చారిత్రక సమాహారం.. బౌద్ధారామం | The historical collection of the monastery .. | Sakshi
Sakshi News home page

చారిత్రక సమాహారం.. బౌద్ధారామం

Published Fri, Jan 15 2016 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 PM

The historical collection of the monastery ..

దక్షిణభారతదేశంలో విశిష్టత వున్న బౌద్ధారామంగా గుర్తించబడిన బొజ్జన్నకొండపై కనుమ పండగనాడు తీర్థం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బౌద్ధమేళాతో మొదలయ్యే ఈ తీర్థానికి గ్రామీణ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది.  రంగు రంగుల పతంగులు, రంగుల రాట్నాలు, నోరూరించే పంచదార చిలుకలు, గుమ గుమలాడే తినుబండారాలు, చిన్నారులు ఇష్టపడే ఆటవస్తువులు, కనువిందు చేసే బుద్ధుని గుహలు ఇలా ఎన్నో చారిత్రక విశిష్టతలు ఈ తీర్థం సొంతం.                                                                             అనకాపల్లి
 
రేపు బొజ్జన్న కొండపై తీర్థం...   ఏర్పాట్లు పూర్తి

ఇలా వెలుగులోకి...
రెండు దశాబ్దాల చరిత్ర వున్న బొజ్జన్నకొండ 1906లో అలగ్జాండర్ రిమ్ నివేదికతో వెలుగులోకి వచ్చింది. ఇక్కడి పురాతనమైన కట్టడాలు ఎక్కడా లేవని ప్రముఖ చరిత్రకారుడు రాళ్లబండి సుబ్బారావు పేర్కొన్నారు.  వడ్డాదిని రాజధానిగా చేసుకొని పరిసర ప్రాంతాలను పాలించిన అర్జునదేవుడు అవసానదశలో ఈ బొజ్జన్నక్షేత్రంలో నివసించారని చరిత్ర చెబుతోంది.
 
క్వారీ పేలుళ్లతో ముప్పు

అనకాపల్లి బొజ్జన్నకొండకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలు ఒక వైపు ఉండగా, మార్టూరు సమీపంలోని క్వారీ పేలుళ్ల వల్ల ఇక్కడి శిలా సంపదకు ముప్పు నెలకొంది. బొజ్జన్నకొండపైన దంగోడు గొయ్యిలో రాయివేస్తే మేలు జరుగుతుందని సందర్శకుల విశ్వాసం. వీరంతా చేతికందిన ప్రతిరాయిని దంగోడు గొయ్యిలో వేయడం వల్ల నష్టం జరుగుతోంది.
 
లింగాల మెట్టపై...
బుద్ధుని కొండ పక్కనే ఉన్న లింగాల మెట్టపైకూడా అనేకమైన చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. అనేకమైన చైత్యాలతో కూడిన లింగాలమెట్టనే లింగాల కొండగా పిలుస్తున్నారు.లింగాలకొండ మత్స్య ఆకారంలో కనిపించడం మరో విశేషం. దీనిని నమూనాగా తీసుకొని జావా ద్వీపంలో ‘బోరోబూదూరు’ బౌద్ధక్షేత్ర నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు.{పాధాన్యమున్న బొజ్జన్నకొండను వీక్షించేందుకు, బౌద్ధమేళాలో పాల్గొనేందుకు రష్యా, జపాన్, చైనా, నేపాల్, బర్మా తదితర దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు వస్తుంటారు.
 
ర్యాలీతో ప్రారంభమై...
కనుమ రోజున ఉదయం పదిగంటలకు నిర్వహించే సమాజ శాంతి ర్యాలీలో బౌద్ధభిక్షవులు పాల్గొంటారు. పదిన్నర గంటలకు  బౌద్ద ప్రధాన గుహలో బుద్ధ వందనం, చైత్యవందనం, 12 గంటలకు కొండ దిగువున బౌద్ధమేళా సభను నిర్వహిస్తారు.బౌద్ధ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను విక్రయిస్తారు. బౌద్ద గేయాలాపన, పలు తీర్మానాలు చేస్తారు. విశాఖజిల్లా మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
 
ప్రాచీన కట్టడంగా గుర్తించినా...
 
