Bojjannakonda
-
బొజ్జన్న కొండపై భౌద్ధ భిక్షవుల ధ్యానం
-
ఇండోనేషియాలో మన బొజ్జన్నకొండ
పచ్చని కొండల నడుమ ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కేలా ప్రకృతి అందాలతో నిండిన బొజ్జన్నకొండ ఘనత ఒక్క అనకాపల్లికో.. ఆంధ్రప్రదేశ్‌కో పరిమితం కాదు. అది దేశానికే తలమానికం. భారతదేశం బౌద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసినట్టే.. బొజ్జన్నకొండను తొలచి నిర్మించిన శైలేంద్రుల వాస్తు శిల్పం విదేశీయులెందరినో ఆకర్షించింది. 4–6 శతాబ్ద కాలంలో అంతస్తులుగా ఇక్కడ సాగించిన అపురూప నిర్మాణాలు ఇండోనేషియా రాజుల మనసు దోచుకున్నాయి. ఇక్కడి శిల్పకళను అధ్యయనం చేసి, 9వ శతాబ్దంలో వారు నిర్మించిన బొరొబుదూర్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆ నిర్మాణం మన బొజ్జన్నకొండకు జిరాక్స్ కాపీలా ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విశేషాల్ని ఓసారి చూద్దాం... –సాక్షి, విశాఖపట్నం అనకాపల్లిలో బొజ్జన్నకొండ బౌద్ధారామాల్ని క్రీస్తు శకం 4–6 శతాబ్దంలో నిర్మించారు. కొండలపై ఏకశిలా స్థూపాలు, కొండలో తొలచిన గుహలు ఇక్కడి ప్రత్యేకతలు. ఆశ్రయ స్థలాలుగా చెప్పే నాలుగు గుహల్లో మూడు చోట్ల ధ్యాన బుద్ధ విగ్రహాలున్నాయి. ప్రతి గుహ ద్వారము రెండుపక్కల పెద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. గుహ అంతర్భాగము చతుర్భుజాకారములో ఉండి పదహారు స్తంభాలతో, 20 గదులుగా రాయిని తొలిచి నిర్మించారు. గుహ మధ్యలో చతురస్రాకారపు తిన్నెపై ధ్యాన ముద్రలో గల భూమిస్పర్శ బుద్ధుని విగ్రహం పర్యాటకుల్ని చూపుతిప్పుకోనివ్వదు. బొజ్జన్నకొండపై రెండతస్తుల నిర్మాణాలుంటాయి. ఇటుకలతో కట్టిన విహారాలు, బౌద్ధ భిక్షువుల గదులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బొజ్జన్నకొండ నిర్మాణాలు ఇప్పటి పర్యాటకుల్నే కాదు.. క్రీస్తుపూర్వం రాజుల్ని కూడా ఆకర్షించాయి. అందుకే.. ఇక్కడ ఉన్న బొజ్జన్నకొండ తరహాలో ఇండోనేషియాలో నిర్మించాలని భావించారు. ఈ నిర్మాణ స్ఫూర్తితోనే అక్కడ కూడా బౌద్ధారామాన్ని నిర్మించారు. ఈ ఆలయం బొజ్జన్నకొండ కంటే ప్రసిద్ధి చెందింది. అదే బొరొబుదూర్ బౌద్ధాలయం. శైలేంద్రుల వాస్తు శిల్పానికి మచ్చుతునక బొజ్జన్నకొండ ఓ అద్భుతం అయితే ఇండోనేషియాలోని బొరొబుదూర్ మహాద్భుతం. శైలేంద్రుల వాస్తు శిల్పానికి మచ్చుతునకగా ఈ ఆలయ నిర్మాణం నిలిచింది. ఇండోనేషియాలోని జోగ్ నగరం నుంచి కొద్ది దూరంలో బొరొబుదూర్ ఆలయం ఉంది. బొజ్జన్నకొండ క్రీస్తు శకం 4 నుంచి 6 శతాబ్దికి చెందింది. బొరొబుదూర్ తొమ్మిదో శతాబ్దికి చెందింది. 9వ శతాబ్దంలో విహార యాత్రల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన తురుమ రాజులు.. బొజ్జన్నకొండ శిల్పకళా సౌందర్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. కచ్చితంగా ఇలాంటి ఆలయాన్నే ఇండోనేషియాలో నిర్మించాలని భావించి.. అక్కడి నుంచి వాస్తు శిల్పుల్ని తీసుకు వచ్చి..