‘సర్వే’లో ‘తూర్పు’ది రెండో స్థానం
నడకుదురు(కరప) : ప్రజాసాధికార సర్వే నిర్వహణలో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా ద్వితీయ స్థానంలో ఉన్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. కరప మండలం నడకుదురు ఎస్సీ వీధిలో నిర్వహిస్తున్న సర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. సర్వే ఆలస్యంపై ఎన్యూమరేటర్లను ఆరాతీశారు. ఐరిష్ తీసుకోవడంలో ఆలస్యమవుతోందని, కొన్ని సమయాల్లో సర్వర్ పనిచేయడం లేదని ఎన్యుమరేటర్లు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తినమాట వాస్తవమేనని, రెండు రోజులుగా సర్వే వేగవంతమైందని జేసీ వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోlప్రజా సాధికార సర్వేలో ఇంతవరకు 37,475 కుటుంబాల నుంచి 95,135 మందిని సర్వే చేసి, వారి వివరాలు ట్యాబ్‌లలో నమోదు చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో పామర్రు మండలంలో 4,948 కుటుంబాలను సర్వే చేసి ప్రథమ స్థానం, పెద్దాపురం మండలంలో 4,021 కుటుంబాలకు సర్వే జరిపి ద్వితీయ స్థానంలో ఉండగా, కోటనందూరులో 505 మందిని సర్వే చేసి చివరి స్థానంలో ఉందని చెప్పారు. ఒక్కొక్క ఎన్యుమరేటర్ రోజుకు సగటున 14 కుటుంబాలు సర్వే చేయాల్సి ఉండగా, సర్వర్ సమస్యతో 4 కుటుంబాలే అవుతున్నాయని తెలిపారు. ఎంపీడీఓ అన్నెపు ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్ విజయశ్రీ ఆయన వెంట ఉన్నారు.