బొజ్జన్నకొండ బౌద్ధారామం
పచ్చని కొండల నడుమ ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కేలా ప్రకృతి అందాలతో నిండిన బొజ్జన్నకొండ ఘనత ఒక్క అనకాపల్లికో.. ఆంధ్రప్రదేశ్‌కో పరిమితం కాదు. అది దేశానికే తలమానికం. భారతదేశం బౌద్ధాన్ని ప్రపంచానికి పరిచయం చేసినట్టే.. బొజ్జన్నకొండను తొలచి నిర్మించిన శైలేంద్రుల వాస్తు శిల్పం విదేశీయులెందరినో ఆకర్షించింది. 4–6 శతాబ్ద కాలంలో అంతస్తులుగా ఇక్కడ సాగించిన అపురూప నిర్మాణాలు ఇండోనేషియా రాజుల మనసు దోచుకున్నాయి. ఇక్కడి శిల్పకళను అధ్యయనం చేసి, 9వ శతాబ్దంలో వారు నిర్మించిన బొరొబుదూర్ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆ నిర్మాణం మన బొజ్జన్నకొండకు జిరాక్స్ కాపీలా ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ విశేషాల్ని ఓసారి చూద్దాం...
–సాక్షి, విశాఖపట్నం
అనకాపల్లిలో బొజ్జన్నకొండ బౌద్ధారామాల్ని క్రీస్తు శకం 4–6 శతాబ్దంలో నిర్మించారు. కొండలపై ఏకశిలా స్థూపాలు, కొండలో తొలచిన గుహలు ఇక్కడి ప్రత్యేకతలు. ఆశ్రయ స్థలాలుగా చెప్పే నాలుగు గుహల్లో మూడు చోట్ల ధ్యాన బుద్ధ విగ్రహాలున్నాయి. ప్రతి గుహ ద్వారము రెండుపక్కల పెద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. గుహ అంతర్భాగము చతుర్భుజాకారములో ఉండి పదహారు స్తంభాలతో, 20 గదులుగా రాయిని తొలిచి నిర్మించారు. గుహ మధ్యలో చతురస్రాకారపు తిన్నెపై ధ్యాన ముద్రలో గల భూమిస్పర్శ బుద్ధుని విగ్రహం పర్యాటకుల్ని చూపుతిప్పుకోనివ్వదు. బొజ్జన్నకొండపై రెండతస్తుల నిర్మాణాలుంటాయి. ఇటుకలతో కట్టిన విహారాలు, బౌద్ధ భిక్షువుల గదులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. బొజ్జన్నకొండ నిర్మాణాలు ఇప్పటి పర్యాటకుల్నే కాదు.. క్రీస్తుపూర్వం రాజుల్ని కూడా ఆకర్షించాయి. అందుకే.. ఇక్కడ ఉన్న బొజ్జన్నకొండ తరహాలో ఇండోనేషియాలో నిర్మించాలని భావించారు. ఈ నిర్మాణ స్ఫూర్తితోనే అక్కడ కూడా బౌద్ధారామాన్ని నిర్మించారు. ఈ ఆలయం బొజ్జన్నకొండ కంటే ప్రసిద్ధి చెందింది. అదే బొరొబుదూర్ బౌద్ధాలయం.
శైలేంద్రుల వాస్తు శిల్పానికి మచ్చుతునక
బొజ్జన్నకొండ ఓ అద్భుతం అయితే ఇండోనేషియాలోని బొరొబుదూర్ మహాద్భుతం. శైలేంద్రుల వాస్తు శిల్పానికి మచ్చుతునకగా ఈ ఆలయ నిర్మాణం నిలిచింది. ఇండోనేషియాలోని జోగ్ నగరం నుంచి కొద్ది దూరంలో బొరొబుదూర్ ఆలయం ఉంది. బొజ్జన్నకొండ క్రీస్తు శకం 4 నుంచి 6 శతాబ్దికి చెందింది. బొరొబుదూర్ తొమ్మిదో శతాబ్దికి చెందింది. 9వ శతాబ్దంలో విహార యాత్రల్లో భాగంగా ఇక్కడికి వచ్చిన తురుమ రాజులు.. బొజ్జన్నకొండ శిల్పకళా సౌందర్యాన్ని చూసి ముగ్ధులయ్యారు. కచ్చితంగా ఇలాంటి ఆలయాన్నే ఇండోనేషియాలో నిర్మించాలని భావించి.. అక్కడి నుంచి వాస్తు శిల్పుల్ని తీసుకు వచ్చి..సుమారు ఏడాది పాటు ఇక్కడే ఉండి.. ఆలయం అణువణువూ పరిశీలించి.. ఛాయాచిత్రాల్ని గీశారు. అయితే.. బొజ్జన్నకొండ కంటే.. బొరొబుదూర్ మరింత అద్భుతంగా ఉండాలని భావించిన తురుమ రాజులు అదే మాదిరిగా నిర్మాణం చేపట్టి.. రెండంతస్తులు కాకుండా.. తొమ్మిది అంతస్తుల్లో నిర్మించారు.
అందుకే బొరొబుదూర్ ప్రపంచ వింతల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న బొరొబుదూర్ ఆర్కియాలాజికల్ పార్క్‌లో పెద్ద చతురస్రాకార భవనంలా ఈ స్థూపం కన్పిస్తుంది. 35 మీటర్ల ఎత్తులో మండలం ఆకారంలో తొమ్మిది అంతస్తులుగా దీన్ని నిర్మించారు. ఓ పెద్ద కొండనంతా తొలచి స్థూపంలా మలిచారు. రెండు అంతస్తులుగా ఉండే బొజ్జన్నకొండలో కూడా కొండను తొలచి బుద్ధుడి విగ్రహాలను చెక్కారు. ఓ గూడులాంటి అమరికలో బుద్ధుడి విగ్రహాలను ప్రతిష్టించారు. రెండింటిలో సారూప్యత కొట్టొచ్చినట్టుగా కన్పిస్తుంది. మొత్తం 504 బుద్ధ విగ్రహాలు ఈ స్థూపంలో ఉన్నాయి. ఈ విగ్రహాల అమరిక మొత్తం ఇక్కడ ఉన్న బొజ్జన్నకొండను పోలి ఉంటుంది.
బౌద్ధారామాలకు బొజ్జన్నకొండ ఆదర్శం
బొజ్జన్నకొండలో అద్భుతంగా ఉన్న ఏకశిలా స్థూపాలు, కొండలో తొలచిన గుహలు.. ప్రపంచంలోని అన్ని బౌద్ధారామాలకు ఆదర్శం. ఎక్కడా లేని విధంగా ఉన్న ఈ కట్టడాలు ఇక్కడ ఉండడం వల్లే దీన్ని ఆదర్శంగా తీసుకొని బొరొబుదూర్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు బొజ్జన్నకొండను చూసిన అనుభూతి కలుగుతుంది. మొదటి అంతస్తులో బుద్ధుడి జీవితానికి సంబంధించిన కథలు గోడలపై శిలాఫలకాలుగా ఉంటాయి. ప్రతి అంతస్తుకూ ఒక ప్రత్యేకత ఉంటుంది.
– డీపీ అనురాధ, చరిత్రకారిణి
Comments
Please login to add a commentAdd a comment