సుమారు ఏడాది పాటు ఇక్కడే ఉండి.. ఆలయం అణువణువూ పరిశీలించి.. ఛాయాచిత్రాల్ని గీశారు. అయితే.. బొజ్జన్నకొండ కంటే.. బొరొబుదూర్ మరింత అద్భుతంగా ఉండాలని భావించిన తురుమ రాజులు అదే మాదిరిగా నిర్మాణం చేపట్టి.. రెండంతస్తులు కాకుండా.. తొమ్మిది అంతస్తుల్లో నిర్మించారు. అందుకే బొరొబుదూర్ ప్రపంచ వింతల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న బొరొబుదూర్ ఆర్కియాలాజికల్ పార్క్‌లో పెద్ద చతురస్రాకార భవనంలా ఈ స్థూపం కన్పిస్తుంది. 35 మీటర్ల ఎత్తులో మండలం ఆకారంలో తొమ్మిది అంతస్తులుగా దీన్ని నిర్మించారు. ఓ పెద్ద కొండనంతా తొలచి స్థూపంలా మలిచారు. రెండు అంతస్తులుగా ఉండే బొజ్జన్నకొండలో కూడా కొండను తొలచి బుద్ధుడి విగ్రహాలను చెక్కారు. ఓ గూడులాంటి అమరికలో బుద్ధుడి విగ్రహాలను ప్రతిష్టించారు. రెండింటిలో సారూప్యత కొట్టొచ్చినట్టుగా కన్పిస్తుంది. మొత్తం 504 బుద్ధ విగ్రహాలు ఈ స్థూపంలో ఉన్నాయి. ఈ విగ్రహాల అమరిక మొత్తం ఇక్కడ ఉన్న బొజ్జన్నకొండను పోలి ఉంటుంది. బౌద్ధారామాలకు బొజ్జన్నకొండ ఆదర్శం బొజ్జన్నకొండలో అద్భుతంగా ఉన్న ఏకశిలా స్థూపాలు, కొండలో తొలచిన గుహలు.. ప్రపంచంలోని అన్ని బౌద్ధారామాలకు ఆదర్శం. ఎక్కడా లేని విధంగా ఉన్న ఈ కట్టడాలు ఇక్కడ ఉండడం వల్లే దీన్ని ఆదర్శంగా తీసుకొని బొరొబుదూర్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు బొజ్జన్నకొండను చూసిన అనుభూతి కలుగుతుంది. మొదటి అంతస్తులో బుద్ధుడి జీవితానికి సంబంధించిన కథలు గోడలపై శిలాఫలకాలుగా ఉంటాయి. ప్రతి అంతస్తుకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. – డీపీ అనురాధ, చరిత్రకారిణి -
బొజ్జన్న కొండకు మైనింగ్ ముప్పు
అనకాపల్లి: ఏకశిలా స్థూపాలు.. కొండలో తొలచిన గుహలు.. వాటిలో ఇరవై గదులు.. ధ్యాన బుద్ధ విగ్రహాలు వంటి ప్రత్యేకతలెన్నో బొజ్జన్నకొండ సొంతం. విశాఖ జిల్లా శంకరం గ్రామంలోని బొజ్జన్నకొండ, లింగాల కొండలపై గల ఈ బౌద్ధ స్థలాలు క్రీ.శ. 4–9 శతాబ్దాల మధ్య నిర్మితమైనట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడి ప్రధాన స్థూపం రాతిలో తొలచబడి ఇటుకలతో చుట్టబడి ఉంటుంది. ఇటుకలతో కట్టిన బౌద్ధ విహారాలు, చైత్యం, భిక్షువుల గదులు ఉన్నాయి. 1907లో ఇక్కడ జరిపిన తవ్వకాల్లో 4వ శతాబ్దం నాటి సముద్ర గుప్తుని నాణెము, చాళుక్య రాజు కుబ్జ విష్ణువర్ధనుని, ఆంధ్ర శాతవానుల కాలం నాటి నాణేలు దొరికాయి. ఇంతటి విశిష్టత గల బొజ్జన్నకొండలోని ప్రధాన గుహతోపాటు అనేక అపురూప కట్టడాలకు క్వారీ పేలుళ్లతో ప్రమాదం పొంచి ఉంది. 30 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో 16 స్తంభాలపై విశేషంగా నిర్మించిన ఈ గుహాలయంలోని స్తంభాల పెచ్చులూడుతున్నాయి. మైనింగ్ ప్రకంపనల వల్లే ఈ ప్రమాదం ఏర్పడుతోందని నిపుణుల అంచనా. బ్యూరో ఆఫ్ మైనింగ్ నిర్వహించిన సర్వేలో 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొజ్జన్నకొండ, లింగాలకొండలోని అపురూప శిల్ప సంపదకు నిత్యం నష్టం వాటిల్లుతూనే ఉంది. శతాబ్దం క్రితం వెలుగులోకి.. బొజ్జన్నకొండ చరిత్ర 1906లో వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో బయటపడిన శాసనాలు, బౌద్ధ శిథిలాలు, అవశేషాలు నాటి చరిత్రను తేటతెల్లం చేశాయి. దక్షిణ భారతదేశంలో విశిష్టత ఉన్న బౌద్ధారామంగా బొజ్జన్నకొండకు గుర్తింపు ఉంది. ఈ కొండలోని హారతి అనే స్త్రీ మూర్తి శిల్పాన్ని పిల్లల్ని హరించే రాకాసిగా చిత్రీకరించి రాళ్లతో కొట్టేవారట. మత విద్వేషాలతో కొందరు ఇక్కడి శిల్ప సంపదను నాశనం చేశారు. కొండ పైభాగాన దంగోడు గొయ్యికి ఓ భారీ రంధ్రముంటుంది. దీనిపై రాళ్లు విసిరే సంప్రదాయం ఉండగా.. పురావస్తు శాఖ రంగంలోకి దిగి దానిని నిలిపివేయించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. మైనింగ్ బాబులతో ముప్పు బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్ల సమీపంలోని మార్టూరులో 140 హెక్టార్లలో ఓ కొండ ఉంది. దానిని బినామీ పేర్లతో కొందరు బడా వ్యక్తులు లీజుకు తీసుకుని 30 ఏళ్లుగా భారీగా మైనింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అప్పట్లో బ్యూరో ఆఫ్ మైనింగ్ ఇక్కడి పరిస్థితులపై పరిశీలన జరిపి బొజ్జన్నకొండ పరిధిలో 3 నుంచి 6 కిలోమీటర్ల లోపల బ్లాíస్టింగ్‌లు చేస్తే అత్యంత విలువైన శిల్ప సంపదకు నష్టం వాటిల్లుతుందని తేల్చింది. అయినా.. ఇక్కడి గుహలకు, ఇటుక నిర్మాణాలకు ముప్పు వాటిల్లేవిధంగా మార్టూరులో దర్జాగా క్వారీ తవ్వకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అటకెక్కిన లోకాయుక్త దర్యాప్తు మార్టూరు, గుంకల్లోవ గ్రామాలకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్–1లో ఎన్ని క్వారీలున్నాయి, ఎన్నింటికి అనుమతులు ఉన్నాయో తేల్చాలంటూ మార్టూరు గ్రామానికి చెందిన వ్యక్తి లోకాయుక్తను ఆశ్రయించారు. అప్పట్లో దర్యాప్తు జరపగా.. విచిత్రంగా 72 క్వారీలకు సంబంధించి అసలు యజమానులు 10 మంది మాత్రమే దొరికారు. మిగిలిన యజమానులు కాగితాల్లో ఉన్నారే తప్ప వారి అడ్రసులు అధికారులకు చిక్కలేదు. దీంతో బినామీ పేర్లతో క్వారీలను కొనసాగిస్తున్నారన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. కానీ.. కొన్నాళ్లకే లోకాయుక్త దర్యాప్తు సైతం అటకెక్కింది. విచారణ చేపడతాం బొజ్జన్నకొండ వంటి పురావస్తు కట్టడాలకు మైనింగ్ వల్ల నష్టం కలుగుతోందని ఇప్పటికే ఫిర్యాదులొచ్చాయి. గతంలో వచ్చిన నివేదికలు, నిజంగా క్వారీ కార్యకలాపాల వలన ఎంత నష్టం జరుగుతుందనే అంశాలపై ఆరా తీసి కచ్చితమైన చర్యలు తీసుకుంటాం. – ప్రతాప్‌రెడ్డి, ఏడీ, మైనింగ్ విజిలెన్స్ -
చారిత్రక సమాహారం.. బౌద్ధారామం
దక్షిణభారతదేశంలో విశిష్టత వున్న బౌద్ధారామంగా గుర్తించబడిన బొజ్జన్నకొండపై కనుమ పండగనాడు తీర్థం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బౌద్ధమేళాతో మొదలయ్యే ఈ తీర్థానికి గ్రామీణ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రంగు రంగుల పతంగులు, రంగుల రాట్నాలు, నోరూరించే పంచదార చిలుకలు, గుమ గుమలాడే తినుబండారాలు, చిన్నారులు ఇష్టపడే ఆటవస్తువులు, కనువిందు చేసే బుద్ధుని గుహలు ఇలా ఎన్నో చారిత్రక విశిష్టతలు ఈ తీర్థం సొంతం. అనకాపల్లి రేపు బొజ్జన్న కొండపై తీర్థం... ఏర్పాట్లు పూర్తి ఇలా వెలుగులోకి... రెండు దశాబ్దాల చరిత్ర వున్న బొజ్జన్నకొండ 1906లో అలగ్జాండర్ రిమ్ నివేదికతో వెలుగులోకి వచ్చింది. ఇక్కడి పురాతనమైన కట్టడాలు ఎక్కడా లేవని ప్రముఖ చరిత్రకారుడు రాళ్లబండి సుబ్బారావు పేర్కొన్నారు. వడ్డాదిని రాజధానిగా చేసుకొని పరిసర ప్రాంతాలను పాలించిన అర్జునదేవుడు అవసానదశలో ఈ బొజ్జన్నక్షేత్రంలో నివసించారని చరిత్ర చెబుతోంది. క్వారీ పేలుళ్లతో ముప్పు అనకాపల్లి బొజ్జన్నకొండకు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశాలు ఒక వైపు ఉండగా, మార్టూరు సమీపంలోని క్వారీ పేలుళ్ల వల్ల ఇక్కడి శిలా సంపదకు ముప్పు నెలకొంది. బొజ్జన్నకొండపైన దంగోడు గొయ్యిలో రాయివేస్తే మేలు జరుగుతుందని సందర్శకుల విశ్వాసం. వీరంతా చేతికందిన ప్రతిరాయిని దంగోడు గొయ్యిలో వేయడం వల్ల నష్టం జరుగుతోంది. లింగాల మెట్టపై... బుద్ధుని కొండ పక్కనే ఉన్న లింగాల మెట్టపైకూడా అనేకమైన చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. అనేకమైన చైత్యాలతో కూడిన లింగాలమెట్టనే లింగాల కొండగా పిలుస్తున్నారు.లింగాలకొండ మత్స్య ఆకారంలో కనిపించడం మరో విశేషం. దీనిని నమూనాగా తీసుకొని జావా ద్వీపంలో ‘బోరోబూదూరు’ బౌద్ధక్షేత్ర నిర్మాణం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు.{పాధాన్యమున్న బొజ్జన్నకొండను వీక్షించేందుకు, బౌద్ధమేళాలో పాల్గొనేందుకు రష్యా, జపాన్, చైనా, నేపాల్, బర్మా తదితర దేశాల నుంచి బౌద్ధ భిక్షువులు వస్తుంటారు. ర్యాలీతో ప్రారంభమై... కనుమ రోజున ఉదయం పదిగంటలకు నిర్వహించే సమాజ శాంతి ర్యాలీలో బౌద్ధభిక్షవులు పాల్గొంటారు. పదిన్నర గంటలకు బౌద్ద ప్రధాన గుహలో బుద్ధ వందనం, చైత్యవందనం, 12 గంటలకు కొండ దిగువున బౌద్ధమేళా సభను నిర్వహిస్తారు.బౌద్ధ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను విక్రయిస్తారు. బౌద్ద గేయాలాపన, పలు తీర్మానాలు చేస్తారు. విశాఖజిల్లా మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రాచీన కట్టడంగా గుర్తించినా... హామీలు గాలికి... గతంలో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పాలకులు ఇచ్చిన హామీలు అమలు కావడంలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధులు అనేక సార్లు బొజ్జన్న కొండను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వాగ్ధానాలు చేశారు. అయినప్పటికీ బొజ్జన్న కొండ అభివృద్ధిలో ఏ మాత్రం ముందడుగు పడలేదు. బొజ్జన్న కొండను చేరుకునేందుకు రెండు మార్గాలు ఉండగా, శంకరం వైపు రహదారిని మాత్రమే పక్కాగా వేశారు. తుమ్మపాల వైపు నుంచి వేలాది మంది వచ్చేవారు ఏలేరు కాలువ పక్కనుంచి గోతుల రహదారిలో రావాల్సి ఉంది. ఈ రహదారికి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే సైతం హామీ ఇచ్చినా ఇంకా మోక్షం కలగలేదు. పురావస్తు శాఖ నిబంధనలే చిక్కు... బొజ్జన్న కొండను జాతీయ ప్రాధాన్యం కలిగిన స్మారకంగా, ప్రాచీన కట్టడంగా పురావస్తు క్షేత్రాలు, శిథిల అవశేషాల పరిరక్షణ చట్టం 1958 ద్వారా గుర్తించింది. పురావస్తు చట్టం సవరించిన 2010 అధికరణం 30(1) ప్రకారం బొజ్జన్న కొండ పరిసరాలను నిషేధిత , క్రమబద్ధీకరించిన ప్రాంతాలుగా గుర్తించారు. వీటిలో ఎటువంటి నిర్మాణాలు, తవ్వకాలు చేపట్టరాదు. క్రమబద్ధీకరించిన ప్రాంతం, సరిహద్దుకు 100 మీటర్ల దూరంలో పురావస్తు శాఖ అధికారుల అనుమతి తీసుకొని మాత్ర మే కార్యక్రమాలు నిర్వహించాలి. గత ఏడాది బొజ్జన్న కొండ ప్రాంతంలో బౌద్ధ మేళాకు టెంట్ కూడా వేయనీయకపోవడంతో బౌద్ధులు ఇబ్బందులు పడ్డారు. దిల్లీ స్థాయిలోనే అనుమతి పొందాలి బొజ్జన్నకొండకు మూడు కిలోమీటర్ల దూరంలో ఎటువంటి నిర్మాణాలు, కట్టడాలు చేపట్టరాదు. కొద్ది నెలల క్రితం రెవెన్యూ శాఖ అధికారులు సర్వే నిమిత్తం రాగా పై అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించాం. పర్యాటక రంగంగా అభివృద్ధి చేయాలంటే దిల్లీ స్థాయిలోని ఆర్కియాలజీ డెరైక్టర్ అనుమతి తీసుకోవాలి. - లోవరాజు, మల్టీ టాస్క్ స్టాఫ్, బొజ్జన్నకొండ విశేషాలెన్నో... సుమారు 23 ఎకరాల్లో విస్తరించి ఉన్న బొజ్జన్న, లింగాల కొండల్లో ఎన్నో విశేషాలు దాగి వున్నాయి.కొండ దిగువున ‘ హారతి’ అనే బౌద్ధ స్త్రీ మూర్తి శిల్పం ఉండేది. వీరశైవుల ప్రభావంతో మతవిద్వేశంతో ఆ స్త్రీమూర్తి విగ్రహాన్ని పిల్లల్ని హరించే రాకాసిగా చిత్రీకరించి రాళ్లతో కొట్టేవారు. ఈ శిల్పానికి నష్టం వాటిల్లడంతో పురావస్తు శాఖ వారు మ్యూజియంలో భద్రపరిచారు. మతవిద్వేశాలతో ఇక్కడి శిల్ప సంపదకు నష్టం జరిగింది. బొజ్జన్నకొండపై రెండు వరుసల్లో ఆరు గుహల్లో బౌద్ధ శిల్పాలు ఉండేవి. ఇక్కడి బుద్ధుని విగ్రహం శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఎంతో రమణీయంగా కనిపిస్తుంది.30 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తు గల గుహాలయాన్ని 16 స్తంభాలపై నిర్మించారు. నాలుగు అడుగుల ఏకశిలా నిర్మితమైన స్థూపం కొండ మధ్య భాగంలో ఉంటుంది. దీనిని అశోకుని శిలాశాసనంగా చరిత్రకారులు భావిస్తుంటారు. ఈ స్థూపానికి తూర్పుదిశగా మహావిహారం ఉంది. ఇపుడు అది మట్టి దిబ్బగా కనిపిస్తున్నప్పటికీ కిందిభాగాన్ని చూడవచ్చు. ఈ విహారానికి చుట్టూ ఉన్న గదుల్లో దీపప్రమిదలు, ధ్యాన సామగ్రి అమర్చే అరలు ఉన్నాయి.