గౌతమ్ సింఘానియాకు రెండో స్థానం
ఫెరారీ చాలెంజ్ సిరీస్
ముగెల్లో (ఇటలీ) / ముంబై: సూపర్ కార్ క్లబ్ ఫౌండర్, చైర్మన్ గౌతమ్ హరి సింఘానియా... ఫెరారీ చాలెంజ్ సిరీస్ యూరోప్ చాంపియన్‌షిప్ ఓవరాల్ స్టాండింగ్‌లో రెండో స్థానం దక్కించుకున్నాడు. కోపా షెల్ కేటగిరీలో మొత్తం 14 రేసుల్లో 171 పాయింట్లు సాధించాడు. 10 సార్లు పోడియంలో నిలిచిన సింఘానియా ఒక రేసులో విజేతగా నిలిచాడు. ఈనెల 8న ముగెల్లోలో జరిగిన వరల్డ్ ఫైనల్స్‌లో సింఘానియా వ్యక్తిగతంగా అత్యుత్తమ ల్యాప్ టైమింగ్ (1:56:119 సెకన్లు)ను నమోదు చేసి నాలుగో స్థానంతో సంతృప్తిపడ్డాడు.
యూరోప్, ఆసియా ఫసిఫిక్, నార్త్ అమెరికాల నుంచి మొత్తం 36 కార్లు ఈ రేసులో పాల్గొన్నాయి. భారత మోటార్ క్లబ్‌ల సమాఖ్య (ఎఫ్‌ఎమ్‌ఎస్‌సీఏ) గుర్తింపుతో సింఘానియా భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆరు వారాల పాటు జరిగిన ఈ చాంపియన్‌షిప్... మొంజా, ఇమోలా, ముగెల్లో (ఇటలీ), లీ కాస్టెల్లెట్ (ఫ్రాన్స్), వాలెన్సియా (స్పెయిన్), బుడాపెస్ట్ (హంగేరి)లో 15 రేసులు జరిగాయి.