తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి రంగం సిద్ధమైంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి రంగం సిద్ధమైంది. తాను విజయం సాధిస్తే ఆ నియోజకవర్గ రూపురేఖలు మారిపోయేలా సమూలంగా అభివృద్ధి చేస్తానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నడుం బిగించారు.
ఇందులో భాగంగా గజ్వేల్ సమగ్రాభివృద్ధికి గాను గజ్వేల్ ప్రాంత ప్రత్యేక అభివృద్ధి సంస్థ (గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ)ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గురువారం ఉత్తర్వు జారీ చేశారు. గతంలో సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్‌కుమార్‌రెడ్డిలు వారివారి నియోజకవర్గాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తరహాలోనే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్‌పై దృష్టి సారించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా గజ్వేల్‌కు వెళ్లిన సందర్భంలో ఆయన ప్రత్యేకంగా భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని ప్రజాముఖంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే గజ్వేల్ సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వు వెలువడింది.
అభివృద్ధి ఇలా...
ఈ అథారిటీ కేవలం గజ్వేల్ పట్టణానికే పరిమితం కాకుండా పూర్తి నియోజకవర్గ అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది. ఇందుకోసం అన్ని రకాల ప్రభుత్వ పథకాలను ఈ ప్రాంతానికి వర్తింపజేస్తారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా పథకాలు, మెరుగైన విద్యుత్తు సరఫరా, వీధి దీపాల ఆధునికీకరణ లాంటి అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తారు.
స్థానిక ప్రజలు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడేలా వారికి అవకాశం ఉన్న అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తారు.
విద్య, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సాగునీటి సరఫరా మెరుగుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారు.
ఉపాధి అవకాశాలను పెంచేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. ఇతర పరిశ్రమల ఏర్పాటు అవకాశాలను పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటారు.
ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రణాళిక విభాగాన్ని నోడల్ డిపార్ట్‌మెంటుగా ఏర్పాటు చేశారు. ఇది ఆయా పనుల నిర్వహణకు అవసరమైన పోస్టుల ఏర్పాటు, బడ్జెట్ రూపకల్పన తదితరల పనులను ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటుంది.
ఈ సంస్థకు మెదక్ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ బృహత్తర కార్యక్రమ నిర్వహణకు అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపకల్పన, దాని అమలుకు కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేసేలా స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తారు.