ప్రపంచంలోనే అనువైన భూములు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇక్కడి రైతులు విత్తనాలు మాత్రమే పండించి వారంతా ధనికులయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. అతి త్వరలోనే ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా దీన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకువస్తాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. 
 
 త్వరలోనే రుణ మాఫీ
 తెలంగాణ రైతాంగం తీసుకున్న పంట రుణాలపై బ్యాంకర్ల నుంచి పూర్తి వివరాలు తెలసుకున్నట్లు సీఎం చెప్పారు. దాదాపు 23 లక్షల మంది రైతులు రూ. 12 వేల కోట్ల పంట రుణాలు తీసుకున్నారని, మరో పద పన్నెండు రోజుల్లోనే వాటిని మాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. అలాగే ఆటోరిక్షాలకు రవాణా పన్ను రద్దు చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే వృద్ధులకు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ .1500 పెన్షన్ ఇస్తామని వెల్లడించారు. బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకేలా రూ. 3 లక్షల వ్యయంతో 125 గజాల స్థలంలో రెండు బెడ్‌రూంలు, హాలు, వంట గది, బాత్‌రూం, మరుగుదొడ్డితో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. 
 
 ఉచిత నిర్బంధ విద్య.. జిల్లాకో నిమ్స్
  అద్భుత తెలంగాణ సమాజ నిర్మాణం కోసం ఉచిత నిర్బంధ విద్య అమలుచేయాల్సి ఉందని, కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వమే పేద విద్యార్థులకు చదువు చెప్పే విధంగా చర్యలు చేపడతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అయితే ఇందుకు తగిన మౌలిక వసతులు సమకూర్చుకోడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆశ్రమ పాఠశాలల నిర్మాణం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, తగిన శిక్షణ తదితర అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఒకట్రెండేళ్లలోనే నిర్బంధ విద్య ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పేద పిల్లలు కూడా కాన్వెంట్లలో.. సీబీఎస్‌ఈ సిలబస్‌లో.. ఇంగ్లిష్ మీడియంలో చదవేలా చూస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇక గతంలో వైద్యరంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, గతిలేని పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆసుపత్రులకే పోవాల్సిన దురవస్థను ప్రభుత్వాలు కల్పించాయని కేసీఆర్ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ వైద్యరంగం శిథిలమైంది. పేదలకు వైద్యం అందాలంటే ప్రభుత్వ రంగంలోని వైద్య వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. దానికోసం చర్యలు తీసుకుంటున్నాం. నిమ్స్‌లాంటి ఆసుపత్రి కోసం భవిష్యత్తులో మీరు హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు. తెలంగాణలో 24 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ప్రతి జిల్లాకో నిమ్స్ ఆస్పత్రి రాబోతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 30 పడకల ఆస్పత్రులుగా.. నలుగురు డాక్టర్లు ఉండే విధంగా రూపుదిద్దుతాం. ఏరియా ఆస్పత్రులు 100 పడకలవుతాయి. అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రైవేటు ఆస్పత్రుల కంటే మెరుగైన సేవలు ప్రభుత్వ రంగంలో అందించడానికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
 
 భూమి రద్దు బదల్‌ను ప్రోత్సహిస్తాం
 భూ కమతాల ఏకీకరణ కూడా జరుగబోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘అక్కడక్కడా ముక్కలుగా ఉన్న భూములను ఒక్కచోట సమకూర్చుకునేలా పరస్పర అంగీకారంతో రైతులు ఒకరి భూమిని ఒకరు(భూమి రద్దు బదల్) తీసుకునే విధంగా రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ చేస్తాం. 6 నెలల సమయం ఇచ్చి కమతాల ఏకీకరణకు కూడా శ్రీకారం చుడతాం. గ్రీన్‌హౌజ్ వ్యవసాయంతో అత్యాధునిక పంటలు పండించడానికి పోత్సహిస్తాం. అందులో గజ్వేల్ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తాం’ అని కేసీఆర్ చెప్పారు. ఈ సభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, బాబూమోహన్, చింతా ప్రభాకర్, గూడెం మహిపాల్‌రెడ్డి, మహీదర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement