special recognition
-
మాచర్ల గొర్రె .. ఇక స్పెషలే!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పల్నాడు ప్రాంతంలో బాగా పెరిగే ‘మాచర్ల గొర్రె’కు దేశీయంగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఏపీకి చెందిన ఒంగోలు గిత్త, అశీల్ రకం కోడి వంటివి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్బీఏజీఆర్ (నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్) ఈ గొర్రెను ఉత్తమ రకం పశువుగా నమోదు చేసింది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాచర్ల రకం గొర్రెలు ఉన్నాయి. దేశంలోని ఇతర రకాల గొర్రెలు, పొట్టేళ్లతో పోలిస్తే మాచర్ల గొర్రెలు విభిన్నంగా ఉన్నట్టు ఎన్బీఏజీఆర్ పేర్కొంది. దీనిపై ప్రత్యేక పరిశోధన చేసిన అనంతరం తాజా గా ఆ సంస్థ వీటిని ఉత్తమ రకం పశువులుగా గుర్తించింది. ఈ పరిశోధనలో కర్నాల్‌లోని ఎన్బీఏజీఆర్, గన్నవరంలోని ఎనీ్టఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ పరిశోధన బృందాలు పాల్గొన్నాయి.స్థానిక పరిస్థితులకు అనుకూలంగా.. మాచర్ల గొర్రెలనే గుక్కల జాల అని, గుంటూరు లోకల్ గొర్రె అని కూడా పిలుస్తారు. ఏపీలోని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మాచర్ల గొర్రెల జాతి చక్కగా ఇమిడిపోయినట్టు పరిశోధకులు తెలిపారు. వీటి మాంసం మిగతా వాటితో పోలిస్తే రుచికరంగా ఉంటుందని వెల్లడించారు.శరీర బరువు ఏడాదిలో 30 నుంచి 45 కేజీల వరకూ పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖం, కాళ్లపై గోధుమ లేదా నలుపు రంగు మచ్చలు ఉంటాయి. కొన్ని గొర్రెలు ముదురు గోధుమ రంగు మచ్చలతో ఉంటాయి. మాచర్ల గొర్రెల పోషణ లాభదాయకంగా ఉండటంతో చిన్న సన్నకారు రైతులు, రైతు కూలీలు దీన్నే వృత్తిగా చేసుకుంటున్నారని వెల్లడించారు. రెండో స్థానంలో ఏపీ» గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో పశు సంపద భారీగా పెరిగినట్టు ఎన్బీఏజీఆర్వెల్లడించింది.» ప్రపంచంలో 13.8 % వాటా పశువులతో దేశం మూడో స్థానంలో ఉండగా.. దేశంలో 23.74% వాటాతో అంటే 17.63 మిలియన్ గొర్రెలతో దేశంలోనేఏపీ రెండో స్థానంలోఉన్నట్టు స్పష్టం చేసింది.» వ్యవసాయం కంటే గొర్రెల పెంపకం లాభసాటిగాఉండటంతో ఎక్కువ మంది రైతులు దీనినే వృత్తిగా ఎంచుకుంటున్నారు. పైగా మాంసం ధర ఎక్కువగా ఉండటం వల్ల మంచి గిట్టుబాటు అవుతున్నట్టు తెలుస్తోంది. -
హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఏపీకి రెండోస్థానం
సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి వైద్యసేవలను మరింత చేరువ చేయడం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తోంది. తాజాగా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోనూ దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లోనూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండటం విశేషం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది జూలై నాటికి 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 21,891, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 11,855 కేంద్రాలు పని చేస్తున్నాయని వివరించింది. ఏపీ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశి్చమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో అత్యధిక హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాలు ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రజానీకానికి మరింత దగ్గరగా వైద్య సేవలందించడమే లక్ష్యంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సెంటర్లలో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలందించడంతోపాటు నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌ను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేసి మందులు కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఏపీలో ఇలా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అనుసంధానం చేసింది. వీటికి విలేజ్ హెల్త్ క్లినిక్స్, అర్బన్ హెల్త్ క్లినిక్స్గా పేరు పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో 2,500 జనాభాకు ఒకటి చొప్పున విలేజ్ హెల్త్ క్లినిక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించి ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని అమలు చేస్తోంది. విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌తోపాటు ఏఎన్ఎం, ఆశ వర్కర్లను అందుబాటులో ఉంచింది. ఈ క్లినిక్స్‌లో 14 రకాల పరీక్షలు చేయడంతోపాటు 105 రకాల మందులు అందించేలా ఏర్పాట్లు చేసింది. -
పలాస జీడిపప్పుకు ప్రత్యేక గుర్తింపు
కాశీబుగ్గ: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భౌగోళిక గుర్తింపు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 14 విశిష్టమైన వస్తువులను ఎంపిక చేసింది. అందులో శ్రీకాకుళం జిల్లా తరఫున పలాస జీడిపప్పుకు అవకాశం కల్పించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చేపడుతున్న వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్‌లో భౌగోళిక గుర్తింపు ఇచ్చి అంతర్జాతీయ మార్కెట్లో ప్రాముఖ్యతను తీసుకొచ్చేందుకు ఈ ఎంపిక చేపట్టింది. స్థానికంగా ప్రాచుర్యం పొందిన విశిష్ట వస్తువులను మన ప్రాంతానికే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరించి ఆదాయాన్ని తెచ్చిపెట్టడానికి, అధికంగా ఎగుమతులు పెరగడానికి తోడ్పాటునందిస్తోంది. లక్ష ఎకరాల్లో సాగు.. ఉద్దానం ప్రాంతంలోని వజ్రపుకొత్తూరు, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి తదితర మండలాల్లో 74 గ్రామాల్లో సుమారు లక్ష ఎకరాల్లో జీడిపంట సాగవుతోంది. సుమారు 5 లక్షల క్వింటాలు జీడిపిక్కలు దిగుబడి అవుతున్నాయి. జీడిపిక్కల బస్తా(80 కిలోలు) సుమారు రూ.13 వేలు ధర పలుకుతోంది. కరోనా కారణంగా వ్యాపారాలు నిలిచిపోవడంతో ప్రభుత్వం మద్దతు ధర రూ.10 వేలు ప్రకటించింది. ఈ పంటే ఇక్కడ ప్రజలకు జీవనాధారంగా ఉంది.ప్రస్తుతం మార్కెట్లో కిలో జీడిపప్పు నంబర్ 1 రకం కిలో రూ.800 ధర పలుకుతోంది. జిల్లాలో జీడి పరిశ్రమలు.. జిల్లాలో జీడి పంటకు కేరాఫ్‌గా నిలిచిన ఉద్దాన ఏడు మండలాల్లో అధికంగా జీడి పంటలు పండుతున్నాయి. పలాస కేంద్రంగా 300కుపైగా పరిశ్రమలు, జిల్లా వ్యాప్తంగా ఏఓబీతో కలుపుకుని 400 పైగా పరిశ్రమలు ఉన్నాయి. రోజుకు 500–600 టన్నుల జీడిపిక్కల ప్రొసెసింగ్ కు 150 టన్నుల జీడిపప్పు సిద్ధం చేస్తుంటారు. ఇలా పరిశ్రమల్లో పిక్కలు బాయిలింగ్ చేసి పప్పుగా మార్చి ఎగుమతులలో రోజుకు రూ.5 నుంచి రూ.6 కోట్లు వ్యాపారం జరుగుతుంటుంది. రూ.5–6 కోట్లకుగాను జీఎస్టీ రూపేనా రోజుకు రూ.25–30లక్షలు ప్రభుత్వానికి చెల్లిస్తుంటారు. ప్రత్యక్షంగా 15వేల మంది, పరోక్షంగా 5వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. జీడి పరిశ్రమకు ప్రభుత్వ తోడ్పాటు పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలతో పాటు జిల్లాలో ఉన్న 400కు పైగా పరిశ్రమలు సక్రమంగా నడవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ ద్వారా అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేశారు. వైఎస్సార్ హయాంలో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో 2007లో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో 30 ఎకరాల పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి ఒకేచోట వందల పరిశ్రమల స్థాపనకు అవకాశం కల్పించారు. ♦పావలా వడ్డీకి రుణాలను అందించి పరిశ్రమల నిర్మాణానికి తోడ్పాటు అందించారు. ♦పరిశ్రమ యజమానులు పప్పు ఎగుమతులకు జీఎస్టీ అధికమవుతుందని విన్నవించడంతో 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ప్రస్తుత సర్కారు హయాంలో.. ♦2014 నుంచి పరిశ్రమలకు రావాల్సిన ప్రోత్సాహకాలు 2020 ఏప్రిల్, మే నెలల్లో రూ.120 కోట్లు విడుదల చేశారు. ♦మహిళలు, యువతకు పూర్తి అవకాశాలు కల్పించాలని అధిక శాతం సబ్సిడీ అందించింది. ♦ఏఎంసీ పరంగా పన్ను వసూళ్లు స్థానిక రైతాంగానికి ఇబ్బందులు కాకూడదని రాష్ట్రప్రతి జూన్‌లో ఆమోదం తెలుపగా ఏఎంసీ లేకుండా రూ.500 కోట్లు నష్టం భరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ గత రెండు రోజులుగా అమలు చేస్తోంది. ♦పలాస మండల పరిధిలో నూతనంగా పారిశ్రామికవాడను నిర్మించడానికి కొత్తగా 30 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అయితే చిన్నపాటి సమస్యలతో పూర్తికాలేదు. ♦ఇప్పటికే ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు కోరి వారిని నూతన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దనుంది. ♦అతితక్కువ వడ్డీ, మహిళలకు అధిక శాతం సబ్సిడీతో సరికొత్త ఎంఎస్ఎంఈ విధానాన్ని తీసుకువచ్చింది. ♦కరోనా సమయంలో జీడిపరిశ్రమలు బంద్ కావడంతో సుమారు 400–500 కోట్లు వ్యాపారం నిలిచిపోయింది. ఈ సమయంలో వ్యాపారులు ఇబ్బందులు పడకూడదని పరిశ్రమల శాఖ కరోణా రుణాలను అందించింది. ♦రూ.13వేలు పలకాల్సిన జీడి పిక్కల బస్తా కరోణా కారణంగా పూర్తి అమ్మకాలు జరగపోవడంతో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో రూ.10వేలు మద్దతు ధర ప్రకటించి రైతుల వద్ద కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. పలాస జీడిపప్పుకు మహర్దశ పలాస జీడిపప్పుకు చాలా ఏళ్లకు మహర్దశ వచ్చింది. పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీ మేరకు 30 ఎకరాల స్థలం కేటాయింపు, బకాయిలు రూ.120 విడుదల, ఏఎంసీ రద్దు చేయడం కలిసివస్తోంది. నాడు తండ్రి, నేడు తనయుడికి వ్యాపారులమంతా రుణపడి ఉంటాం. – మల్లా రామేశ్వరం,ఇండస్ట్రీయల్ ఏరియా అధ్యక్షుడు, పలాస -
కనువిందుగా... కడుపు నిండుగా...
ఆ హోటల్‌కు హంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు. అక్కడకు చేరేదాకా ఒక హోటల్ ఉంటుందన్న భావన, మన ఆకలి తీర్చే అన్నదాత ఉంటాడన్న స్ఫురణే మనకు రాదు. ఆ హోటల్‌కు ఒకసారి విచ్చేసి భోజనం చేస్తే మాత్రం ‘అన్నదాతా సుఖీభవ’ అనాల్సిందే. ప్రచార పటాటోపం కన్నా, అన్నార్తుల జిహ్వచాపల్యానికి అనుగుణంగా 24 రకాల కూరలతో సుష్టుగా భోజనం పెట్టి సంతృప్తి పరుస్తున్న నాగన్న హోటల్ ఈ వారం ఫుడ్ ప్రింట్స్... ఉపాధి కోసం ఉన్న ఊరు వదిలి ఎక్కడికో వెళ్లడం ఎందుకనుకున్నారు బెల్లంకొండ నాగన్న. ఖమ్మం–సూర్యాపేట ప్రధాన రహదారిలో మండల కేంద్రమైన కూసుమంచిలో 1995లో ఒక హోటల్‌ను ప్రారంభించారు. ఇంటి పట్టునే ఉండి వ్యాపారం చేసుకోమని అమ్మ ఇచ్చిన సలహాతో నాగన్న అక్కడే ఉండి, సమీప బంధువుల స్థలంలో చిన్న పూరిపాకలో హోటల్ ప్రారంభించారు. పోటీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న తపనతో నాగన్న విస్తరినిండా కూరలు వడ్డించి ఆకలితో వచ్చేవారిని సంతృప్తి పరచాలనుకున్నారు. 24 కూరలతో కూడిన శాకాహార భోజనాన్ని రూ.10కే అందించడం ప్రారంభించారు. లాభనష్టాల గురించి ఆలోచించలేదు. వెనుకడుగు వేయకూడదన్న లక్ష్యంతో 24 ఏళ్లుగా 24 కూరల హోటల్‌ను నడుపుతూనే ఉన్నాడు. వంటకాలను నాగన్న కుటుంబ సభ్యులే తయారు చేస్తారు. తెల్లవారు జామున ఐదు గంటలకు భార్య మణెమ్మతో కలిసి పని ప్రారంభిస్తే, మధ్యాహ్నం దాకా అదే వ్యాపకం. హోటల్‌కు ఎంతమంది వచ్చినా.. ఏ రకమైన కూరైనా భార్య మణెమ్మ వండాల్సిందే, నాగన్న వడ్డించాల్సిందే. తనకున్న పొలంలో కూరగాయలు పండిస్తూ, వాటినే హోటల్‌కు వినియోగిస్తున్నారు. సొంత పాడి నుంచి పెరుగు తయారు చేస్తారు. నాణ్యమైన భోజనానికి చిరునామాగా ఉన్న తన పేరు వినియోగదారుల హృదయాలలో పది కాలాల పాటు ఉండాలని ఆయన చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటారు. సొంత పొలంలో పండించిన ధాన్యాన్ని మర ఆడించి, ఆ బియ్యాన్ని హోటల్‌కు వినియోగిస్తున్నారు. – మాటేటి వేణుగోపాల్, సాక్షిప్రతినిధి, ఖమ్మం మా హోటల్ గురించి ఎక్కడా ప్రచారం ఉండదు. భోజనానికి వచ్చిన వారు మరో పదిమందికి తెలియజేయడం వల్లే వ్యాపారం ఎదుగుతోంది. మా హోటల్లో భోజనం చేయడానికి ఇక్కడి కూరల విశిష్టత, ప్రత్యేకత తెలుసుకున్న అనేకమంది ఇతర ప్రాంతాల నుంచి పనిగట్టుకుని వస్తారు. రాజకీయ ప్రముఖులు, అధికారులు సైతం మా వంటను చవిచూసినవారే. సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు మా హోటల్ అడ్రస్ తెలుసుకుని 24 కూరల భోజనాన్ని రుచి చూస్తుంటారు. భోజనప్రియుల జిహ్వచాపల్యానికి అనుగుణంగా ప్రయోగాలు చేస్తుంటాం. బీట్రూట్తో కూర మాత్రమే కాదు, పచ్చడి సైతం చేసి మెప్పిస్తాం. క్యారట్, ముల్లంగి, క్యాబేజీ, టొమాటో, వంకాయ, దోసకాయ, బెండ, బీర, చిక్కుడు, గోరు చిక్కుడు, బుడమ దోస, కాకర వంటి కాయగూరలతో రోజుకో రకం తయారు చేస్తాం. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్లుగా ఎవరికి నచ్చిన కూర వారు తింటారు. అన్నీ నచ్చిన వారు తిని మరోసారి వేయమంటే నాకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. కాష్ కౌంటర్ దగ్గర కూర్చోవడం ఇష్టం ఉండదు. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే కూర్చుంటాను. వినియోగదారులతో కలిసి వారికి ఆనందం కలిగేలా వడ్డించడమే నాకు ఇష్టం. అందుకే నేను వాళ్లలో కలిసిపోతాను. – నాగన్న, హోటల్ యజమాని -
చారిత్రక సమాహారం.. బౌద్ధారామం
దక్షిణభారతదేశంలో విశిష్టత వున్న బౌద్ధారామంగా గుర్తించబడిన బొజ్జన్నకొండపై కనుమ పండగనాడు తీర్థం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బౌద్ధమేళాతో మొదలయ్యే ఈ తీర్థానికి గ్రామీణ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రంగు రంగుల పతంగులు, రంగుల రాట్నాలు, నోరూరించే పంచదార చిలుకలు, గుమ గుమలాడే తినుబండారాలు, చిన్నారులు ఇష్టపడే ఆటవస్తువులు, కనువిందు చేసే బుద్ధుని గుహలు ఇలా ఎన్నో చారిత్రక విశిష్టతలు ఈ తీర్థం సొంతం. అనకాపల్లి రేపు బొజ్జన్న కొండపై తీర్థం... ఏర్పాట్లు పూర్తి ఇలా వెలుగులోకి... రెండు దశాబ్దాల చరిత్ర వున్న బొజ్జన్నకొండ 1906లో అలగ్జాండర్ రిమ్ నివేదికతో వెలుగులోకి వచ్చింది. ఇక్కడి పురాతనమైన కట్టడాలు ఎక్కడా లేవని ప్రముఖ చరిత్రకారుడు రాళ్లబండి సుబ్బారావు పేర్కొన్నారు. వడ్డాదిని రాజధానిగా చేసుకొని పరిసర ప్రాంతాలను పాలించిన అర్జునదేవుడు అవసానదశలో ఈ బొజ్జన్నక్షేత్రంలో నివసించారని చరిత్ర చెబుతోంది. క్వారీ పేలుళ్లతో ముప్పు అనకాపల్లి బొజ్జన్నకొండకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలు ఒక వైపు ఉండగా, మార్టూరు సమీపంలోని క్వారీ పేలుళ్ల వల్ల ఇక్కడి శిలా సంపదకు ముప్పు నెలకొంది. బొజ్జన్నకొండపైన దంగోడు గొయ్యిలో రాయివేస్తే మేలు జరుగుతుందని సందర్శకుల విశ్వాసం. వీరంతా చేతికందిన ప్రతిరాయిని దంగోడు గొయ్యిలో వేయడం వల్ల నష్టం జరుగుతోంది. లింగాల మెట్టపై... బుద్ధుని కొండ పక్కనే ఉన్న లింగాల మెట్టపైకూడా అనేకమైన చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. అనేకమైన చైత్యాలతో కూడిన లింగాలమెట్టనే లింగాల కొండగా పిలుస్తున్నారు.లింగాలకొండ మత్స్య ఆకారంలో కనిపించడం మరో విశేషం. దీనిని నమూనాగా తీసుకొని జావా ద్వీపంలో ‘బోరోబూదూరు’ బౌద్ధక్షేత్ర నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు.{పాధాన్యమున్న బొజ్జన్నకొండను వీక్షించేందుకు, బౌద్ధమేళాలో పాల్గొనేందుకు రష్యా, జపాన్, చైనా, నేపాల్, బర్మా తదితర దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు వస్తుంటారు. ర్యాలీతో ప్రారంభమై... కనుమ రోజున ఉదయం పదిగంటలకు నిర్వహించే సమాజ శాంతి ర్యాలీలో బౌద్ధభిక్షవులు పాల్గొంటారు. పదిన్నర గంటలకు బౌద్ద ప్రధాన గుహలో బుద్ధ వందనం, చైత్యవందనం, 12 గంటలకు కొండ దిగువున బౌద్ధమేళా సభను నిర్వహిస్తారు.బౌద్ధ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను విక్రయిస్తారు. బౌద్ద గేయాలాపన, పలు తీర్మానాలు చేస్తారు. విశాఖజిల్లా మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రాచీన కట్టడంగా గుర్తించినా... హామీలు గాలికి... గతంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పాలకులు ఇచ్చిన హామీలు అమలు కావడంలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అనేక సార్లు బొజ్జన్న కొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వాగ్ధానాలు చేశారు. అయినప్పటికీ బొజ్జన్న కొండ అభివృద్ధిలో ఏ మాత్రం ముందడుగు పడలేదు. బొజ్జన్న కొండను చేరుకునేందుకు రెండు మార్గాలు ఉండగా, శంకరం వైపు రహదారిని మాత్రమే పక్కాగా వేశారు. తుమ్మపాల వైపు నుంచి వేలాది మంది వచ్చేవారు ఏలేరు కాలువ పక్కనుంచి గోతుల రహదారిలో రావాల్సి ఉంది. ఈ రహదారికి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సైతం హామీ ఇచ్చినా ఇంకా మోక్షం కలగలేదు. పురావస్తు శాఖ నిబంధనలే చిక్కు... బొజ్జన్న కొండను జాతీయ ప్రాధాన్యం కలిగిన స్మారకంగా, ప్రాచీన కట్టడంగా పురావస్తు క్షేత్రాలు, శిథిల అవశేషాల పరిరక్షణ చట్టం 1958 ద్వారా గుర్తించింది. పురావస్తు చట్టం సవరించిన 2010 అధికరణం 30(1) ప్రకారం బొజ్జన్న కొండ పరిసరాలను నిషేధిత , క్రమబద్ధీకరించిన ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో ఎటువంటి నిర్మాణాలు, తవ్వకాలు చేపట్టరాదు. క్రమబద్ధీకరించిన ప్రాంతం, సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో పురావస్తు శాఖ అధికారుల అనుమతి తీసుకొని మాత్ర మే కార్యక్రమాలు నిర్వహించాలి. గత ఏడాది బొజ్జన్న కొండ ప్రాంతంలో బౌద్ధ మేళాకు టెంట్ కూడా వేయనీయకపోవడంతో బౌద్ధులు ఇబ్బందులు పడ్డారు. దిల్లీ స్థాయిలోనే అనుమతి పొందాలి బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి నిర్మాణాలు, కట్టడాలు చేపట్టరాదు. కొద్ది నెలల క్రితం రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నిమిత్తం రాగా పై అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించాం. పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలంటే దిల్లీ స్థాయిలోని ఆర్కియాలజీ డెరైక్టర్ అనుమతి తీసుకోవాలి. - లోవరాజు, మల్టీ టాస్క్ స్టాఫ్, బొజ్జన్నకొండ విశేషాలెన్నో... సుమారు 23 ఎకరాల్లో విస్తరించి ఉన్న బొజ్జన్న, లింగాల కొండల్లో ఎన్నో విశేషాలు దాగి వున్నాయి.కొండ దిగువున ‘ హారతి’ అనే బౌద్ధ స్త్రీ మూర్తి శిల్పం ఉండేది. వీరశైవుల ప్రభావంతో మతవిద్వేశంతో ఆ స్త్రీమూర్తి విగ్రహాన్ని పిల్లల్ని హరించే రాకాసిగా చిత్రీకరించి రాళ్లతో కొట్టేవారు. ఈ శిల్పానికి నష్టం వాటిల్లడంతో పురావస్తు శాఖ వారు మ్యూజియంలో భద్రపరిచారు. మతవిద్వేశాలతో ఇక్కడి శిల్ప సంపదకు నష్టం జరిగింది. బొజ్జన్నకొండపై రెండు వరుసల్లో ఆరు గుహల్లో బౌద్ధ శిల్పాలు ఉండేవి. ఇక్కడి బుద్ధుని విగ్రహం శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఎంతో రమణీయంగా కనిపిస్తుంది.30 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు గల గుహాలయాన్ని 16 స్తంభాలపై నిర్మించారు. నాలుగు అడుగుల ఏకశిలా నిర్మితమైన స్థూపం కొండ మధ్య భాగంలో ఉంటుంది. దీనిని అశోకుని శిలాశాసనంగా చరిత్రకారులు భావిస్తుంటారు. ఈ స్థూపానికి తూర్పుదిశగా మహావిహారం ఉంది. ఇపుడు అది మట్టి దిబ్బగా కనిపిస్తున్నప్పటికీ కిందిభాగాన్ని చూడవచ్చు. ఈ విహారానికి చుట్టూ ఉన్న గదుల్లో దీపప్రమిదలు, ధ్యాన సామగ్రి అమర్చే అరలు ఉన్నాయి. -
క్రీడలతోనే ప్రత్యేక గుర్తింపు
అనంతపురం స్పోర్ట్స్ : క్రీడల్లో రాణించడం ద్వారా సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ లాల్‌కిషోర్ అన్నారు. అనంత క్రీడాగ్రామంలో మంగళవారం మొదటి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జూడో చాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడలు దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయన్నారు. దేశ జనాభాతో పోల్చితే క్రీడల్లో పాల్గొనే వారి సంఖ్య చాలా తక్కువన్నారు. చదువుతో పాటు క్రీడలకు సమప్రాధాన్యత కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి మాట్లాడుతూ క్రీడల్లో ‘అనంత’ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోందన్నారు. ఏ పోటీలు జరిగినా అందులో మన జిల్లా మంచి ప్రతిభను చూపుతోందన్నారు. జూడో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో 13 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు. అనంతరం మ్యాచ్‌లను వీసీ, ఆర్డీటీ చైర్మన్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) శ్రీనివాస్ కుమార్, ఒలింపిక్ అసోసియేషన్ పరిశీలకుడు మచ్చా రామలింగారెడ్డి, జూడో సంఘం రాష్ట్ర కార్యదర్శి కేఎన్ బాబు పాల్గొన్నారు. -
సేంద్రియ సాగు ఆరోగ్యకరం
సుగంధ ద్రవ్యాలపై అధ్యయనం కేరళ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త నిర్మల్‌బాబు చింతపల్లి: సేంద్రియ సాగులో విశాఖ మన్యంలోని చింతపల్లి అగ్రస్థానంలో నిలుస్తుందని,ఇక్కడి ఉద్యానవన పంటలకు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాలని కేరళ ఉద్యాన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ప్రా జెక్టు కో-ఆర్డినేటర్ డాక్టర్ కె. నిర్మల్‌బాబు అన్నారు. నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సీడ్స్ అం డ్ స్పైస్ ఆలిండియా కో-ఆర్డినేటింగ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇక్కడ పండే సుగంధ ద్రవ్య ఉద్యాన పంటలపై అధ్యయనంలో భాగంగా గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆయన విలేకరులతో మాట్లాడు తూ ఆంధ్రలో ప్రస్తుతం చింతపల్లి మినహా మరెక్కడా సేంద్రియ పద్ధతిలో సాగు చేయడం లేదన్నారు. అధిక దిగుబడుల కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు వాడుతున్నారని, ఇది మానవాళి మనుగుడకు సవాలుగా మారుతుం దన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చింతపల్లి ప్రాం తంలో గిరిజనులు సేంద్రియ పంటలను పం డించడం అభినందించ దగ్గ విషయమన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లో రసాయనిక ఎరువుల వినియోగంలో గుంటూరు అగ్రస్థానంలో ఉందని, రెట్టిం పు దిగుబడుల కోసం ఈ పద్ధతులను అనుసరిస్తున్నప్పటికీ, భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురుకాక తప్పదన్నారు. ఐస్క్రీంల తయారీకి విని యోగించే వెనీల ఒకప్పుడు విదేశాల్లో పండేద ని, అక్కడ రసాయనిక ఎరువుల వినియోగం పెరిగిపోవడంతో మన దేశంలో సేంద్రియ పద్ధతులలో సాగు చేపట్టారన్నారు. దీంతో ఇక్కడ పండిన వెనీలకు అంతర్జాతీయ మార్కెట్లో ఐదురెట్లు ధర లభించేదన్నారు. దీని వినియోగం పెరిగిన కొద్ది మన