రెండో స్థానానికి హిందూజాలు
సండే టైమ్స్ ఈ ఏడాది బ్రిటన్ కుబేరుల జాబితా
మూడు నుంచి ఏడో స్థానానికి లక్ష్మీ మిట్టల్
302వ స్థానంలో ఎలిజబెత్ రాణి
లండన్: బ్రిటన్ ఈ ఏడాది కుబేరుల జాబితాలో హిందూజాల కుటుంబం మొదటిస్థానం నుంచి రెండో స్థానానికి పడిపోయింది. సండే టైమ్స్ రూపొందించిన ఈ ఏడాది ధనవంతుల జాబితాలో ఉక్రెయిన్‌కు చెందిన లెన్ బ్లావత్నిక్ 1,317 కోట్ల పౌండ్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు. లోహాలు, చమురు, సంగీత ముద్రణ, డిజిటల్ మీడియాల్లో ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న శ్రీచంద్, గోపీచంద్ హిందూజాల కుటుంబం 1,300 కోట్ల పౌండ్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. సండే టైమ్స్ రిచ్ లిస్ట్ వివరాల ప్రకారం..
గత ఏడాది జాబితాలో మూడవ స్థానంలో ఉన్న ఉక్కు సామ్రాట్ లక్ష్మీ ఎన్. మిట్టల్ ఈ ఏడాది జాబితాలో ఏడవ స్థానానికి పడిపోయారు. ఆయన సంపద 920 కోట్ల పౌండ్లుగా ఉంది. లార్జ్ స్వరాజ్‌పాల్ 220 కోట్ల పౌండ్ల సంపదతో 47వ స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఆయన సంపద 20 కోట్ల పౌండ్లు పెరిగింది.
బ్రిటన్‌లో వెయ్యి మంది అత్యంత ధనవంతులైన వ్యక్తుల, కుటుంబాల సంపద గత పదేళ్లలో దాదాపు రెట్టింపై 54,700 కోట్ల పౌండ్లకు చేరింది. ఈ వెయ్యిమందిలో 35 శాతం మంది భారత మూలాలున్న సంతతి వారే.
ఈ ఏడాది జాబితాలో ఐదుగురు భారత సంతతి కొత్త వ్యక్తులకు స్థానం దక్కింది.
ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుడు ఆశీష్ టక్కర్, పారిశ్రామికవేత్త గౌతమ్ థాపర్‌లు 217వ ర్యాంకులో ఉన్నా రు. వీరి ఒక్కొక్కరి సంపద 50 కోట్ల పౌండ్లు.
ఆహార పరిశ్రమకు చెందిన రంజిత్, బల్జిందర్ బోపారన్‌లు 16 కోట్ల పౌండ్ల సంపదతో 608వ స్థానంలో నిలిచారు.
సండే టైమ్స్ ఈ తరహా జాబితాను మొదటిసారిగా 1989లో రూపొందించింది. ఈ తొలి జాబితాలో ఎలిజెబెత్ టూ రాణి అగ్రస్థానంలో ఉన్నారు. కాగా ఈ ఏడాది ఆమె సంపద కోటి పౌండ్లు వృద్ధి చెంది 34 కోట్ల పౌండ్లకు చేరినప్పటికీ టాప్ 300 కుబేరుల్లో స్థానం దక్కలేదు. ఆమె 302వ స్థానంతో సరిపెట్టుకోవలసివచ్చింది.