హామీలు గాలికి...
గతంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పాలకులు ఇచ్చిన హామీలు అమలు కావడంలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అనేక సార్లు బొజ్జన్న కొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వాగ్ధానాలు చేశారు. అయినప్పటికీ బొజ్జన్న కొండ అభివృద్ధిలో ఏ మాత్రం ముందడుగు పడలేదు. బొజ్జన్న కొండను చేరుకునేందుకు రెండు మార్గాలు ఉండగా, శంకరం వైపు రహదారిని మాత్రమే పక్కాగా వేశారు. తుమ్మపాల వైపు నుంచి వేలాది మంది వచ్చేవారు ఏలేరు కాలువ పక్కనుంచి గోతుల రహదారిలో రావాల్సి ఉంది. ఈ రహదారికి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సైతం హామీ ఇచ్చినా ఇంకా మోక్షం కలగలేదు.
 
పురావస్తు శాఖ నిబంధనలే చిక్కు...
బొజ్జన్న కొండను జాతీయ ప్రాధాన్యం కలిగిన స్మారకంగా, ప్రాచీన కట్టడంగా  పురావస్తు క్షేత్రాలు, శిథిల అవశేషాల పరిరక్షణ  చట్టం 1958 ద్వారా గుర్తించింది. పురావస్తు చట్టం సవరించిన 2010 అధికరణం 30(1) ప్రకారం బొజ్జన్న కొండ పరిసరాలను నిషేధిత , క్రమబద్ధీకరించిన ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో ఎటువంటి నిర్మాణాలు, తవ్వకాలు చేపట్టరాదు. క్రమబద్ధీకరించిన ప్రాంతం, సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో పురావస్తు శాఖ అధికారుల అనుమతి తీసుకొని మాత్ర మే కార్యక్రమాలు నిర్వహించాలి. గత ఏడాది బొజ్జన్న కొండ ప్రాంతంలో బౌద్ధ మేళాకు  టెంట్ కూడా వేయనీయకపోవడంతో బౌద్ధులు ఇబ్బందులు పడ్డారు.
 
దిల్లీ స్థాయిలోనే అనుమతి పొందాలి
బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి నిర్మాణాలు, కట్టడాలు చేపట్టరాదు. కొద్ది నెలల క్రితం రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నిమిత్తం రాగా పై అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించాం. పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలంటే దిల్లీ స్థాయిలోని ఆర్కియాలజీ డెరైక్టర్ అనుమతి తీసుకోవాలి.                   - లోవరాజు, మల్టీ టాస్క్ స్టాఫ్,
                                            బొజ్జన్నకొండ
 
విశేషాలెన్నో...

సుమారు 23 ఎకరాల్లో విస్తరించి ఉన్న బొజ్జన్న, లింగాల కొండల్లో ఎన్నో విశేషాలు దాగి వున్నాయి.కొండ దిగువున ‘ హారతి’ అనే బౌద్ధ స్త్రీ మూర్తి శిల్పం ఉండేది. వీరశైవుల ప్రభావంతో మతవిద్వేశంతో ఆ స్త్రీమూర్తి విగ్రహాన్ని పిల్లల్ని హరించే రాకాసిగా చిత్రీకరించి రాళ్లతో కొట్టేవారు. ఈ శిల్పానికి నష్టం వాటిల్లడంతో పురావస్తు శాఖ వారు మ్యూజియంలో భద్రపరిచారు. మతవిద్వేశాలతో ఇక్కడి శిల్ప సంపదకు నష్టం జరిగింది. బొజ్జన్నకొండపై రెండు వరుసల్లో ఆరు గుహల్లో బౌద్ధ శిల్పాలు ఉండేవి. ఇక్కడి  బుద్ధుని విగ్రహం శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఎంతో రమణీయంగా కనిపిస్తుంది.30 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు గల గుహాలయాన్ని 16 స్తంభాలపై నిర్మించారు. నాలుగు అడుగుల ఏకశిలా నిర్మితమైన స్థూపం కొండ మధ్య భాగంలో ఉంటుంది. దీనిని అశోకుని శిలాశాసనంగా చరిత్రకారులు భావిస్తుంటారు. ఈ స్థూపానికి తూర్పుదిశగా మహావిహారం ఉంది. ఇపుడు అది మట్టి దిబ్బగా కనిపిస్తున్నప్పటికీ కిందిభాగాన్ని చూడవచ్చు. ఈ విహారానికి చుట్టూ ఉన్న  గదుల్లో దీపప్రమిదలు, ధ్యాన సామగ్రి అమర్చే అరలు ఉన్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement