పత్తికొండ: అధికారం ఉన్నా.. లేకున్నా నిరంతరం తన వెంట నడిచిన కార్యకర్తలు, నాయకులకు అండగా నిలుస్తానని కాంగ్రెస్ పార్టీ నియెజకవర్గ ఇన్‌చార్జి చెరుకులపాడు లక్ష్మీ నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండలంలో న్యాయవాది ఎల్లారెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్యకర్తల సహకారంతో 32 వేల ఓట్లు సాధించి కాంగ్రెస్ అభ్యర్థుల్లో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచానన్నారు.
తనను నమ్ముకున్న కార్యకర్తలకు జీవితకాలం రుణపడి ఉంటానన్నారు. నాయకులు, కార్యకర్తలు సలహా మేరకు, తనను నమ్ముకున్న వారి కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 30వ తేదీన పత్తికొండ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు. పార్టీలోకి చేరిన మరుక్షణమే హంద్రీ నీవా నుంచి సాగు, తాగునీరు సరాఫరా చేయాలనే డిమాండ్‌తో ఉద్యమాలు చేస్తానన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.
తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలాల నాయకులు వ్యవసాయ మార్కెట్ యార్డు మాజీ చెర్మన్ మల్లికార్జున యాదవ్, మాజీ సర్పంచ్ కృష్ణ, సర్పంచ్ హనుమంతు, ఆస్పరి బోయ రవిచంద్ర, శ్రీనివాసులు, పెద్ద తిమ్మయ్య, శంకర్‌రెడ్డి, నాయీ బ్రహ్మణుల సంఘం డివిజన్ అధ్యక్షుడు రవికుమార్, చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు జాఫర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహనికి ఎన్నికల్లో కనుమరుగైందన్నారు. రాష్ట్ర విభజనతో తమ నాయుడు నారాయణరెడ్డికి కాంగ్రెస్ ఓట్లు పడలేదని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కారం చేసినందుకు వ్యక్తిగతంగా ఓట్లు పడ్డాయన్నారు.
పదవులు, కాంట్రాక్టు పనులు కోసం టీడీపీలో చేరకుండా ప్రతిపక్ష పార్టీ వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరుతుండటంతో ఆనందంగా ఉందంటూ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గాందిరెడ్డి, బాబుల్‌రెడ్డి, మేకల సత్యం, ఖజావలి, శ్రీనివాసులు, నాగప్ప తదితరులు పాల్గొన్నారు. ఈనెల 22వ తేదీన హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని తెలిసింది.
22న వైఎస్‌ఆర్‌సీపీలోకి చెరుకులపాడు నారాయణరెడ్డి
Published Mon, Apr 20 2015 4:16 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement