
సర్వీసు రూల్స్.. ఇక సరళతరం!
- ఉద్యోగుల నిబంధనలసడలింపుపై ఉన్నతస్థాయి కమిటీ
- ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలను సరళతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందులో తొలిదశలో భాగంగా ఆరు అంశాలను ప్రధాన ఎజెండాగా ఎంచుకుంది. ఉద్యోగుల ప్రమోషన్లకు ఉండాల్సిన కనీస సర్వీసు, అర్హతలు, కారుణ్య నియామకాలకు అర్హత విధానం, వైద్య బిల్లులు, అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలు, సొంత జిల్లాలు, సొంత సబ్ డివిజన్ల పరిధిలో పోస్టింగులకు ఉన్న నిబంధనల్లో సడలింపులు, మినహాయిం పులను తొలుత పరిశీలించనున్నారు.
వీటితో పాటు రిటైర్డ్ అధికారుల నియామకాలు, వారి సేవల వినియోగించుకునే ప్రతిపాదనలను కూడా రూపొందిస్తారు. తెలంగాణ ముద్ర కనిపించేలా ఉద్యోగుల సర్వీస్ రూల్స్‌ను సరళతరం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు పలుమార్లు ప్రకటించిన విషయం తెలి సిందే. ఉమ్మడి రాష్ట్రంలోని సేవా నిబంధనలను సమూలంగా మార్చి కొత్తవి రూపొం దించాల్సి ఉందని అధికారులతోనూ ఆయన ప్రస్తావించారు. అందులో భాగంగానే తాజా కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
సర్వీస్ రూల్స్‌ను సరళతరం చేసే ప్రక్రియను చేపట్టేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి(రాజకీయ), కార్యదర్శి (సర్వీసెస్), వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. జీఏడీ డిప్యూటీ కార్యదర్శి(ఎస్‌ఆర్) కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ప్రతి 15 రోజులకోసారి ఈ కమిటీ సమావేశమవుతుంది.
ఎజెండాలో ప్రస్తావిం చిన అంశాలకు సంబంధించిన నిబంధనల సడలింపులు, మినహాయింపుల ప్రతిపాదనలు, వాటిని సమర్థించే నివేదికలను అన్ని విభాగాలు కమిటీ సమావేశాలకు వారం రోజుల ముందే అందించాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని విభాగాల నుంచి అందిన ప్రతిపాదనల ఆధారంగా ఈ కమిటీ కొత్త సర్వీసు నిబంధనలకు రూపకల్పన చేస్తుంది. దీంతోపాటు ఉద్యోగ సంఘాలు, నిపుణులతో నూ ఈ కమిటీ చర్చలు జరిపే అవకాశం ఉంది. తెలంగాణ, ఏపీల మధ్య ఉద్యోగుల విభజన ప్రక్రియ మరో నెల రోజుల్లో ముగియనుండడంతో ప్రభుత్వం కొత్త సర్వీసు నిబంధనలపై దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘వైద్య బిల్లుల’పై దృష్టి..
హెల్త్ కార్డుల పథకాన్ని తెచ్చినప్పటికీ అది పూర్తిగా అమల్లోకి రాని నేపథ్యంలో... తాజాగా సర్వీసు నిబంధనలపై ఏర్పాటు చేసిన కమిటీకి మెడికల్ క్లెయిమ్‌ల అంశాన్ని అప్పగించడం ఉద్యోగులను ఆకర్షిస్తోంది. హెల్త్‌కార్డుల పథకం అమల్లోకి వస్తే తమకు నచ్చిన ఆసుపత్రిలో ఉద్యోగులు వైద్యం చేయించుకునే వీలుంది. కానీ రాష్ట్రంలో పేరొందిన కార్పొరేట్ ఆసుపత్రులు వాటిని ఆమోదించడం లేదు. దీంతో ప్రభుత్వం 1972 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మెడికల్ రీయింబర్స్‌మెంట్ విధానాన్నే కొనసాగిస్తోంది.
ఈ విధానం ప్రకారం రూ. 50 వేలకు లోబడిన మెడికల్ బిల్లులను జిల్లా బోర్డుకు, అంతకు మించిన బిల్లులను రాష్ట్ర మెడికల్ బోర్డుకు పంపించాల్సి ఉంటుంది. అయితే అన్నిచోట్లా బిల్లుల రీయింబర్స్‌మెంట్ నెలల తరబడి పెండింగ్‌లో ఉంటోంది. దీంతోపాటు వైద్య చికిత్స బిల్లులను తగ్గిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామంటూ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీకి అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఉద్యోగుల అంతర్ జిల్లా, అంతర్ జోనల్ బదిలీలకు కొన్ని విభాగాలు పరిమితంగా అవకాశం కల్పిస్తున్నాయి.
అయితే సాధారణ బదిలీలతో పాటు వీటికి అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. వీటితో పాటు సొంత జిల్లాలు, సొంత సబ్ డివిజన్ల పరిధిలో పోస్టింగులు ఇవ్వాలా, వద్దా? ఏయే శాఖలకు మినహాయింపులు ఇవ్వాలనే అంశాన్ని కమిటీ పరిశీలించనుంది. వివిధ విభాగాల్లో రిటైర్డ్ అధికారుల సేవలను వినియోగించుకునే ప్రతిపాదనలు, అందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయనుంది.
ఇబ్బందులన్నీ తప్పేనా?
ఉద్యోగులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 57 ఏళ్ల కిందటి నిబంధనలు, దశాబ్దం కిందటి రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనలే ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. కాలానుగుణంగా పలు ప్రత్యేక నిబంధనలను చేర్చినప్పటికీ... ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు వంటి పలు అంశాల్లో ఏకరూపత కరువైంది. ప్రత్యక్ష, పరోక్ష నియామకాలతో పాటు సీనియారిటీ ఆధారిత పదోన్నతులు, ప్రతిభ ఆధారిత పదోన్నతులకు ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. 1996 రాష్ట్ర సబార్డినేట్ సర్వీసు నిబంధనల ప్రకారం... ఉద్యోగి పైకేడర్‌కు పదోన్నతి పొందాలంటే ప్రస్తుత కేడర్‌లో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలనే నిబంధన ఉంది. ఇక కారుణ్య నియామకాల అంశంపై గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గతంలో ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులకు కారుణ్య నియామకాల్లో జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మించని ఉద్యోగం ఇచ్చే నిబంధన ఉంది. రాష్ట్ర విభజనకు ముందు ఇందుకు కనీస విద్యార్హతను డిగ్రీకి పెంచారు. కానీ అప్పటికే నాలుగేళ్లుగా అన్ని జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న వందలాది దరఖాస్తుల మాటేమిటనేదానిపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు.