న్యూఢిల్లీ: కరోనా వైరస్ తీవ్రతకు ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకుంటాయన్న భయాలతో సోమవారం స్టాక్‌మార్కెట్లు కుప్పకూలిన నేపథ్యంలో .. పలువురు బిలియనీర్ల స్థానాలు మారిపోయాయి. ఇప్పటిదాకా ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మార్కెట్ పతనంలో ఆయన సంపద విలువ 5.8 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోవడం ఇందుకు కారణం. దీంతో 44.5 బిలియన్ డాలర్ల సంపదతో చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు మళ్లీ నంబర్‌వన్ స్థానంలో నిల్చారు. అంబానీ కన్నా ఆయన సంపద సుమారు 2.6 బిలియన్ డాలర్లు ఎక్కువగా ఉంది. 2018 మధ్యలో జాక్ మా ఆసియాలో నంబర్ 1 హోదాను కోల్పోయారు. అపర కుబేరుల సంపద లెక్కించే బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ ద్వారా ఇది వెల్లడైంది.
‘చమురు’ వదులుతోంది...
ముడి చమురు రేట్లు భారీగా పతనమైన నేపథ్యంలో రిలయన్స్ నిర్దేశించుకున్నట్లుగా 2021 నాటికి రుణరహిత సంస్థగా మారే అవకాశాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. సౌదీ అరేబియన్ ఆయిల్ కంపెనీకి రిలయన్స్ చమురు, పెట్రోకెమికల్స్ విభాగంలో వాటాల విక్రయ డీల్ సజావుగా జరగడంపైనే ఇదంతా ఆధారపడనుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. మరోవైపు, కరోనా వైరస్ దెబ్బతో జాక్ మా ఆలీబాబా వ్యాపారం కాస్త దెబ్బతిన్నా.. ఆ గ్రూప్‌లోని క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు, మొబైల్ యాప్స్‌కి డిమాండ్ పెరగడంతో పెద్దగా ప్రతికూల ప్రభావం పడలేదు. అయితే, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి అలాంటి వెసులుబాటు లేకుండా పోయింది. సోమవారం స్టాక్ మార్కెట్ పతనంలో రిలయన్స్ షేర్లు ఏకంగా 12 శాతం పడిపోయాయి. 2009 తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం.
Comments
Please login to add a commentAdd a comment