రైతులు కూడా రసాయనిక ఎరువులు విని యోగించడంతో ఇక్కడ పండిన వెనీలకు కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పతనమైపోయాయని వివరించారు. కార్యక్రమంలో స్థా నిక ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త చంద్రశేఖరరావు, భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ కో- ఆర్డినేటర్ శ్రీహరిబాబు, శాస్త్రవేత్తలు మల్లేశ్వరరావు, నాగేంద్ర ప్రసాద్, జివి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. చక్కెర వ్యాధిగ్రస్తులకు మన్యం జామ మంచిది మైదానంలో పండించే జామ తియ్యగా ఉంటుంది. ఏజెన్సీలో పండే జామ అంత తియ్యగా ఉండకపోవడం వల్ల వినియోగదారులు ఇక్కడ జామను కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదని శాస్త్రవేత్త నిర్మల్‌బాబు అన్నా రు. అయితే ఇక్కడ పండించే జామ డయాబెటిక్ రోగులకు మంచిదని ఈ విషయం తెలియకపోవడం వల్ల వినియోగదారులు ఆసక్తి చూ పడం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రచారంలోకి తేవాలని, అప్పుడే ఇక్కడ జామకు కూడా మార్కెట్లో మంచి ధరలు దక్కుతాయన్నారు. మిరియాలలో అధిక దిగుబడులు ఇచ్చే రకాలను అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక శాస్త్రవేత్తలకు సూచించారు. గిరిజన రైతులు పండించే పసుపు, అల్లం పంటలను నాణ్యంగా తయారు చేయడంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండలంలోని చిట్రాలగొప్పు, తాజంగి, దిగువపాకలలో రైతు లు పండిస్తున్న రోమా రకం పసుపు, మిరియా ల సాగును ఆయన పరిశీలించారు. -
పాలకా...ఏలుకో ఇక కొత్తకొలువు
జిల్లాలో ఒకేసారి 1267 పైగా పదవుల భర్తీ 27 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం ఒకటీ.. రెండూ కాదు.. ఏకంగా 1267 పైగా రాజకీయ పదవులు జిల్లాలో భర్తీ అయ్యాయి. ఎంపీటీసీ సభ్యుల నుంచి ఎంపీ వరకు ఒకేసారి పదవులు భర్తీ కావడంతో ఈ ఏడాది ప్రత్యేక గుర్తింపును కైవశం చేసుకుంది. 1987లో మండల పరిషత్, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. మళ్లీ 27 ఏళ్ల తరువాత ఇప్పుడు స్థానిక సంస్థలతో పాటు సార్వత్రిక ఎన్నికలు పూర్తవడంతో కొత్తగా ఎన్నికైన వారు పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవడంతో స్థానిక సంస్థల, మునిసిపల్ ఎన్నికలను అధికారులు ఇటీవలే పూర్తి చేశారు. దీనికి తోడు సార్వత్రిక ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ఇక మిగిలిందల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్పర్సన్, మేయర్, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లు బాధ్యతలు చేపట్టడమే. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, మూడు లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ మేరకు 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరికి నియోజకవర్గంతోపాటు రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అధికారం ఉంటుంది. అలాగే ప్రత్యేక హోదా, నెలవారీ గౌరవ వేతనం, అలవెన్సులు, రక్షణ,రాజధానిలో కొలువు, ఇతర వసతులను ప్రభుత్వమే సమకూర్చుతుంది. ఇక అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎంపీ నిధులు అందుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యకలాపాల్లో వీరి ప్రాతినిధ్యం తప్పనిసరి. మున్సిపల్ పాలకులు.. జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి మున్సిపాల్టీలతో పాటు చిత్తూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు పూర్తయ్యాయి. గెలిచిన అభ్యర్థులు పదవీ ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 169 వార్డు కౌన్సిలర్లు, 50 కార్పొరేటర్ పదవులు ఉన్నాయి. వీరిలో కొందరు మున్సిపల్ చైర్పర్సన్లుగా, కార్పొరేషన్ మేయర్‌గా కొనసాగుతారు. అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్ నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండడంతో ఇవి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక కేంద్రాలుగా పిలవబడుతున్నాయి. మున్సిపాల్టీల్లో చైర్పర్సన్లతో పాటు కౌన్సిలర్ల హోదాలో వారిని ప్రత్యేకంగా చూపుతుంది. ఇక కార్పొరేషన్లో అయితే ఎమ్మెల్యే, ఎంపీకన్నా మేయర్‌కే స్థానబలం ఎక్కువ. ప్రొటోకాల్ ప్రకారం మున్సిపాల్టీలు, కార్పొరేషన్లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా పాలక వర్గంలోని కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ప్రత్యేక ఆహ్వానం ఉంటుంది. వార్డుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, ప్రభుత్వం సానుకూలంగా ఉంటే కావాల్సినంత నిధులు వస్తాయి. జెడ్పీ చైర్పర్సన్... జెడ్పీటీసీ సభ్యులు జిల్లాలో 65 జెడ్పీటీసీ స్థానాలు ఇప్పటికే భర్తీ అయ్యాయి. జెడ్పీటీసీ సభ్యులుగా గెలిచిన 65 మంది నుంచే ఒకరు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికవుతారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి క్యాబినెట్ హోదాతో సమానమైంది. స్థానిక పాలనలో పెద్దగా జెడ్పీ చైర్పర్సన్ వ్యవహరిస్తారు. జెడ్పీటీసీ సభ్యులు తమ మండలాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తారు. మండలానికి సంబంధించిన ఏ సమస్యనైనా జెడ్పీ సమావేశంలో ప్రస్తావించవచ్చు. మడల పరిషత్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులుగా అభివృద్ధికి సూచనలు చేయవచ్చు. జిల్లాకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చు. వీరికి ప్రభుత్వం గౌరవ వేతనం కూడా ఇస్తుంది. ఎంపీపీలు.. ఎంపీటీసీ సభ్యులు జిల్లాలో 901 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యా రు. వీరిలో 65 మంది ఎంపీపీలుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) ఆ మండల ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తారు. మండల పరిషత్‌ను నడిపించేది వీరే. మండలాభివృద్ధి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారు. ఎంపీటీసీ సభ్యునిగా ఎన్నికై మెజారిటీ సభ్యుల మద్దతు కూడగడితే ఎంపీపీ పదవిని చేపట్టవచ్చు. ఎంపీటీసీ సభ్యుడు తాను ప్రాతినిధ్యం వహించే గ్రామాల అభివృద్ధికి పాటుపడవచ్చు. మండల పరిషత్ సమావేశాల్లో గ్రామానికి సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించవచ్చు, వాటి పరిష్కారానికి మండలం నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో కృషి చేయవచ్చు. ఇదే ప్రథమం.. జిల్లాలో ఒకేసారి ఇన్ని రాజకీయ పదవులు భర్తీ కానుం డడం ఇదే ప్రథమం. ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన వారు అదృష్టం ఉంటే మంత్రులు, జెడ్పీలో వైస్ చైర్మన్లు, స్థాయి సంఘాల అధ్యక్షులు, మున్సిపాల్టీల్లో వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లో డెప్యూటీ మేయర్లు, స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా కొనసాగుతారు. మొత్తం మీద జయనామ సంవత్సరంలో 1267 మందికి పైగా వివిధ రాజకీయ పదవుల్లో ఆశీను లు కానున్నారు. వీరిలో ఎమ్మెల్యేలు 14 మంది, ఎంపీ లు ముగ్గురు, జెడ్పీ చైర్పర్సన్ ఒకరు, మునిసిపల్ చైర్మ న్లు ఆరుగురు, జెడ్పీటీసీ సభ్యులు 65 మంది, మండలాధ్యక్షులు 65 మంది, ఎంపీటీసీ సభ్యులు 901మంది, కార్పొరేషన్ మేయర్‌గా ఒకరు, వార్డు కౌన్సిలర్లు 169 మంది, కార్పొరేటర్లుగా 50 మంది ఉన్నారు. వీరంతా ప్రజా సమస్యలను ఏ మేరకు పరిష్కరించి గ్రామాలు, పట్టణాలు, నగరాలను అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టిస్తారో వేచి చూడాల్సి ఉంది.